2025లో ప్రవాస భారతీయులకు ‘పైరసీ’ సెగ
ప్రవాస భారతీయులకు ‘పైరసీ’ సెగ తగులనుంది. దీనివల్ల భారతీయులకు ముప్పు పొంచి ఉంది. అమెరికా, కెనడా వంటి దేశాల్లోని ఎన్నారై కుటుంబాల్లో అక్రమ ఐపీటీవీ (IPTV) వాడకం కలకలం రేపుతోంది.;
ప్రవాస భారతీయులకు ‘పైరసీ’ సెగ తగులనుంది. దీనివల్ల భారతీయులకు ముప్పు పొంచి ఉంది. అమెరికా, కెనడా వంటి దేశాల్లోని ఎన్నారై కుటుంబాల్లో అక్రమ ఐపీటీవీ (IPTV) వాడకం కలకలం రేపుతోంది. తక్కువ ధరకే వందల ఛానళ్లు.. సినిమాలు వస్తున్నాయన్న ఆశ.. ఇప్పుడు వారిని చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది.
షార్ట్ కట్ పేరుతో అక్రమ దందా..
విదేశాల్లో ఉంటున్న భారతీయులకు స్వదేశీ వినోదం అంటే అమితమైన ఇష్టం. దీనినే ఆసరాగా చేసుకొని కొన్ని ముఠాలు అక్రమ ఐపీటీవీ బాక్సులను మార్కెట్లోకి వదులుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, ప్రైమ్ వీడియో, జీ5 వంటి అధికారిక ఓటీటీల నుంచి కంటెంట్ ను అనుమతి లేకుండా ‘స్క్రాప్’ చేసి అతి తక్కువ ధరకే ఈ డివైజ్ ల ద్వారా అందిస్తున్నారు. కేవలం ఒక చిన్న బాక్స్ ప్లగ్ చేస్తే చాలు క్రికెట్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు అన్నీ ఉచితమనే భ్రమ కల్పిస్తున్నారు.
పరిశ్రమకు భారీ గండి.. రూ.22400 కోట్ల నష్టం
పైరసీ వల్ల భారతీయ చిత్ర పరిశ్రమకు, ఓటీటీ రంగానికి ఏటా దాదాపు రూ.22,400 కోట్లు నష్టం వాటిల్లుతోందని అంచనా.. ఈ నష్టం కేవలం పెద్ద హీరోలు, నిర్మాతలకు మాత్రమే కాదు. వేల సంఖ్యలో ఉండే టెక్నీషియన్లు, ఎడిటర్లు, రైటర్లు, చిన్న తరహా ఆర్టిస్లు ఉపాధిని దెబ్బతీస్తోంది. ఆదాయం తగ్గితే సృజనాత్మకతపై పెట్టుబడులు తగ్గుతాయి. తద్వారా చిన్న సినిమాల మనుగడ కష్టమవుతోంది.
ఇది స్థోమత సమస్య కాదు.. మనస్తత్వ సమస్య
విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ అక్రమ బాస్సులు వాడేవారిలో ఎక్కువమంది ఆర్థికంగా స్థిరపడిన వారే. భారతీయ కంటెంట్ అంటే చౌకగా దొరకాలి అనే భావన మన ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోవడం దురదృష్టకరం. చట్టబద్దంగా సబ్ స్క్రిప్షన్ తీసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇలాంటి అడ్డదారులను ఎంచుకోవడం కళాకారుల శ్రమను అవమానించడమేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
పొంచి ఉన్న ప్రమాదాలు.. కేవలం జరిమానాలే కాదు..
అక్రమ ఐపీటీవీ వాడకం వల్ల కేవలం నైతిక సమస్యలే కాదు.. తీవ్రమైన వ్యక్తిగత ముప్పులు కూడా ఉన్నాయి.. ఉత్తర అమెరికాలో చట్ట అమలు సంస్థలు అక్రమ సేవలంపై నిఘా పెంచాయి. భారీ జరిమానాలు, కోర్టు సమన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ పైరేటెడ్ డివైజ్ ల ద్వారా మీ ఇంటి వైఫై నెట్ వర్క్ లోకి మాల్వేర్ ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల వ్యక్తిగత సమాచారం.. బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం మెండుగా ఉంది.
భారతీయ సినిమా ప్రపంచ స్థాయికి చేరాలంటే విదేశాల్లోని ప్రేక్షకులు చట్టబద్దమైన ఫ్లాట్ ఫార్మ్ లనే వాడాలి. మనం ఇచ్చేసబ్ స్క్రిప్షన్ ఫీజు పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతుంది. పైరసీని ప్రోత్సహించడం అంటే మన సినిమా మూలాలను మనమే దెబ్బతీసుకోవడం.. సో ప్రవాస భారతీయులు కూడా పైరసి సెగ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది.