విదేశాల నుంచి సోషల్ మీడియా పోస్టులు.. అలాంటి వారికి షాక్ తప్పదు మంత్రి అనిత హెచ్చరిక
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.;
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. చట్టంలో ఎలాంటి నిబంధనలు ఉండాలన్న విషయమై మంత్రి వర్గ ఉప సంఘంలో చర్చిస్తామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని శనివారం మీడియాకు అనిత వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని, విదేశాల్లో ఉంటూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన వారినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని అనిత తేల్చిచెప్పారు.
సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం పెద్ద తలనొప్పిగా మారినట్లు ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అధికారంలోకి వచ్చిన నుంచి సీరియస్ గా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోందని అంటున్నారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తొలుత కేసులు పెట్టి జైలుకు పంపి జోరు చూపిన ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అడ్డుగా మారాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియా కేసుల్లో ముందుగా నోటీసులిచ్చి విచారించాలని, ఆ తర్వాత స్టేషన్ బెయిలు మంజూరు చేయాలని ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీం తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న సోషల్ మీడియా కేసుల్లో దిగువ కోర్టులు ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. దీంతో కొన్నాళ్లు తోకముడిచిన సోషల్ సైకోలు.. సుప్రీం గైడ్ లైన్సును సాకుగా చేసుకుని రెచ్చిపోతున్నారని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో ఫేక్ ప్రచారాన్ని నియంత్రించాలనే ఆలోచనతో కొత్త చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చూపుతూ ప్రజలను గందరగోళానికి గురిచేయడంతోపాటు ప్రాంతాలు, సమూహాల మధ్య వైషమ్యాలు పెరిగేలా చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలను అదుపు చేయడానికి ప్రత్యేక చట్టమే మార్గమని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా విదేశాల్లో ఉంటూ ఎక్కువ మంది తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న చట్టం వల్ల అక్కడి వారిని రాష్ట్రానికి రప్పించలేకపోతున్నట్లు చెబుతున్నారు. కొత్త చట్టంలో ఇలాంటి వారిని కట్టడి చేసే నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.