జనసేన నేతలు భయపడుతోందంతా జరుగుతోందా?

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహార శైలిపై జనసేన నేతలు ఆందోళన చెందుతున్నట్టు చెబుతున్నారు.

Update: 2024-01-01 13:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖరారై పోయింది. ఈ రెండు పార్టీలతో బీజేపీ చేరుతుందా, లేదా అనేదే తేలాల్సి ఉంది.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహార శైలిపై జనసేన నేతలు ఆందోళన చెందుతున్నట్టు చెబుతున్నారు. జనసేనకు ఇచ్చే సీట్లు 20 లేదా 25 మించవని పెద్ద ఎత్తున టాక్‌ నడుస్తోంది. అంతేకాకుండా టీడీపీలో సీట్లు దొరకనివారిని చంద్రబాబే వ్యూహాత్మకంగా జనసేనలోకి పంపి ఆ పార్టీ తరఫున పోటీ చేసేలా ప్రణాళిక రచించారని టాక్‌ ఉంది.

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలు అయ్యాక ఫలితాల ఆధారంగా ముఖ్యమంత్రి పదవిపైన నిర్ణయం ఉంటుందని అంటున్నారు. అయితే చంద్రబాబు తనయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబేనని చెబుతుండటం గమనార్హం. దీనిపైన జనసేన నేతలు, ముఖ్యంగా కాపు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఇదే అంశంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ హోం మంత్రి హరిరామ జోగయ్య జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కు లేఖ రాయడం గమనార్హం. చంద్రబాబే ముఖ్యమంత్రి అని ప్రచారం జరుగుతోందని.. దీనిపైన కాపు సామాజికవర్గం నేతలు ఆందోళన చెందుతున్నారని.. పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలని వారు కోరుకుంటున్నారని హరిరామ జోగయ్య తన లేఖలో పేర్కొన్నారు. కాపు సామాజికవర్గం సందేహాలకు పవన్‌ కళ్యాణ్‌ స్పష్టత ఇవ్వాలని కోరారు. అయితే జోగయ్య లేఖపై అధికారికంగా జనసేన పార్టీ స్పందించలేదు.

Read more!

ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖరారైపోయిందని, జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్యను కూడా చంద్రబాబు, లోకేశ్‌.. పవన్‌ కు తెలిపారని అంటున్నారు. అయితే ఈ విషయం ముందుగానే ప్రజలందరికీ తెలిసిపోతే ఇరు పార్టీల్లో.. ముఖ్యంగా జనసేనలో ఆందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి ఈ విషయం చంద్రబాబు, పవన్, లోకేశ్‌ మధ్యే ఉందని అంటున్నారు.

ఎన్నికల ముందు వరకు జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించారనేది చెప్పరని.. నామినేషన్ల సమయంలోనే జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్యను చెప్పవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేనలోని కాపు నేతలు ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు. చివరి వరకు సీట్ల సంఖ్యను తేల్చకపోతే ఇబ్బందేనని అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. చివరి క్షణంలో జనసేనకు చంద్రబాబు తక్కువ సీట్లు కట్టబెడతారని, ఆ సీట్లలో మళ్లీ టీడీపీ తరఫున రెబల్‌ అభ్యర్థులను బరిలోకి దింపడం చేస్తారని కాపు నేతల ఆందోళనగా ఉంది.

ఈ విషయంలో కాపు నేతలు ఇప్పటికే జనసేనాని పవన్, పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ వద్ద తమ ఆందోళన వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు జనసేనకు ఇచ్చే సీట్ల వ్యవహారం తెలిసిపోతే ఆ స్థానాల్లో సీట్లు ఆశిస్తున్న టీడీపీ అభ్యర్థులు సైతం పార్టీని వీడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అటు చంద్రబాబు, ఇటు పవన్‌ ప్రస్తుతానికి ఈ విషయంలో గుంభనంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఈ అంశంపై ఇరు పార్టీల నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News