అక్రమ వలసదారులను తరిమికొట్టేందుకు ట్రంప్ ఆఖరి అస్త్రం

అమెరికా నుంచి అక్రమ వలసదారులను తరిమివేయాలి. ఉద్యోగాల పేరిట వచ్చిన వారిని భయపెట్టి పంపించేయాలి. గడువు తీరిన ఏ విదేశీయుడిని అమెరికాలో ఉండకుండా ఆంక్షలు పెట్టాలి;

Update: 2025-12-27 05:58 GMT

అమెరికా నుంచి అక్రమ వలసదారులను తరిమివేయాలి. ఉద్యోగాల పేరిట వచ్చిన వారిని భయపెట్టి పంపించేయాలి. గడువు తీరిన ఏ విదేశీయుడిని అమెరికాలో ఉండకుండా ఆంక్షలు పెట్టాలి. ఇలా ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి విదేశీయులను తరిమేసే పనిలో పడ్డాడు. అయితే ఎన్ని ఆంక్షలు, ఇబ్బందులు పెట్టినా కూడా అమెరికా వదిలి వెళ్లే వారి సంఖ్య ట్రంప్ అనుకున్నంత స్థాయిలో లేదు. దీంతో ఏం చేయాలా అని బుర్రలు బద్దలు కొట్టుకున్న పెద్దమనిషి చివరకు తనే సొంతంగా విమాన టికెట్ ఖర్చులు.. వ్యక్తిగత ఖర్చుకు ఓ 3వేల డాలర్లు ఇచ్చి మరీ విదేశీయులను సాగనంపేందుకు ప్లాన్ చేశాడు. ఈ అమెరికా ఆఫర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను తరిమికొట్టేందుకు ట్రంప్ ఇక అన్ని అస్త్రాలు వాడేసి ఆఖరి అస్త్రం తీశారు. వలసదారులు ఎవరైనా స్వచ్ఛందంగా అమెరికా విడిచి పోవాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కీలక ప్రకటన చేసింది. ‘సీబీపీ హోమ్’ మొబైల్ యాప్ ద్వారా డిసెంబర్ 31 లోపు స్వయంగా డిపోర్ట్ కు నమోదు చేసుకునే వారికి 3వేల డాలర్ల (రూ.2,69,415) నగదుతోపాటు స్వదేశానికి ఉచితంగా విమాన టికెట్ అందిస్తామని తెలిపింది. ఇంతకుముందు ఈ పథకంలో భాగంగా స్వచ్ఛందంగా వెళ్లే వారికి 1000 డాలర్లు మాత్రమే ఇవ్వబడేది. అయితే సంవత్సరం ముగింపు ప్రత్యేక ఆఫర్ గా ఈ మొత్తాన్ని తాత్కాలికంగా 3000 డాలర్లకు పెంచింది. ఈ పెంపు డిసెంబర్ 31 వరకూ మాత్రమే వర్తిస్తుంది.

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయిమ్ మాట్లాడుతూ.. 2025 జనవరి నుంచి ఇప్పటివరకూ దాదాపు 19 లక్షల మంది స్వచ్ఛందంగా అమెరికా విడిచిపెట్టారని అందులో పదివేల మంది సీబీపీ ప్రోగ్రామ్ ను ఉపయోగించారని వెల్లడించారు. ‘అక్రమంగా ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. వెళ్లకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. తిరిగి ప్రవేశానికి అనుమతి ఉండదు’ అని క్రిస్టి హెచ్చరించారు.

అనుమతి లేకుండా దేశంలోకి ప్రవేశించిన వారు.. వీసా గడువు ముగిసినా ఉండిపోయిన వారు లేదా వీసా నిబంధనలు ఉల్లంఘించినవారు విద్యార్థి వీసాపై పనిచేస్తున్న వారు వెంటనే వెళ్లిపోవాలని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది. సీబీపీ హోమ్ యాప్ ద్వారా స్వచ్ఛందంగా వెళ్లేవారికి ఓవర్ స్టే లేదా ఆలస్యంగా వెళ్లినందుకు విధించే కొన్ని పౌర జరిమానాలు, పెనాల్టీలపై మాఫీ లభించే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు యాప్ లో తమ వ్యక్తిగత వివరాలు, పత్రాలు సమర్పించాలి. ఆ తర్వాత ప్రభుత్వం ప్రయాణ ఏర్పాట్లుచేసి ఖర్చును భరిస్తుంది.

ఈ క్రమంలోనే అధికారులు స్వచ్ఛంద స్వదేశ ప్రయాణం.. బలవంతపు డిపోర్టేషన్ మధ్య తేడాను మరోసారి గుర్తు చేశారు. బలవంతంగా డిపోర్ట్ అయితే నిర్బంధం , దీర్ఘకాలం లేదా శాశ్వతంగా అమెరికా ప్రవేశ నిషేధం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ స్వచ్ఛందంగా వెళ్లినవారికి పరిస్థితులను బట్టి భవిష్యత్తులో చట్టబద్దంగా తిరిగి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉండవచ్చని డీహెచ్ఎస్ పేర్కొంది. 3వేల డాలర్ల ప్రోత్సాహకం డిసెంబర్ 31తో ముగస్తుంది. ఆ తర్వాత సాధారణ అమలు చర్యలు తిరిగి ప్రారంభమవుతాయి.

Tags:    

Similar News