కేసీఆర్, జగన్ ఇద్దరూ కలిసి మా ఫోన్లు ట్యాప్ చేశారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.;

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఈ వ్యవహారంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిల పాత్ర ఉందని ఆమె ఆరోపించారు.
షర్మిల మాట్లాడుతూ.. "బీఆర్‌ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది నిజం. అప్పటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ ఇది కావొచ్చు. అయితే నా ఫోన్, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతున్నాయని నాకు స్పష్టంగా అర్థమైంది. మా ఇంటికి వైవీ సుబ్బారెడ్డి వచ్చి ఈ విషయాన్ని చెప్పడమే కాకుండా ఆ సమయంలో ఓ ఫోన్ కాల్ సంభాషణను కూడా వినిపించారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం" అని షర్మిల పేర్కొన్నారు.
-దర్యాప్తునకు డిమాండ్:
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాలని షర్మిల డిమాండ్ చేశారు. "ఈ కుట్రలో భాగమైన వారందరికీ తగిన శిక్ష పడాలి. ఇది వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన. నాకూ, నా కుటుంబానికి కూడా ఇది పెద్ద ముప్పుగా మారింది. ఇలాంటి అక్రమాలు తిరిగి జరగకూడదు" అని ఆమె హెచ్చరించారు.
-రాజకీయ ప్రకంపనలు:
వైఎస్ షర్మిల చేసిన ఈ ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా తీవ్ర కలకలం రేపాయి. ఈ అంశంపై అధికార, విపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజానిజాలు వెలుగులోకి రావాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికార వర్గాల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.