బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి..! ఎవరా ఐదుగురు..?
సిటింగ్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి మారడం గత 25 ఏళ్లుగా తెలుగు రాజకీయాల్లో చూస్తున్నాం.. కానీ, మరో ప్రతిపక్ష పార్టీలోకి చేరడం మాత్రం కొత్తగా వింటున్నదే.;
సిటింగ్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి మారడం గత 25 ఏళ్లుగా తెలుగు రాజకీయాల్లో చూస్తున్నాం.. కానీ, మరో ప్రతిపక్ష పార్టీలోకి చేరడం మాత్రం కొత్తగా వింటున్నదే. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే జరగబోతోందని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. అచ్చంపే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివారం బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. శుక్రవారం ఆయనతో భేటీ అయిన అనంతరం గువ్వల బాలరాజు తాను ఒక్కడినే బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. రామచందర్ రావు మాత్రం ఐదుగురు సిటింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
అధికార పార్టీని కాదంటారా...?
తెలంగాణలో 2023 నవంబరులో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లు గెలచుకుంది. కాంగ్రెస్ 64, ఎంఐఎం 7, బీజేపీ 8, సీపీఐ 1 సీటులో నెగ్గాయి. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ వైపు మొగ్గారు. మిగిలిన 29 మందిలో కంటోన్మెంట్ సీటును బీఆర్ఎస్ ఉప ఎన్నికలో కోల్పోయింది. ఆ పార్టీకి మిగిలిన ఎమ్మెల్యేలు 28. వీరిలోనూ కొందరు కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరిగినా.. అదేమీ జరగలేదు. కానీ, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో రాంచందర్ రావు ఏకంగా ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని చెబుతున్నారు. వాస్తవం చూస్తే.. చేరితే గీరితే అధికార కాంగ్రెస్ లో చేరుతారు కానీ.. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీలోకి ఎందుకు వెళ్తారనేది ప్రశ్న.
వకీల్ సాబ్ దూకుడు...
రాంచందర్ రావు స్వతహాగా పేరున్న న్యాయవాది. అలా బీజేపీ చీఫ్‌గా వస్తూనే వకీల్ సాబ్ అంటే ఏమిటో చూపించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగిస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపారు. ఇప్పుడు పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా గువ్వల బాలరాజును చేర్చుకుంటున్నారు. మూడేళ్ల కిందట మొయినాబాద్ ఫాంహౌస్ వేదికగా బీజేపీ ప్రలోభపెట్టిందనే ఆరోపణలున్న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఒకరు బాలరాజు. నాడు మునుగోడు ఉప ఎన్నిక ముంగిట జరిగిన ఈ పరిణామం బీజేపీకి చేటు చేసిందనే అభిప్రాయం ఉంది.
బాలరాజు అస్త్రంగా...
ఇప్పుడు బాలరాజును చేర్చుకుంటూ.. నాటి మొయినాబాద్ ఫాంహౌజ్ ఉదంతంలో ఏం జరిగిందో ఆయనతోనే చెప్పించే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పటికే బాలరాజు నాడు తనను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు. మున్ముందు బీజేపీలో చేరాక ఆయన మరింత దూకుడు చూపి బీఆర్ఎస్ ను టార్గెట్ చేసే చాన్సుంది. అయితే, రామచందర్ రావు చెబుతున్నట్లు మాత్రం సిటింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే మాత్రం అది పెద్ద సంచలనమే. వ్యక్తిగతంగానూ ఆయనకు పెద్ద విజయమే.
పాత పరిచయాలతో చక్రం తిప్పుతున్నారా?
-బీజేపీలోకి వెళ్లేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని బీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేలు మొగ్గుచూపకపోవచ్చు. అయితే, హైదరాబాద్ సిటీ పరిసరాల్లోని వారు మాత్రం కాషాయ పార్టీలోకి వెళ్తారని ఊహించవచ్చు. అంతేగాక బీఆర్ఎస్ కు అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నది ఇక్కడే. పైగా రామచందర్ రావు సైతం హైదరాబాద్ కు చెందినవారే. ఈ పాత పరిచయాలతో ఆయన ఏమైనా చక్రం తిప్పుతున్నారా? అన్నది చూడాలి.