వేమిరెడ్డి మీద వైసీపీ ఆగ్రహం అందుకేనా ?
మరో వైపు చూస్తే గెలిచే పార్టీగా టీడీపీని భావించి వేమిరెడ్డి ఆ వైపు వెళ్ళారని అంటారు. ఏది ఏమైనా నెల్లూరు జిల్లాలో ఓడలు బళ్ళు అయ్యాయి.;
నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అంగబలం దండీగా ఉన్న వారు. ఆయన భారీ పారిశ్రామికవేత్తగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ విధంగా ఆయనకు పొలిటికల్ ఫ్లాట్ ఫారాన్ని ఏర్పాటు చేసి రెడ్ కార్పెట్ పరచించి వైసీపీనే. 2018లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి ఒక సీటు దక్కింది. అది విజయసాయిరెడ్డి తరువత వైసీపీకి దక్కిన రెండవ రాజ్యసభ సీటు.
వైసీపీకి అపుడు ఉన్న బలానికి ఒక్క సీటే లభిస్తూ ఉండేది. ఈ సీటు కోసం ఎందరో ప్రయత్నం చేశారు. సీనియర్ల కన్ను కూడా ఉండేది పైగా వైసీపీ అధికారం రుచి చూడలేదు దాంతో అనేక మంది పెద్దల సభకు వెళ్తే హ్యాపీగా ఆరేళ్ళ పాటు ఉండొచ్చు అనుకున్నారు. కానీ అనూహ్యంగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పేరు రాజకీయ తెర మీదకు వచ్చింది. అప్పటిదాకా ఆయన జిల్లాకే పరిమితం అయి పారిశ్రామిక వర్గంలోనే పరిచయం ఉన్న వారు.
ఆయనను రాజకీయంగా ముందుకు తీసుకురావడం ద్వారా అంగబలం అర్ధబలం పార్టీకి విపక్షంలో ఉన్న వేళ సమకూరుతాయన్న ఆలోచన కూడా ఉంది. దానికి తగినట్లుగా వేమిరెడ్డి వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఎంతగానో ఉపయోగపడ్డారు. ఇలా పరస్పర అవగాహనతో ఆరేళ్ళ పాటు ఈ బంధం సాగింది. అయితే రాజకీయం రుచి చూశాక మరింతగా ఎదగాలని ఎవరికైనా ఉంటుంది.
నెల్లూరు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడిగా ఉంటూ జిల్లా మీద పట్టు సాధించిన వేమిరెడ్డి 2024లో లోక్ సభకు పోటీ చేయాలని అనుకున్నారు. అంతే కాదు తన సతీమణి ప్రశాంతి రెడ్డికి అసెంబ్లీ టికెట్ కూడా తీసుకోవాలని భావించారు. అదే విధంగా పది దాకా ఉన్న అసెంబ్లీ సీట్లలో కొన్ని సీట్లు తన వర్గం వారికి ఇప్పించుకోవాలని ఆలోచించారని అంటారు.
అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం ప్రశాంతి రెడ్డికి మాత్రమే ఎంపీ టికెట్ ఇచ్చి మిగిలిన వాటిని పక్కన పెట్టిందని టాక్ నడచింది. దాంతో ఆయనకు టీడీపీ నుంచి బంపర్ ఆఫర్ రావడంతో ఆ వైపు మళ్ళారు. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. కానీ ఎన్నికల యుద్ధ క్షేత్రంలో ఉండగా వేమిరెడ్డి తీసుకున్న నిర్ణయం నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఆశనిపాతంగా మారింది.
మొత్తానికి మొత్తం సీట్లను ఆ పార్టీ కోల్పోయేలాగా పరిణామాలు సంభవించాయి. దాంతో పాటు బలమున్న నేతలు అంతా ఓటమి బాట పట్టారు. అంగబలం అర్ధబలం సంపూర్ణంగా ఉన్న వేమిరెడ్డి టీడీపీకి ఒక ఆయుధంగా మారారు. నిజానికి ఆయన టీడీపీ వైపు వెళ్ళకపోతే ఆ పార్టీకి గట్టి ఎంపీ అభ్యర్థి కూడా దొరకడం కొంత ఇబ్బంది అయ్యేది కానీ వైసీపీ అధినాయకత్వం జిల్లాలో ఉన్న కొందరు నేతల వైపు ఉంటూ కోరి మరీ వేమిరెడ్డిని దూరం చేసుకునందని ఒక వెర్షన్ గా చెబుతారు.
మరో వైపు చూస్తే గెలిచే పార్టీగా టీడీపీని భావించి వేమిరెడ్డి ఆ వైపు వెళ్ళారని అంటారు. ఏది ఏమైనా నెల్లూరు జిల్లాలో ఓడలు బళ్ళు అయ్యాయి. వైసీపీకి కంచుకోట ఒక్కసారిగా బద్దలు అయిపోయింది. ఈ పరిణామం వల్లనే వైసీపీ బొత్తిగా ప్రతిపక్ష స్థానానికి కూడా దక్కకుండా దుస్థితి ఏర్పడింది.
ఇక వేమిరెడ్డి వైసీపీలో ఉన్నపుడు ఆయన అంగబలం అర్ధబలానికి తూగలేమని భావించిన కొందరు నాయకులు కావాలనే ఆయనకు పొగ పెట్టారని అంటున్నారు. ఏది ఏమైనా నెల్లూరులో ఫ్యాన్ స్విచాఫ్ చేసిన వేమిరెడ్డి మీద జిల్లాలో ఆ పార్టీ నేతలకు ఉండాల్సిన కోపం కంటే ఎక్కువగానే ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే వేమిరెడ్డి టీడీపీ కూటమిలో చేరినా ఏమంత సౌకర్యంగా లేరని ఆ మధ్యన ప్రచారం సాగింది. జిల్లా పరిషత్ మీటింగ్ కి తనను పిలవలేదని అలిగి ఆయన కారెక్కి వెళ్ళిన వైనం కూడా అంతా చూశారని చెబుతారు.
ఇక ఆయన సతీమణికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించినా దక్కలేదు అన్నది కూడా ఉందని చెబుతారు. జిల్లాలో తమ మాట పెద్దగా చెల్లడం లేదన్న అసంతృప్తి ఉదని అంటారు. ఈ పరిణామాల నేపథ్యంలో వేమిరెడ్డి వైసీపీ వైపు మళ్ళీ చూస్తున్నారు అన్న ప్రచారం కూడా ఆ మధ్యన సాగింది. అయితే ఇపుడు కాకపోయినా ఎన్నికల ముందు ఆయన వెళ్తారని కూడా పుకార్లు అలాగే వినిపిస్తూ వస్తున్నాయి.
అయితే వేమిరెడ్డి మళ్ళీ వైసీపీలోకి వస్తే తమ ఆధిపత్యానికి ఇబ్బంది అవుతుందని భావించే కొంతమంది ఆయనకు వైసీపీకి మధ్య శాశ్వతంగా అడ్డుకట్ట కట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇటీవల పరిణామాలు అని అంటున్నారు. మొత్తం మీద అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఇబ్బందులు పడుతున్న వేమిరెడ్డి కుటుంబం కూటమితో సాఫీగా ఉంటే పాలిటిక్స్ లో ప్రయాణం చేయడం లేకపోతే శాశ్వతంగా తప్పుకోవడమే మార్గంగా ఇపుడు కనిపిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి రాజకీయాల్లో ఏమి జరుగుతుందో.