బెంగళూరు బిల్డర్లపై రాజకీయ ఎన్నికల పన్ను: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.;

Update: 2023-09-30 06:26 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత నవంబర్‌ లో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుంది. డిసెంబర్‌ మొదటి వారంలో ఎన్నికలు ఉంటాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మరోసారి అధికారమే లక్ష్యంగా కదులుతున్న అధికార బీఆర్‌ఎస్‌ నేతలు మాటల దాడిని చేస్తున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి నిధులు అందించడానికి బెంగళూరు బిల్డర్లపై ‘రాజకీయ ఎన్నికల పన్ను’ విధిస్తోందని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇలా నిధుల సేకరణ చేస్తోందని ఆరోపించారు.

‘తెలంగాణ కాంగ్రెస్‌ కు నిధులు ఇవ్వడానికి కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకు రూ. 500 చొప్పున రాజకీయ ఎన్నికల పన్ను విధించడం మొదలుపెట్టింది’ అని ఆయన సోషల్‌ మీడియా మాధ్యమం ఎక్స్‌ లో పోస్టు చేశారు.

గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌.. స్కామ్‌ ల వారసత్వంతో స్కాంగ్రెస్‌ గా మారిపోయింది అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కర్ణాటక నిధులను తీసుకొచ్చి తెలంగాణలో ఎంత వెదజల్లినా ఇక్కడి ప్రజలను మోసం చేయలేరని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజలు స్కాంగ్రెస్‌ ను తిరస్కరిస్తారని కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ దాని వారసత్వం, పురాణ గాధలతోనే ఆ పార్టీ పేరును స్కాంగ్రెస్‌ గా మార్చామన్నారు. ఎంత డబ్బు వెదజల్లినా కాంగ్రెస్‌ పప్పులు తెలంగాణలో ఉడకవన్నారు. తెలంగాణ ప్రజలు స్కాంగ్రెస్‌ ను తిరస్కరించాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్నాటక, ఛత్తీస్‌ గఢ్‌ ల నుంచి డబ్బులు తెచ్చుకుని తెలంగాణలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఖర్చు చేస్తోందని కేటీఆర్‌ కొద్ది రోజుల క్రితం ఒక బహిరంగ సభలోనూ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇటీవల హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీ సమావేశం హైదరాబాద్‌ లో జరగడం, దీనికి కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో సహా మహామహులు తరలిరావడం తర్వాత కేటీఆర్‌ తన విమర్శలకు పదునుపెట్టారు. అమలు చేయలేని హామీలను కాంగ్రెస్‌ ఇస్తోందని కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ 65 ఏళ్ల పాలనలో తాగునీరు, కరెంటు, పింఛన్లు అందించలేదని, పేదలకు సహాయం చేయలేదని ఆయన దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు హామీలపై కేటీఆర్‌ మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. రైతులు విద్యుత్‌ సరఫరా సమస్యలతో బాధపడతారు, ప్రజలు తాగునీటి కోసం పోరాటం చేస్తారు, ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడాలి, రాష్ట్రం ఏటా కొత్త ముఖ్యమంత్రిని చూస్తుంది. గ్రామ పంచాయతీలు కుగ్రామాలుగా మారిపోతాయి. ప్రజలకు నాణ్యమైన విద్య వైద్య వ్యవస్థ అందుబాటులో ఉండదు’’ అని కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఈ ఆరు జరుగుతాయని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ వాగ్దానాలు కేవలం ఓట్ల కోసమేనని కేటీఆర్‌ ఆరోపించారు. రాజస్థాన్, కర్ణాటక లేదా ఛత్తీస్‌ గఢ్‌ లో కాంగ్రెస్‌ రూ.4,000 పింఛన్లు ఇవ్వలేకపోయిందన్నారు. కానీ తెలంగాణలో హామీ ఇచ్చిందని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News