టీడీపీ కూటమిలో వైసీపీ గవర్నమెంట్...ఇది ఏంది లెక్క ?

అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం కొందరు అధికారులు తమకు చిత్తం వచ్చినట్లుగా వ్యవహరించారు అని అంటున్నారు.;

Update: 2025-06-14 15:30 GMT
టీడీపీ కూటమిలో వైసీపీ గవర్నమెంట్...ఇది ఏంది లెక్క ?

ఏపీలో ఉన్నది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఈ విషయం అందరికీ ఎరుకే. కానీ కొన్ని కీలక ప్రభుత్వ శాఖలలో ఈ రోజుకీ వైసీపీ సానుభూతిపరులకే పదవులు దక్కుతున్నాయని అంటున్నారు. అంతే కాదు అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి కొమ్ము కాసి సానుభూతిపరులుగా ఉన్న అధికారులను కీలక విభాగాల్లో ముఖ్య పదవులలో నియమించడం మీద అతి పెద్ద చర్చ సాగుతోంది.

విషయంలోకి వస్తే డ్వాక్రా మహిళా స్వయం ఉపాధి కల్పనలో కీలకంగా ఉన్న గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ ని మొత్తానికి మొత్తంగా వైసీపీ వారితోనే అధికారులు నింపుతున్నారన్న విమర్శలు ఇపుడు గుప్పుమంటున్నాయి. ఇక వైసీపీ వారిని అందలం ఎక్కించేందుకు కోరి మరీ తెచ్చుకుంటున్నారు అని అంటున్నారు.

ఇక వారి నియామకాల కోసం సిఫార్సు లేఖలు టీడీపీ ఎమ్మెల్యేలు ఇస్తూ మరింతగా ప్రొత్సహిస్తున్నారు అని అంటున్నారు. ఇలా సెర్ఫ్ అన్నది పూర్తిగా వైసీపీ వారి కోసమే అన్నట్లుగా ఇపుడు పరిస్థితి ఉంది అని అంటున్నారు. వైసీపీకే ఓటు వేస్తామని చెప్పిన వారిని గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేసిన వారిని ఏకంగా ఎన్నికల్లో వైసీపీ తరఫున డబ్బులు పంచిన వారిని సైతం తెచ్చి మరీ నియమిస్తున్నారు అంటే ఇది ఏమిటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

సెర్ఫ్ లో చూస్తే రాష్ట్ర కార్యాలయాలలో కీలక పదవులలో ఇపుడు వైసీపీ సానుభూతిపరులు అయిన అధికారులు కొలువు తీరారు అని అంటున్నారు. అంతే కాదు ఇతర అనేక విభాగాలలో సైతం వైసీపీ వారే అగ్ర తాంబూలం అందుకుంటున్నారు అని అంటున్నారు.

చిత్రమేంటి అంటే కీలక విభాగాలలో డైరెక్టర్లు వంటి ముఖ్య పోస్టులలో వీరే ఉన్నారు. ఇపుడు తమ కిందన ఉండే వారిని సైతం వైసీపీ సానుభూతిపరులనే నియమించుకోవడంతో ఇది మెల్లగా రాజకీయ చర్చగా మారుతోంది. న్యాయంగా చూస్తే అధికారులు కూడా మనుషులే. అయితే వారికి రాజకీయంగా వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ఎన్ని ఉన్నా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాల్సి ఉంటుంది.

అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం కొందరు అధికారులు తమకు చిత్తం వచ్చినట్లుగా వ్యవహరించారు అని అంటున్నారు. వారు ఏకంగా వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించారు అని చెబుతున్నారు. వైసీపీకే ఓటు వేయాలని గ్రౌండ్ లెవెల్ లో వీఏవోలపైన కూడా ఒత్తిడి తెచ్చారు అని అంటున్నారు.

ఇలా చేసిన ఒక ఇద్దరు అధికారులను ఇపుడు ఏకంగా రాష్ట్ర కార్యాలయానికే బదిలీల మీద తీసుకుని వస్తున్నారు అనందే పెద్ద ఎత్తున సెర్ఫ్ లో చర్చగా ఉందిట. ఇక వీరికి సెర్ఫ్ లో కీలకమైన ప్రాధాన్యత కలిగిన పదవులే ఇస్తున్నారు అని అంటున్నారు. వీరే కాకుండా వైసీపీకి ఫుల్ సపోర్ట్ అని పేరు ఉన్న ఒక మహిళా అధికారిణికి కూడా సెర్ఫ్ హెడ్ ఆఫీసుకే బదిలీ మీద తీసుకుని వచ్చేందుకు ఆమోదించారు అని అంటున్నారు.

వీరంతా సమర్ధులైన అధికారులు అన్న పేరుతో ఈ బదిలీలతో కీలక పోస్టింగులు ఇస్తున్నారు అని అంటున్నారు. సెర్ఫ్ పరిధిలోకి వచ్చే స్త్రీనిధి విభాగంలో ఇదే జరుగుతోంది అని అంటున్నారు. అక్కడ కూడా కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి అంజాద్ భాషాకు మద్దతుగా ఉండే ఒక అధికారిని తెచ్చి ఇటీవలే నియమించారు. అయితే ఈ బదిలీ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

దాంతో ఆయనకు ఏకంగా అదే కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలే సిఫార్సు లెటర్ ఇచ్చారని అలా ఆయన పదవిలో నిక్షేపంగా కొనసాగుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఇపుడు మరో విషయం గుప్పుమంటోంది. అదేంటి అంటే ఇక్కడే పనిచేస్తున్న మరో ఇద్దరు అధికారులు వైసీపీకి కోవర్టులుగా పనిచేస్తున్నారని అంటున్నారు.

ఇక చూస్తే ఇదే మొదటి సారి కాదని, 2014 నుంచి 2019 మధ్యలో సాగిన టీడీపీ పాలనలో సైతం కొందరు అధికారులు వైసీపీకి కోవర్టులుగా వ్యవహరించారు అని చెబుతున్నారు. ఏకంగా ఒక కీలక విభాగానికి డైరెక్టర్ స్థాయిలో పనిచేసే ఒక అధికారి అయితే వైసీపీకి సెర్ఫ్ రోజు వారీ కార్యక్రమాల గురించి కూడా వివరించేవారు అని గుర్తు చేస్తున్నారు. ఫలితంగా ఆ అధికారికి వైసీపీ అధికారంలో ఉన్నపుడు కంఫర్డ్ ఐఏఎస్ గా పదోన్నతి దక్కింది అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే కనుక సెర్ఫ్ అంటే అతి ముఖ్య విభాగం. ఏపీ రాజకీయాలు మహిళలతో ముడిపడి ఉన్నాయి. అలాంటి మహిళలకు సంబంధించిన సంబంధం ఉన్న శాఖ. గ్రామీణ ప్రాంతానికి సంబంధం ఉన్న శాఖ. అక్కడ వైసీపీ సానుభూతిపరులను నియమించడం అంటే ఇది కూటమి ప్రభుత్వమా లేక వైసీపీ వారి జమానానా అన్న డౌట్లు అంతా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News