బెంగాల్ లో అంతే.. గవర్నర్ ఇలా కూడా మాట్లాడతారు

దేశంలోని మరే రాష్ట్రంలో లేని రాజకీయమంతా పశ్చిమ బెంగాల్ లో కనిపిస్తూ ఉంటుంది.

Update: 2024-05-06 04:47 GMT

దేశంలోని మరే రాష్ట్రంలో లేని రాజకీయమంతా పశ్చిమ బెంగాల్ లో కనిపిస్తూ ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఆ రాష్ట్రం ఒక రణరంగంగా మారుతుంది. యుద్ధ భూమిని తలపించేలా పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిగిలిన ఏ రాష్ట్రంలో కనిపించని సిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. రాజ్ భవన్ లో ఒక తాత్కలిక ఉద్యోగిని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ లైంగికంగా వేధించినట్లుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటం తెలిసిందే.

ఈ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై బెంగాల్ పోలీసులు సీరియస్ గా రియాక్టు అవుతున్న పరిస్థితి. ఈ ఉదంతంపై ప్రత్యేక దర్యాప్తు కోసం సిట్ ను అక్కడి పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో.. కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళలోనే.. గవర్నర్ బోస్ రియాక్టు అయ్యారు. తాను వేధింపులకు గురి చేసినట్లుగా వస్తున్న ఆరోపణల్ని ఖండించిన ఆయన.. రాజ్ భవన్ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు.

Read more!

మహిళపై తాను లైంగిక వేధింపులకు గురి చేశారన్న దానిపై పోలీసుల నుంచి వచ్చే ఆదేశాల్ని.. చర్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేయటంతో పాటు.. అందుకు తగిన ఆదేశాలు జారీ చేయటం ఇప్పుడు మరో సంచలనంగా మారింది. తాజాగా విడుదల చేసిన ఆదేశాల్లో.. ‘‘ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తునకు సంబంధించి రాజ్ భవన్ సిబ్బంది. ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో ఎలాంటి ప్రకటనా చేయకూడదు. వ్యక్తిగతంగా కానీ ఫోన్ ద్వారా కానీ మరే మీడియం ద్వారా కానీ దీనిపై బహిరంగంగా మాట్లాడటం నిషేధం’’ అంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. తాను జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన రూల్ పొజిషన్ ను పేర్కొనటం గమనార్హం.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361(2), (3) ప్రకారం గవర్నర్ పై దర్యాప్తు.. విచారణ లాంటి ఏ చర్యకు ఉప క్రమించకూడదని.. రాష్ట్రపతి.. గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు.. ఏ కోర్టు కూడా క్రిమినల్ చర్య తీసుకోకూడదని.. అరెస్టు ప్రక్రియను చేపట్టకూడదంటూ ఉన్న ఆదేశాల్ని చూపిస్తున్నారు. ఈ వైనం ఇప్పుడు మరో సంచలనంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా ఉన్న పరిస్థితుల్లో తాజాగా గవర్నర్ విడుదల చేసిన ఆదేశాలపై బెంగాల్ ప్రభుత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News