వైసీపీ బిగ్ డిబేట్‌: అమిత్ షాతో చంద్ర‌బాబు ఏం చ‌ర్చించారు?

కానీ.. ఇప్పుడు కొంత పార‌ద‌ర్శ‌క‌త‌కు చోటు పెట్టారు. ఏం జ‌రుగుతున్నా.. చంద్ర‌బాబు చెబుతున్నారు. అయితే.. ఎంత పాద‌ర్శ‌క‌త ఉన్నా.. అంత‌ర్గ‌త విష‌యాల‌ను ఆయ‌న కూడా చెప్పరు క‌దా!.;

Update: 2026-02-11 10:08 GMT

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా కేంద్రంలోని ప‌లువురు మంత్రుల‌ను క‌లిశారు. రాష్ట్రానికి చెందిన ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై ఆయ‌న చ‌ర్చించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. చంద్ర‌బాబు వేరే ఎవ‌రిని క‌లిసినా.. రాని చ‌ర్చ‌.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను క‌లిస్తే.. మాత్రం చ‌ర్చ‌గా మారుతోంది. గ‌తంలో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా అమిత్ షాను , ప్ర‌ధాని మోడీని క‌లుసుకునే వారు. కానీ, వాస్త‌వాలు ఏంట‌నేది చెప్పేవారు కాదు.

కానీ.. ఇప్పుడు కొంత పార‌ద‌ర్శ‌క‌త‌కు చోటు పెట్టారు. ఏం జ‌రుగుతున్నా.. చంద్ర‌బాబు చెబుతున్నారు. అయితే.. ఎంత పాద‌ర్శ‌క‌త ఉన్నా.. అంత‌ర్గ‌త విష‌యాల‌ను ఆయ‌న కూడా చెప్పరు క‌దా!. ఇదే వ్య‌వ‌హా రం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశం అయింది. ముఖ్యంగా వైసీపీలో పెద్ద ఎత్తున చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌, కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీపై పెద్ద ఎత్తున నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. బాబు ఏం చర్చించారు? ఇది త‌మ‌కు ఇబ్బందిగా మారుతుందా? అనేది ఈ చ‌ర్చ‌ల సారాంశం.

ప్ర‌ధానంగా మూడు విష‌యాల‌పై వైసీపీ నాయ‌కులు దృష్టి పెట్టారు.

1) తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం. రా ష్ట్రంలోనే కాదు.. దేశాన్ని కూడా కుదిపేస్తున్న తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో నెయ్యి క‌ల్తీ వ్య‌వ‌హారాన్ని అమిత్ షాకు వివ‌రించి ఉంటార‌ని వైసీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. దీనిలో వైసీపీ పాత్ర‌ను కూడా ఆయ‌న కూలంక‌షంగా వివ‌రించి ఉంటారని ఒక‌రిద్దు నేత‌లు ఆఫ్ దిరికార్డుగా చెబుతున్నారు.

2) రాష్ట్రంలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్య స‌భ సీట్ల వ్య‌వ‌హారం.

వాస్త‌వానికి ఈ సీట్ల‌లో రెండు టీడీపీ, ఒక‌టి జ‌న‌సేన‌, ఒక‌టి బీజేపీ తీసుకుంటాయనేది ఆది నుంచి చ‌ర్చ ఉంది. కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఈ ద‌ఫా రెండు కావాల‌న్న చ‌ర్చ ఉంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఈ వ్య‌వ‌హారంపై కూడా చ‌ర్చించి ఉంటార‌ని తెలుస్తోంది. ఇక‌, ప్ర‌ధానంగా మూడో అంశం.. బీజేపీ నేత‌ల క‌లివిడి త‌గ్గ‌డం. కూటమి ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా బీజేపీ నాయ‌కులు పెద్ద‌గా స్పందించ‌డం లేద‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా వైసీపీని కార్న‌ర్ చేయ‌డం లేద‌న్న విష‌యం తెలిసిందే. దీనిపై కూడా స‌రైన దిశానిర్దేశం చేసేలా సీఎం.. కేంద్ర మంత్రితో చ‌ర్చించి ఉంటార‌ని.. వైసీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News