రాజముద్ర పడింది.. మెగా మహా హైదరాబాద్ కు తర్వాతేం జరగనుంది?
ఇప్పటివరకు మహా హైదరాబాద్ కాస్తా.. మెగా మహా హైదరాబాద్ గా మారుస్తూ రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.;
ఇప్పటివరకు మహా హైదరాబాద్ కాస్తా.. మెగా మహా హైదరాబాద్ గా మారుస్తూ రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి తగ్గట్లే.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సైతం ఆమోదముద్ర వేయటం తెలిసిందే. మరోవైపు మెగా మహా హైదరాబాద్ కోసం భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు అధికారులు. గ్రేటర్ శివారులో ఉన్న పట్టణ.. స్థానిక సంస్థల్ని విలీనం చేయాలన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం రాత్రి ఓకే చేస్తూ రాజముద్ర వేశారు. ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేయటంతో విలీన ప్రక్రియ ఇక లాంఛనప్రాయంగా చెప్పాలి.
గవర్నర్ రాజముద్ర వేసిన నేపథ్యంలో విలీన ప్రక్రియ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో ప్రకటిస్తూ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయం తదుపరి చర్యలు తీసుకుంటుంది. మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లకు వేర్వేరుగా అధికారుల్ని నియమిస్తారు.
ఇప్పటివరకు ఉన్న బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేస్తారు ఆర్థిక లావాదేవీల్ని నిలిపేయటంతో పాటు.. కీలక రికార్డుల్ని స్వాధీనం చేసుకుంటారు.విలీన ప్రక్రియ పూర్తి అయ్యాక ప్రభుత్వం డివిజన్ల పునర్విభజన చేపడుతుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వును జారీ చేసి.. ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అనంతరం ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు.. అభ్యంతరాల్ని స్వీకరించి.. వాటిని పరిష్కించి.. తుది నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇదిలా ఉండగా విలీనం తర్వాత మెగా మహా హైదరాబాద్ నగర పాలిక మూడు అవుతాయని.. కాదు ఒకటిగా ఉంటుందన్న దానిపై భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా.. గడిచిన వారం రోజులుగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ .. బల్దియా పట్టణ ప్రణాళిక.. ఎన్నికల విభాగాలు.. ప్రతిపాదిత విలీన కార్పొరేషన్లు.. మున్సిపాలిటీల్లోని టౌన్ ప్లానింగ్ అధికారులు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు విలీన ప్రక్రియపై కుస్తీ పడుతున్నారు.
జీహెచ్ఎంసీతో పాటు ప్రతిపాదిత విలీన కార్పొరేషన్లు.. మునిస్పాలిటీ మ్యాపుల ఆధారంగా క్లస్టర్లను గుర్తిస్తారని చెబుతున్నారు. ఒకట్రెండు క్లస్టర్లను ఒక డివిజన్ గా ఏర్పాటు చేయనున్నారు. కార్పొరేషన్లు. మునిసిపాలిటీల భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా క్లస్టర్ల విభజన జరుగుతోంది. ప్రతి 40-50 వేల జనాభాకు ఒక డివిజన్ ఏర్పాటు చేయాలన్నది ఆలోచనగా చెబుతున్నారు. ఆయా డివిజన్లకు సహజ సరిహద్దలు కీలకంగా ఉండనున్నాయి. నదులు..జాతీయ రహదారులు.. చెరువులు తదితరాలు హద్దులుగా ఉండనున్నాయి. ఒక్కో డివిజన్.. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఒకే జిల్లా పరిధిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.