గొడ్డలి...వైసీపీని గట్టిగానే గుచ్చుకుంటోందా ?
వైసీపీ రాజకీయ వ్యూహాలు ఏంటో కానీ స్పందించాల్సిన వాటి మీద చాలా లేటుగా రియాక్ట్ అవుతారని అంటారు.;
వైసీపీ రాజకీయ వ్యూహాలు ఏంటో కానీ స్పందించాల్సిన వాటి మీద చాలా లేటుగా రియాక్ట్ అవుతారని అంటారు. అప్పటికే జరగాల్సినది జరిగిపోతుందని కూడా పార్టీలోనూ అంతర్మధనం చెందుతూ ఉంటారు. ప్రభుత్వంలో ఉన్నపుడు కానీ అంతకు ముందు విపక్షంలో ఉన్నపుడు కానీ ప్రత్యర్ధులు చేసే ఘాటు విమర్శల మీద వెంటనే రియాక్ట్ కాకపోవడం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. రాజకీయాల్లో టైం టైమింగ్ ఈ రెండూ చాలా ముఖ్యం. ఈ విషయంలో వైసీపీ ఎపుడూ వెనకబాటుతోనే ఉంటోంది అని అంటున్నారు.
వ్యూహాత్మకంగానే టీడీపీ :
తెలుగుదేశం పార్టీ వైసీపీని విమర్శించే విషయంలో ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో సిద్ధంగా ఉంటుంది. అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు అయిదేళ్ళూ జగన్ ని సైకో అంటూ వైసీపీని సైకో పార్టీ అని విపరీతంగా టీడీపీ ప్రచారం చేసింది. దానిని వైసీపీ సీరియస్ గా తీసుకోలేదు, ఫలితాలు వచ్చిన తరువాత ఏమి జరిగింది అన్నది బోధపడింది అని అంటున్నారు. ఇపుడు కొత్తగా గొడ్డలి పార్టీ అని వైసీపీకి పేరు పెట్టి టీడీపీ పెద్ద ఎత్తున జనంలోకి దానిని ప్రచారం చేస్తోంది. ఇది చాలా రోజులుగా జరుగుతోంది. అయితే వైసీపీ ఇపుడు ఆలస్యంగా మేలుకొంది. అందుకే వరసబెట్టి తమ పార్టీకి చెందిన మాజీ మంత్రుల చేత కౌంటర్లు ఇప్పిస్తోంది.
గునపం పార్టీ అంటూ :
ఇక మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధనరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ తమది గొడ్డలి పార్టీ అని ప్రచారం చేస్తున్న చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు. మామ పార్టీకి గునపం పెట్టి వెన్నుపోటు పొడిచింది బాబు కాదా అని ప్రశ్నించారు. ఆ మీదట ప్రతీ ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇవ్వడం వాటిని నెరవేర్చకుండా గునపంతో జనాలను వెన్నుపోటు పొడవడం కూడా బాబుకు అలవాటే అని ఆయన ఫైర్ అయ్యారు. మీ పార్టీ గునపం పార్టీ అందుకే గునపం గుర్తునే పెట్టుకోవాలని ఆయన సూచించారు. ఆయన తరహాలో మరింత మంది మాజీ మంత్రులు నాయకులు కూడా టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారు.
న్యూట్రల్ సెక్షన్లలో :
ఈ తరహా విమర్శలు కానీ ప్రచారం కానీ న్యూట్రల్ సెక్షన్లలో తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని అంటున్నారు విద్యావంతులు మేధావులు అలాగే చదువరులు ఉద్యోగస్తులు తటస్థులలో వీటి మీద చర్చ సాగుతూ ఉంటుంది. ఈ సెక్షన్లు ఎన్నికల సమయంలో కీలకంగా మారుతారు. మౌత్ పబ్లిసిటీ ద్వారా వీరి అభిప్రాయాలు మిగిలిన జనాలకు చేరి ఫలితం మీద పడుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే టీడీపీ వైసీపీ విషయంలో ఎప్పటికపుడు కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. కానీ వైసీపీ మాత్రం ఇవేమీ పట్టినట్లుగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతోంది అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
ఇపుడు గొడ్డలి అంటే వైసీపీ గుర్తుకు వచ్చేలా ఉధృతమైన ప్రచారం సాగిన నేపథ్యంలో వైసీపీ గునపం అని వెన్నుపోటు అని టీడీపీ మీద కౌంటర్లు వేస్తోంది. మరి ఇవి జనంలోకి ఏ మేరకు వెళ్తాయి ఒక వేళ వెళ్తే ఈ రెండింటి మీద జనాలలో చర్చ జరిగి వారు ఏ వైపు మొగ్గు చూపిస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే గొడ్డలి పార్టీ అని అంటూంటే వైసీపీకి ఎక్కడో గట్టిగా గుచ్చుకుంటోంది అని అంటున్నారు. మరి వైసీపీ సున్నితత్వం మీదనే టీడీపీ దెబ్బ కొడుతూ రాజకీయ రచ్చకు తెర తీస్తోందా అన్నదే అసలైన చర్చ.