అమెరికాలో ‘సొంత ఇల్లు’ ఇక పగటి కలేనా?
ప్రస్తుతం అమెరికాలో ఇళ్ల ధరలు సామాన్యులకు, మధ్య తరగతి కుటుంబాలకు ఏమాత్రం అందుబాటులో లేని స్థాయికి చేరుకున్నాయి.;
అమెరికాలో స్థిరపడాలి.. మంచి ఉద్యోగం చేయాలి.. ఒక సొంత ఇల్లు కొనాలి. ఇది ఎంతోమంది భారతీయుల.. ముఖ్యంగా ఐటీ, హెల్త్ కేర్ రంగాల్లోని నిపుణుల చిరకాల స్వప్నం.. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే ఆ ‘ఆమెరికన్ డ్రీమ్’ నెమ్మదిగా కరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఇళ్ల ధరలు సామాన్యులకు, మధ్య తరగతి కుటుంబాలకు ఏమాత్రం అందుబాటులో లేని స్థాయికి చేరుకున్నాయి.
బాంబుపేల్చిన ‘బ్యాంక్ రేట్’ నివేదిక
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ‘బ్యాంక్రేట్’ డిసెంబర్ 2025లో విడుదల చేసిన తాజా విశ్లేషణ ప్రకారం.. అమెరికా హౌసింగ్ మార్కెట్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అమెరికాలో ప్రస్తుతం అమ్మకానికి ఉన్న ఇళ్లలో 75 శాతానికి పైగా ఇళ్లు సగటు ఆదాయం ఉన్న కుటుంబాలకు అందుబాటులోలేవు. అమెరికాలో ఒక సగటు కుటుంబ వార్షిక ఆదాయం సుమారు 80,000 డాలర్లు. కానీ అక్కడ ఒక సాధారణ ఇల్లు సుమారు 4.35 లక్షల డాలర్లు విలువైనది కొనాలంటే మాత్రం ఆ కుటుంబానికి కనీసం 1.13 లక్షల డాలర్ల వార్షిక ఆదాయం ఉండాలి. అంటే సగటు అమెరికన్ కుటుంబం ఇల్లు కొనలేనంతగా ఆర్థిక అంతరం పెరిగిపోయింది.
అసలు ఎందుకిలా జరుగుతోంది?
ఈ పరిస్థితికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 4.7 మిలియన్ల (47 లక్షల) ఇళ్ల కొరత ఉంది. జనాభా, డిమాండ్ పెరుగుతున్నా దానికి తగ్గట్టుగా కొత్త ఇళ్ల నిర్మాణం జరగడం లేదు. ‘డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ’ అన్న సూత్రం ప్రకారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఒక వైపు ఇళ్ల ధరలు పెరుగుతుంటే.. మరోవైపు ఉద్యోగ భద్రత ప్రశ్నార్ధకంగానే మారుతోంది. బడా కంపెనీల్లో లేఆఫ్స్ సర్వసాధారణం అయ్యాయి. రేపు ఉద్యోగం ఉంటుందో లేదో అన్న భయం కారణంగా చేతిలో డబ్బు ఉన్నవారు కూడా ఇల్లు కొనడానికి సాహసించడం లేదు.
భారతీయుల పరిస్థితి ఏమిటి?
అమెరికా హౌసింగ్ మార్కెట్ సంక్షోభం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హెచ్1బీ వీసాలపై ఉన్న ఆంక్షలు, గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల నిరీక్షణ ఇప్పటికే భారతీయులను కలవరపెడుతున్నాయి. ఉద్యోగ భద్రత లేకపోవడం.. వీసా స్టేటస్ పై స్పష్టత లేకపోవడంతో లక్షల డాలర్లు వెచ్చించి ఇల్లు కొనడం రిస్క్ అని చాలా మంది భావిస్తున్నారు. ఫలితంగా ఒకప్పుడు అమెరికా వెళ్లగానే ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకునే భారతీయులు ఇప్పుడు ఆ ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. లేదంటే పూర్తిగా విరమించుకుంటున్నారు.
మొత్తానికి అమెరికా మధ్య తరగతి ప్రజలకు సొంతిళ్లు అనేది ఇప్పట్లో నెరవేరని కలగానే మిగిలిపోయేలా ఉంది. ఉద్యోగ మార్కెట్ మళ్లీ పుంజుకుని ఇళ్ల సరఫరా పెరిగితే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రావడం కష్టం. అప్పటివరకూ అద్దె ఇళ్లే దిక్కు అన్నట్టుగా పరిస్థితి తయారైంది.