''మీ పార్టీ వారిని నాయకులు అనాలా.. కుక్కలు అనాలా?'' వైసీపీపై షర్మిల ఫైర్

తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో నెలకొన్న ఆస్తుల వివాదంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.;

Update: 2026-03-23 14:04 GMT

తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో నెలకొన్న ఆస్తుల వివాదంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదంపై జగన్ తల్లి విజయమ్మ లేఖ రాసిన తర్వాత కూడా వైసీపీ నేతలు మాట్లాడటాన్ని షర్మిల ప్రశ్నించారు. తమ ఆస్తుల వివాదంపై వైసీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు ఎందుకు కలగజేసుకుంటున్నారని షర్మిల నిలదీశారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ కు దమ్ము, ధైర్యం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ పార్టీ వారిని నాయకులు అనాలా? కుక్కలు అనాలా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలను సైతాన్ సైన్యం అంటూ అభివర్ణించారు.

వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదంపై వైసీపీ నాయకులు మాట్లాడటాన్ని షర్మిల ఆక్షేపించారు. తన పోరాటం ఆస్తుల కోసం కాదని వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తావిస్తే ఆస్తుల వివాదంపై మాట్లాడుతున్నారని షర్మిల ధ్వజమెత్తారు. ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తోంది తాను కాదంటూ విమర్శలు గుప్పించారు. ‘‘నా పోరాటం, అజెండా ఆస్తులు కాదు, ఆస్తులే నా అజెండా అయితే ఎప్పుడో కోర్టుకు వెళ్లేదానిని అంటూ షర్మిల స్పష్టం చేశారు. ఆస్తులపై విజయమ్మ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించారు.

లేఖ ద్వారా విజయమ్మ వాస్తవాలు చెప్పారని, అయినా వైసీపీ నేతలు మెురుగుతున్నారని షర్మిల మండిపడ్డారు. విజయమ్మ విడుదల చేసిన లేఖ నిజం కాదని చెబుతున్నారు, విజయమ్మపై ఒత్తిడి చేసి సంతకం పెట్టించానని ఆరోపిస్తున్నారు, ఒకవేళ నేను ఒత్తిడి చేస్తే... ఈ సంతకం నాది కాదని విజయమ్మ చెప్పలేరా? అంటూ షర్మిల ప్రశ్నించారు. విజయమ్మ లేఖ వాస్తవమని తెలుసు కాబట్టే జగన్‌ మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. జగన్‌ తన సైన్యంతో సోషల్‌మీడియాలో మాట్లాడించడం ఎందుకు? జగన్‌కు మాట్లాడే దమ్ము, ధైర్యం లేదా? అంటూ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. సాక్షిలో తన తండ్రి రాజశేఖరరెడ్డి ఫొటోతోపాటు సత్యమేవ జయతే అని రాస్తారని కానీ అన్నీ అసత్యాలే ఉంటాయని షర్మిల ఆరోపించారు. సాక్షిలో విజయమ్మ లేఖను కనీసం చివరి పేజీలో అయినా వేశారా? అంటూ నిలదీశారు.

నలుగురు మనవళ్లకు ఆస్తి సమానంగా ఉండాలని తన తండ్రి రాజశేఖరరెడ్డి చెప్పారని, దానిపైనే తన తల్లి లేఖ రాసిందని షర్మిల తెలిపారు. జగన్ అన్యాయం చేస్తున్నారని, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విజయమ్మ లేఖ రాశారని షర్మిల చెప్పారు. అసలు తెలియని వారు ఎందుకు మాట్లాడుతున్నారని విజయమ్మ నిలదీశారని, హుందాతనం ఉంటే ఎవరైనా ఈ విషయమై మాట్లాడకూడదని, అయినా వైసీపీ వారు మాట్లాడుతున్నారంటే ‘‘మొరగడం కుక్కల నైజం’’ అనుకోవాలని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మాజీ సీఎం జగన్మోహనరెడ్డితో షర్మిలకు ఆస్తులపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కోర్టుల్లోనూ న్యాయవివాదం నడుస్తోంది. అయితే మాజీ సీఎం జగన్ ను రాజకీయంగా దెబ్బతీయడానికే షర్మిలను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై పలు రకాలుగా పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక సోమవారం మీడియా ముందుకు వచ్చిన మాజీ మంత్రి కొడాలి నాని సైతం జగన్ చెల్లెళ్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నా జగన్ తన సంస్కారం వల్ల ఒక్క మాట అనడం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యలో షర్మిల వైసీపీ నేతలు మొరుగుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం విస్తృత చర్చకు దారితీసిందని అంటున్నారు.

Tags:    

Similar News