తెలంగాణ : ఎవరు ఎవరితో మిలాఖత్ అయ్యారు ?

బీజేపీ, బీఆర్ఎస్ మిలాఖత్ అని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మిలాఖత్ బీజేపీ ప్రతి రోజూ ఆరోపణలు చేస్తున్నాయి.

Update: 2024-04-17 06:43 GMT

తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు ప్రజలను గందరగోళ పరుస్తున్నది. బీజేపీ, బీఆర్ఎస్ మిలాఖత్ అని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మిలాఖత్ బీజేపీ ప్రతి రోజూ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే దేశం అంతా ఉప్పు, నిప్పులా వ్యవహరిస్తున్నా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా బీజేపీకి సహకరిస్తుందని బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నది.

గతంలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలలో దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపుకు, హుజూరాబాద్ లో ఈటెల గెలుపుకు, గత లోక్ సభ ఎన్నికలలో కరీంనగర్, నిజామాబాద్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ బలహీన అభ్యర్థులను నిలబెట్టి, ఓట్లు బదలాయించి బీజేపీ అభ్యర్థుల గెలుపుకు దోహదపడిందన్నది బీఆర్ఎస్ నేతల వాదన.

ప్రస్తుత లోక్ సభ ఎన్నికలలో బలహీన అభ్యర్థులను ఎంపిక చేసి, ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకుండా కాంగ్రెస్ బీజేపీకి సహకరిస్తుందని బీఆర్ఎస్ వాదన. ఇప్పటి వరకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ముఖ్యంగా కరీంనగర్ లో ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం బండి సంజయ్ గెలుపు కోసమేనని బీఆర్ఎస్ వాదిస్తున్నది. అదే సమయంలో చేవెళ్లలో రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ లో దానం నాగేందర్, మల్కాజ్ గిరిలో సునీతా మహేందర్ రెడ్డిలను నిలబెట్టడం వ్యూహంలో భాగమేనని ఆరోపిస్తున్నారు. నిజాామాబాద్ లో ధర్మపురి అరవింద్ గెలుపు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నిలిపిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more!

అయితే అదే సమయంలో జహీరాబాద్ లో గాలి అనిల్ కుమార్ ను నిలబెట్టడం వెనక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఒప్పందంలో భాగమే అని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అక్కడ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ గెలుపు కోసమే బీఆర్ఎస్ బలహీన అభ్యర్థిని నిలిపిందని అంటున్నారు. నాగర్ కర్నూలులో బీజేపీ సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్ ప్రసాద్, పెద్దపల్లి నుండి గోమాస శ్రీనివాస్ ను నిలబెట్టడం కాంగ్రెస్, బీజేపీ ఒప్పందంలో భాగంగా బలహీన అభ్యర్థులను నిలబెట్టిందన్నది ఆరోపణ. ఎవరు బలహీనం ? ఎవరు బలవంతులు ? ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడతారు ? అన్నది లోక్ సభ ఎన్నికల ఫలితాలు వస్తేనే కానీ అర్ధం కాదు.

Tags:    

Similar News