ప్రపంచ నేతలు.. ఒకప్పుడు ఏం చేశారు..
ప్రతీ గొప్ప నాయకుడు పుట్టగానే నాయకుడుకాదు.. ఆయన జీవిత పయనం ఆ వైపునకు తీసుకెళ్తుంది. పుట్టిన ప్రతి వ్యక్తి సాధారణ మనిషే..;
వారు ప్రపంచ రాజకీయాల రూపకర్తలు, అంతర్జాతీయ ఒప్పందాల మాస్టర్లు, సైనిక వ్యూహాల నిర్ణేతలు. కానీ ఒకప్పుడు వీరంతా కూడా మనలాగే సాధారణ ఉద్యోగాలు చేస్తూ.. చిన్న చిన్న ఆశలతో.. పెద్ద కలలు కన్న వారే. ప్రపంచం వారిని ఇప్పుడు ‘నాయకులు’ అని పిలుస్తుంది, కానీ వారి జీవిత కథల్లో ‘మానవత్వం’ అనే అధ్యాయం ఎప్పటికీ దాగి ఉంటుంది. శక్తి శిఖరానికి చేరిన ఈ నేతల గతం మనకు ఒక సరళమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. ప్రతీ గొప్ప నాయకుడు పుట్టగానే నాయకుడుకాదు.. ఆయన జీవిత పయనం ఆ వైపునకు తీసుకెళ్తుంది. పుట్టిన ప్రతి వ్యక్తి సాధారణ మనిషే..
ఎవరెవరు ఏం పని చేశారంటే..?
భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా దేశంలో గుర్తింపు పొందారు. పీవీ నర్సింహారావు సమయంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని ఆర్థిక వలయంలో పడకుండా కాపాడారు. ఇతను గతంలో ఒక సాధారణమైన ఆర్థిక ప్రొఫెసర్. ఆయన తన జీవితాన్ని శాంతంగా, అధ్యయనంగా ప్రారంభించారు. కేమ్‌బ్రిడ్జ్ నుంచి డాక్టరేట్ పొందిన తర్వాత పబ్లిక్ సర్వీస్‌లోకి అడుగుపెట్టిన ఆయన, దేశ ఆర్థిక విధానాలకు మేధస్సు అందించారు. నేడు మనం చూసే భారత ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది ఆయన తరగతి గదుల్లోనే అని చెప్పడం అతిశయోక్తి కాదు.
ఇక జర్మనీ మాజీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ గురించి మాట్లాడితే.. ఆమె రాజకీయాల్లోకి రావడానికి ముందు ఒక శాస్త్రవేత్త. క్వాంటమ్ కెమిస్ట్రీలో డాక్టరేట్ పూర్తి చేసి, పరిశోధనా రంగంలో పనిచేశారు. ఈ శాస్త్రీయ మైండ్‌సెట్‌నే ఆమె నాయకత్వానికి మూలమైంది. సమస్యలను భావోద్వేగంతో కాకుండా తర్కంతో పరిష్కరించగల సామర్థ్యం ఆమెను యూరోపియన్ రాజకీయాల్లో ‘స్టబిలిటీ ఐకాన్’గా నిలిపింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కథ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రాజకీయ వేదికపైకి రాకముందు ఆయన ఒక కమెడియన్, నటుడు. వ్యంగ్యంతో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. అదే వేదికను తన నాయకత్వానికి మెట్టుగా మార్చుకున్నాడు. యుద్ధ సమయాల్లో కూడా తన ప్రజలకు చిరునవ్వు, ధైర్యం ఇచ్చిన ఈ నాయకుడు, ‘కమెడియన్ నుండి కమాండర్’గా మారిన వ్యక్తి జీవితం స్ఫూర్తిదాయకమే..
ఇక బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ గురించి చెప్పుకోవాల్సిందే.. చరిత్రలో అత్యంత కఠినమైన సమయాల్లో, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్‌ను నడిపించిన ఈ నేత రాజకీయాల పక్కన చిత్రకళలోనూ మునిగిపోయేవాడు. యుద్ధాల అల్లకల్లోలంలో కూడా అతడు పూలు, ప్రకృతి అందంతో కూడిన దృశ్యాలను చిత్రించేవాడు. అది ఆయనకు ధ్యానంలా పని చేసేది. మనుషులలోని సృజనాత్మక కోణం కఠిన సమయాల్లో కూడా జీవితంపై ప్రేమను నిలబెట్టగలదని చర్చిల్ నిరూపించాడు.
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తన యవ్వనంలో ఒక పబ్లిక్ ఫూల్‌లో లైఫ్‌గార్డ్‌గా పనిచేశాడు. ఆ రోజుల్లో అతడు జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అనుభవం తర్వాతి రాజకీయ జీవితానికి బలమైంది. నీటిలో మునిగే వారిని రక్షించడం నుంచి, అన్యాయంతో మునిగిపోయే సమాజాన్ని నిలబెట్టడం వరకు.. బైడెన్ మార్గం మానవతతో నిండి ఉంది.
అదే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. తన మొదటి ఉద్యోగం ఒక ఐస్‌క్రీమ్ షాప్‌లో స్కూపర్. ‘ఆ సమయంలో ఐస్‌క్రీమ్ తినడం నాకు ఇష్టం ఉండేది, కానీ అక్కడ పనిచేసిన తర్వాత దానిని తినడం మానేశా,’ అని ఆయన ఒక సందర్భంలో నవ్వుతూ చెప్పారు. కానీ ఆ చిన్న ఉద్యోగం ఆయనకు క్రమశిక్షణ, ప్రజలతో మాట్లాడే ధైర్యం నేర్పింది. అవే నైపుణ్యాలు ఆయనను వైట్‌హౌస్ వరకు తీసుకెళ్లాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాజకీయాల్లోకి రాకముందు, సోవియట్ యూనియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కేజీబీలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పనిచేశారు. రహస్య ఆపరేషన్లు, వ్యూహాలు, మానవ మానసిక శక్తిపై ఆయనకు ఉన్న అవగాహన ఆయన నాయకత్వంలో అగ్రభాగాన నిలిపింది. ఆయన రాజకీయ వ్యూహాల్లో ‘ఇంటెలిజెన్స్ థింకింగ్’ ఎప్పుడూ కనిపిస్తుంది.
ఇక ప్రపంచాన్ని గెలిచిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఛాయ్ వాలాగా జీవితం మొదలు పెట్టిన ఆయన నేడు గ్లోబల్ లీడర్ గా ఎదిగాడు. ఇప్పటికీ తాను చాయ్ వాలానేనని చెప్పడం ఆయన దార్శనికతకు ప్రతీక.
ఈ కథలన్నీ స్ఫూర్తినిచ్చేవే..
ఈ కథలన్నీ ఒకే విషయం చెబుతున్నాయి. నాయకత్వం అనే గుణం, పదవితో రాదు.. అది జీవన అనుభవాలతో వస్తుంది. ప్రతి ఉద్యోగం, ప్రతి అనుభవం, కష్టాల్లో ఉన్న ప్రతి సమయం ఇవన్నీ ఒక నాయకుడిని రూపుదిద్దే పాఠాలు. వారి ప్రయాణాలు మనకు స్ఫూర్తి. నేడు మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు.. మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామన్నదే ముఖ్యం. లెక్చర్ ఇచ్చిన ప్రొఫెసర్ ప్రధానమంత్రిగా మారవచ్చు, ఐస్‌క్రీమ్ స్కూప్ చేసిన యువకుడు అమెరికాను నడపవచ్చు, కామెడీ చేసిన వ్యక్తి యుద్ధంలో దేశాన్ని నిలబెట్టవచ్చు.
నాయకత్వం అంటే అధికారమో పీఠమో కాదని, అది సాధారణ మనిషి హృదయం నుంచి పుట్టే దృఢనిశ్చయం అని ఈ నాయకులు మనకు నేర్పారు. ప్రపంచం వీరిని శక్తివంతులుగా చూస్తుంది, కానీ వారి కథల్లో మనం మనల్ని చూసుకుంటాం. ఎందుకంటే ప్రతి నాయకుడి ప్రయాణం ఒక సాధారణ మనిషి కలతోనే మొదలవుతుంది.