మళ్లీ బీజేపీలోకి రాజాసింగ్?
తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా నడుస్తోంది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక పెద్ద హైప్ వచ్చింది.;
తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా నడుస్తోంది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక పెద్ద హైప్ వచ్చింది. కానీ ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం అయిన తర్వాత బండి సంజయ్ హయాంలో కనిపించిన దూకుడు ఇప్పుడు కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎంపీలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతోనే ఇటీవల మోడీ కూడా స్వయంగా జోక్యం చేసుకొని తెలంగాణ ఎంపీలకు క్లాస్ పీకారని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. పార్టీ నాయకత్వం నుంచి తగిన ప్రోత్సాహం లేకున్నా పార్టీపై అభిమానంతో పలువురు పోటీలో నిలబడి అధికార కాంగ్రెస్ ను తట్టుకొని నిలబడి బీజేపీ పరువును కొంతవరకైనా నిలబెట్టగలిగారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో మరో కీలక అంశం చర్చకు వచ్చింది. అది గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం. గోరక్షకుడిగా.. కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరు తెచ్చుకున్నరాజాసింగ్, అదే సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలిచారు. దూకుడైన వ్యాఖ్యల కారణంగా గతంలో ఆయననుపార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు సస్పెన్షన్ ఎత్తివేసి , టికెట్ కేటాయించడంతో ఆయన మళ్లీ గోషామహల్ లో కాషాయ జెండాను రెపరెపలాడించారు.
కానీ తాజాగా రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేయడంతో మళ్లీ సస్పెన్షన్ వేటు పడింది. అధ్యక్ష ఎన్నికల్లో తాను కూడా పోటీచేస్తానని సంకేతాలు ఇవ్వడం.. రాష్ట్ర నాయకత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ రాజాసింగ్ వెనుకడుగు వేయకుండా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. దీంతో పార్టీ నుంచి సస్పెండ్ కావాల్సి వచ్చింది.
ఇప్పుడీ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ద్వారా రాజాసింగ్ మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. యోగి మద్దతుతో మల్లీ బీజేపీలోకి రావడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. గతంలో కూడా ఒకసారి సస్పెండ్ అయిన తర్వాత తిరిగి పార్టీలోకి వచ్చిన అనుభవం ఉండడంతో ఈసారి కూడా అదే జరుగుతుందన్న ఆశాభావాన్ని రాజాసింగ్ వ్యక్తం చేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
అయితే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాత్రం రాజాసింగ్ వ్యవహారశైలిపై అంతగా అనుకూలంగా లేరనే ప్రచారం ఉంది. పార్టీలోని అంతర్గత విషయాలను బహిర్గతం చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్ ను మళ్లీ పార్టీలో చేర్చుకోవడం కంటే దూరంగా ఉంచడమే మంచిదన్న అభిప్రాయం ఉందని కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ప్రచారం సాగుతోంది.
ఏది ఏమైనప్పటికీ యోగి మద్దతు రాజాసింగ్ కు ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన బీజేపీలోకి తిరిగి వస్తారా? లేక ఈసారి పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంటుందా? అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.