జగన్ అండ్ నవీన్ ...ఈసీ వ్యతిరేక పోరాట బాట ?
దేశంలో ప్రస్తుతం కేన్ర ఎన్నికల సంఘం మీద విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నాయి.
దేశంలో ప్రస్తుతం కేన్ర ఎన్నికల సంఘం మీద విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నాయి. సర్ ప్రక్రియతో ప్రతిపక్ష ఓట్లకు పెద్ద ఎత్తున గండి పెడుతూ ఏకపక్ష వైఖరితో ఈసీ ముందుకు సాగింది అని ఇండియా కూటమి అయితే మండిపడుతోంది. అందుకు గానూ తక్షణం ఈసీసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ వరసబెట్టి చేస్తున్న ఆందోళనలలో సీజేపీ కూడా చేరనుంది. ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ చేపట్టే భారీ నిరసనలతో దేశ రాజకీయాలు కొత్త మలుపు తీసుకోనున్నాయని అంటున్నారు. దాంతో దేశవ్యాప్తంగా మరింతగా ఈసీ వ్యతిరేక ఉద్యమం విస్తరిస్తుందని అంటున్నారు. దాని ప్రభావం ఏపీ ఒడిశా లాంటి రాష్ట్రాల మీద పడనుంది అని అంటున్నారు. ఎన్నికల సంఘం గతంలో తీసుకున్న ఏకపక్ష విధానాల వల్లనే తమకు నష్టం చేకూరింది అని భావించే బాధిత రాజకీయ పక్షాలు కూడా ఇపుడు ఢిల్లీలో సాగే ఈసీ వ్యతిరేక ఉద్యమ బాట పడతాయని అంటున్నారు.
దారుణ ఫలితాలు :
ఇక చూస్తే 2024 లో లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ ఒడిషా శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఒడిషాలో నవీన్ పట్నాయక్ నిరాటంకమైన అధికారానికి తొలిసారి బీజేపీ బ్రేకులు వేసి అధికారం అందుకుంది. దాంతో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని బిజూ జనతాదళ ఆనాడే గట్టిగా విమర్శించింది. ఏపీలో అయితే వైసీపీ కూడా ఈవీఎంల పని తీరు మీద అనుమానాలు వ్యక్తం చేసింది. అదే విధంగా పోలింగ్ సమయం దాటిన తరువాత అధిక పోలింగ్ అర్ధ రాత్రి దాకా నమోదు అయింది అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇపుడు తమ వాదనకు తగిన రాజకీయ వేదిక బలమైన గొంతుకలు తోడు అయ్యాయని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయని అంటున్నారు. దాంతో జగన్ అండ్ నవీన్ ఢిల్లీలో సాగుతున్న ఈసీ వ్యతిరేక పోరాటానికి తొందరలోనే మద్దతుగా నిలవవచ్చు అని అంటున్నారు.
బీజేపీకి దూరంగానే :
బీజేపీకి సన్నిహితంగా ఉంటూ పరోక్ష మద్దతు ఇస్తూ వచ్చిన తటస్థ పార్టీలలో ఏపీలో వైసీపీ ఒడిషాలో బిజూ జనతాదళ్ ఉన్నాయి. అయితే తాము ఘోరంగా ఓటమి పాలు కావడం వెనక ఎన్నికల్లో అక్రమాలే కారణం అని నమ్ముతున్న ఈ రెండు పక్షాలు ఇపుడు సరైన అవకాశం దొరికింది అని భావిస్తున్నాయని అంటున్నారు. దాంతో దేశవ్యాప్తంగా సాగుతున్న సీఈసీ రాజీనామా డిమాడ్ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాలు పంచుకోవడానికి చూస్తున్నాయని అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీ ఒడిషాలోనే కాదు దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణలలో భారీ మార్పులు సంభవిస్తాయని అంటున్నారు.
ఏపీలో డైరెక్ట్ గానే :
ఏపీలో చూస్తే నిన్నటి దాకా రాజకీయం ఒకలా ఉందని అంతా అంటూ వచ్చారు. ఎన్డీయేకి ప్రత్యక్షంగా కొన్ని పార్టీలు పరోక్షంగా మరి కొన్ని పార్టీలు మద్దతు ఇస్తూ వస్తున్నాయని చెప్పుకునే వారు. అయితే ఈసీ చుట్టూ సాగుతున్న రాజకీయాలతో వైసీపీ వంటి పార్టీలు అడ్వాంటేజ్ గా తీసుకుంటాయని అంటున్నారు. మారే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీ ఈ విధంగా డైరెక్ట్ గానే బీజేపీ మీద ఎటాక్ చేస్తే ఏపీలో టీడీపీ జనసేన మరింత దూకుడు చూపిస్తాయని అంటున్నారు. మరో రెండున్నరేళ్ళ పాటు కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉంటుంది. అలాగే ఏపీలో ఎన్డీయే సర్కార్ ఉంటుంది. ఢీ అంటే ఢీ అంటూ సాగే ఈ పోరు సరికొత్త రాజకీయ పునరేకీకరణకు దారి తీసే చాన్స్ ఉందని అంటున్నారు. మరి ఇండియా కూటమిలో వైసీపీ బిజూ జనతాదళ్ చేరుతాయా అంటే ప్రస్తుతానికి సీఈసీ మీద పోరుకే పరిమితం అవుతారని అంటున్నారు. చూడాలి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో.