ఎన్నికల సంఘానికి 'బిగ్ టెస్ట్' పెట్టిన 2025!
సుదీర్ఘ భారత ఎన్నికల సంఘం చరిత్రలో 2025 ఒక కీలక అధ్యాయంగా మిగిలిపోయిందనే చెప్పాలి.;
సుదీర్ఘ భారత ఎన్నికల సంఘం చరిత్రలో 2025 ఒక కీలక అధ్యాయంగా మిగిలిపోయిందనే చెప్పాలి. 1950లో ఏర్పడిన భారత ఎన్నికల సంఘం.. అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని..ప్రజాస్వామ్య వ్యవస్థను, అతి పెద్ద భారత ఎన్నికల వ్యవస్థను కూడా పటిష్ఠం చేసింది. ముఖ్యంగా తొలి కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి.. టీఎన్ శేషన్, ఎం.ఎస్. గిల్ వంటి అనేక మంది ఎన్నికల సంఘానికి పునాదులు బలోపేతం చేశారు. ''చిన్న విమర్శ వచ్చినా.. దానిని పెద్దదిగానే చూస్తాం. పరిష్కరిస్తాం. ఇది ఎన్నికల సంఘం అన్న విషయాన్ని మేం మరిచిపోం. దేశంలో 100 కోట్ల మంది(అప్పటికి) ప్రజలకు మేం జవాబుదారీ'' అని టీఎన్ శేషన్ చేసిన వ్యాఖ్యలు.. ఔదదల దాలుస్తూ.. ఎన్నికల సంఘం పరిఢవిల్లింది.
రాజకీయ పార్టీల దూకుడుకు.. వికృత చేష్ఠలకు కూడా శేషన్ ముకుతాడు వేశారు. విచ్చలవిడి.. ఓటింగ్ నుంచి ఓట్ల అమ్మకాల వరకు.. ఆయన తీసుకున్న చర్యలు నిరుపమానం. అందుకే.. శేషన్.. ఎన్నికల సంఘానికి మహరాజుగా నిలిచిపోయారు. ఆ తర్వాత వచ్చిన వారిలో ఎం.ఎస్. గిల్ కూడా అదే పంథాను అనుసరించారు. దీంతో ఎన్నికల సంఘంపైనా.. ఆ సంఘం నిర్వహించే ఎన్నికలపైనా ఎవరికీ ఎలాంటి అనుమానాలు.. సంఘానికి అపప్రదలు రాలేదు. కానీ.. ఈ ఏడాది మాత్రం జ్ఞానేష్ కుమార్ సీఈసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఎన్నికల సంఘం రూపురేఖలు ఎలా ఉన్నా.. విధాన పరమైన నిర్ణయాల్లో వ్యవహరించిన తీరు ఎన్నికల సంఘాన్ని తొలిసారి సుప్రీంకోర్టు బోను ఎక్కించింది.
ఈవీఎంలను వినియోగించడం ఎవరూ తప్పుబట్టరు.. కానీ.. అలా వినియోగిస్తున్న ఈవీఎంలలో అదనపు ఓట్లు.. బ్యాటరీ చార్జింగ్‌లు.. డేటా నిల్వ వంటి విషయాల్లో జరిగిన అవకతవకలను ప్రశ్నిస్తే.. సమాధానం లేని.. పొంతనలేని ఆన్సర్ చెప్పడం.. జ్ఞానేష్‌కుమార్ చుట్టూ వ్యక్తిగతంగానే కాకుండా.. ఎన్నికల సంఘానికి కూడా ప్రశ్నలు చుట్టుముట్టేలా చేశాయి. అదేసమయంలో ఒకే ఇంటికి వందల సంఖ్యలో ఓటరు కార్డులు.. ఒకే వ్యక్తికి నాలుగైదు ఓట్లు.. ఇలా.. అనేక రూపాల్లో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సి వచ్చింది. వీటిని తక్కువ చేసి చూపాలన్న ప్రయత్నం ఫలించలేదు.అలాగని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎదురుదాడితప్ప!.
ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో ఓటర్లను తొలగించడం.. కామనే అయినా.. ఈ తొలగింపులోనే పక్షపాత విధానాలను అనుసరించడం.. కేంద్ర ఎన్నికల సంఘానికి పెను విమర్శలు వచ్చేలా చేశాయి. దేశవ్యాప్తంగా అనేక అనుమానా లు వ్యక్తమయ్యేలా చేశాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై వందల సంఖ్యలో పిటిషన్లు పడ్డాయంటే.. పరిస్థితిని అర్ధం చేసుకోవాలి. సాధారణంగా.. రాజకీయ విమర్శలకు దూరంగా ఉండే.. స్వయంప్రతిపత్తి సంస్థ అయిన.. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఆ లక్ష్మణ రేఖలను కూడా దాటేసింది. సో.. మొత్తంగా 1950ల నుంచి పోల్చుకుంటే.. కేంద్ర ఎన్నికల సంఘానికి 2025 విషమ పరీక్షే పెట్టిందన్నది వాస్తవం. ముఖ్యంగా విశ్వసనీయతపైనే పెను ప్రభావం చూపింది.