జేపీ మోర్గాన్ హెచ్చరిక.. ట్రంప్ చర్యలతో అమెరికాకు మాంద్యం ముప్పు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధిస్తున్న ప్రతీకార సుంకాలు (టారిఫ్‌లు) అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టే ప్రమాదం ఉందని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ హెచ్చరించింది.;

Update: 2025-04-05 14:01 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధిస్తున్న ప్రతీకార సుంకాలు (టారిఫ్‌లు) అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టే ప్రమాదం ఉందని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ హెచ్చరించింది. హెచ్చరించింది. గతంలో 40 శాతంగా ఉన్న ఈ మాంద్యం సంభవించే అవకాశాలు ఇప్పుడు 60 శాతానికి పెరిగాయని సంస్థ పేర్కొంది. అంతేకాకుండా, ఈ చర్యల వల్ల దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. జేపీ మోర్గాన్ సీఈవో మైఖేల్ ఫెరోలి మాట్లాడుతూ.. ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. మాంద్యం కారణంగా అమెరికాలో నిరుద్యోగ రేటు 5.3 శాతానికి పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల దేశంలో ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు, యూఎస్ ఆర్థికవేత్త జోనాథన్ పింగిల్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులు 20 శాతం కంటే ఎక్కువగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. రాబోయే త్రైమాసికాలలో జీడీపీలో దిగుమతులు 1986కు ముందు స్థాయిలకు తిరిగి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అమెరికా నూతన సుంకాల విధానంపై ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ యంత్రాంగం అమలు చేస్తున్న ఈ సుంకాలు గతంలో ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. బార్క్లేస్, బోఫా గ్లోబల్ రీసెర్చ్, డ్యూష్ బ్యాంక్, యూబీఎస్ గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్ వంటి ఇతర ప్రముఖ పరిశోధనా సంస్థలు కూడా అమెరికా విధిస్తున్న కొత్త టారిఫ్‌లు దేశ ఆర్థిక వ్యవస్థను పతనం చేసే ప్రమాదం ఉందని గట్టిగా హెచ్చరించాయి.

ట్రంప్ భారత్‌తో సహా అనేక ప్రపంచ దేశాలపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. తమతో వాణిజ్య సంబంధాలు ఉన్న అన్ని దేశాలపై ఆయన టారిఫ్‌ల బాణం ఎక్కుపెట్టారు. భారత్‌పై 27 శాతం, వియత్నాంపై 46 శాతం, ఇజ్రాయెల్‌పై 17 శాతం సుంకాలు విధించారు. అన్ని దేశాలూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్‌లో విక్రయించుకోవచ్చని, అయితే కనీసం 10 శాతం సుంకం చెల్లించాలని ఆయన తేల్చి చెప్పారు. మొత్తం 27 శాతం టారిఫ్‌లో 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి రాగా, మిగిలిన 17 శాతం ఏప్రిల్ 10 నుంచి అమలు కానున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. అమెరికాతో పాటు ప్రపంచంలోని అన్ని ప్రధాన మార్కెట్లు కూడా పతనమవుతున్నాయి.

ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా పలు మార్కెట్లు కుదేలయ్యాయి. అగ్రరాజ్య మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. ఈ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో మాంద్యం తప్పదనే భయాలు వెంటాడుతున్నాయి. ఈ పరిణామాలపై ట్రంప్ స్పందిస్తూ తన టారిఫ్‌ల నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అమెరికా సుసంపన్నం కావడానికి ఇదే సరైన సమయమని ఆయన వ్యాఖ్యానించారు. మార్కెట్ల పతనంపై ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, అమెరికాలోకి పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు వస్తున్నారని, భారీగా పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు. తన విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదని, మునుపెన్నడూ లేని విధంగా ధనవంతులు కావడానికి ఇదే గొప్ప సమయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెద్ద వ్యాపారులు ఈ టారిఫ్‌ల గురించి ఆందోళన చెందడం లేదని, వారు ఇక్కడే ఉంటారని వారికి తెలుసని, మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే అంశాలపై వారు దృష్టి పెట్టారని ట్రంప్ మరో పోస్ట్‌లో తెలిపారు.

భారత్ సహా పలు దేశాలపై ట్రంప్ సుంకాల మోత మోగించిన నేపథ్యంలో గురువారం భారీగా క్షీణించిన అమెరికా మార్కెట్లు శుక్రవారం కూడా మరింత పతనమయ్యాయి. డౌ జోన్స్ 5.5 శాతం, ఎస్&పీ 500 సూచీ 5.97 శాతం మేర నష్టపోయాయి. ఈ రెండు రోజుల్లో అమెరికా మార్కెట్ విలువ ఏకంగా 5 ట్రిలియన్ డాలర్ల మేర తగ్గిపోయింది. ఈ పరిణామాలు ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయని ఇప్పటికే పలువురు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News