విజయసాయిరెడ్డిపై ఎదురుదాడి షురూ చేసిన వైసీపీ
నెల్లూరు నుంచి జగన్‌కు నమ్మిన బంటుల్లో ఒకరైన కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా విజయ సాయి రెడ్డిపై మండిపడ్డారు.;
వైసీపీ మాజీ నేత విజయ సాయి రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ తనను అవమానించిందని, చివరకు తనను పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేసిందని ఆయన ఆరోపించారు. వైసీపీలోని రెండో స్థాయి నేతలు తనను జగన్ నుండి దూరం చేశారని, దాంతోనే తన పరిస్థితి ఇలా మారిందని సంచలన విషయాలు బయటపెట్టారు.
జగన్ గురించి మాట్లాడటంలో కూడా విజయసాయిరెడ్డి వెనుకడుగువేయకపోవడం విశేషం.. “జగన్ అన్నాడు, నేను రాజకీయ ఒత్తిడికి లోనై నా చరిత్ర కోల్పోయానని, తల వంచానని. కానీ ఆయన గుర్తుంచుకోవాలి, నేను స్వభిమానంతో ఉన్న మనిషిని, ఎవరికీ తల వంచలేదు. జగన్ తన చుట్టూ ఉన్న కోటరీను తొలగించుకోకపోతే భవిష్యత్తు కఠినంగా మారనుంది” అని వ్యాఖ్యానించారు. అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయి రెడ్డి కామెంట్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.
నెల్లూరు నుంచి జగన్‌కు నమ్మిన బంటుల్లో ఒకరైన కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా విజయ సాయి రెడ్డిపై మండిపడ్డారు. “ఈ విజయ సాయి రెడ్డి రాజకీయాల నుండి రిటైరై వ్యవసాయం చేస్తానని చెప్పాడు. తిరుమల వెంకన్న సాక్షిగా కూడా ప్రమాణం చేశాడు. కానీ మళ్లీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. ఆయనను ఎవరైనా నమ్మేలా ప్రవర్తిస్తున్నారా? ఇది చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జరుగుతోందనే అనుమానం కలుగుతోంది. ఆయన చంద్రబాబు ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నాడేమో అన్న అనుమానం వస్తోంది” అని సంచలన ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి చంద్రబాబుకు సాయం చేస్తున్నాడని కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. వైసీపీలో ఉన్నప్పుడు గంటల తరబడి జగన్ తో ఉండేది విజయసాయి రెడ్డినే అని.. ఆయనకు మించిన కోటరీ ఇంకెవరు ఉంటారు ? అని ఆరోపించారు.
దీంతో విజయసాయిరెడ్డి కౌంటర్లకు దిగితే ఎదురుదాడి చేయడానికి వైసీపీ కూడా రెడీ అవుతోందని ఈ చర్యలను బట్టి అర్థమవుతోంది. మరి ఈ రెండు వర్గాల మధ్య ముందు ముందు ఫైట్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది.