వైసీపీ వర్సెస్ టీడీపీ.. చిత్రమైన రాజకీయం.. !
``ఏపీలో మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోయినా.. వైసీపీ రాజకీయాలకు టీడీపీ భయపడుతోంది.;
``ఏపీలో మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోయినా.. వైసీపీ రాజకీయాలకు టీడీపీ భయపడుతోంది. అందుకే.. ఏదో ఒక పేరుతో ప్రజలను కలుస్తున్నారు. గతంలో ఇలా ఎప్పుడైనా చేశారా?. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా.. ఏడాదిలోనే ప్రజలను కలుసుకున్నారా? ఇదంతా మా జగన్ వల్ల,.. మేం అనుసరించిన ప్రజా విధానం వల్లే కదా!`` - ఇది.. వైసీపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్య.
``మా ప్రభుత్వం దూకుడుగా ఉంది. వైసీపీ తప్పులను ఎత్తి చూపుతున్నాం. ఎత్తి చూపడమే కాదు. వారిని జైలుకు కూడా పంపిస్తున్నాం. ఇక, రేపో మాపో.. మద్యం కుంభకోణంలో జగన్ కూడా జైలుకు వెళ్లడమే. అదీ.. చంద్రబాబు పాలన అంటే. మేం చూస్తూ ఊరుకుంటామని వారు అనుకున్నారు. కానీ, ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తి లేదు.`` ఇదీ.. టీడీపీకి చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇద్దరు నేతలు.. యాదృచ్ఛికంగా.. ఒకే రోజు చేసిన వ్యాఖ్యలుఇవి.
అంటే.. మేం చేస్తున్న దూకుడు కార్యక్రమాలతోనే.. టీడీపీలో చలనం వచ్చిందని వైసీపీ చెబుతుండగా.. మా వల్లే వైసీపీ గింగిరాలు తిరుగుతోందని.. టీడీపీ నాయకులు చెబుతున్నారు. వెరసి.. రెండు పక్షాలు కూడా.. ప్రజలకుచేరువ అవుతున్నాయి. తద్వారా.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఒక వేదిక.. కళ్ల ముందు నాయకులు కనిపిస్తున్నాయి. వారు చెబుతున్న సమస్యలు కొన్ని అక్కడికక్కడే పరిష్కారం కూడా అవుతున్నాయి. అంతేకాదు.. నేరుగా మంత్రులే ఇంటికి వచ్చి.. అర్జీలు తీసుకుంటున్నారు.
ఈ తరహా పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో లేక పోవడం.. కేవలం కార్యాలయాలకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. కానీ.. కోల్పోయిన ఓటు బ్యాంకును, అధికారాన్ని తిరిగి సంపాయించుకునేందుకు వైసీపీ ఇప్పటి నుంచే ప్రజలకు చేరువ అవుతుండడం.. తాము ఎంతో చేస్తున్నా.. ప్రజలకు చేరువ కావడం లేదన్న ఆవేదనతో టీడీపీ కూడా ప్రజలకు దగ్గర కావడం వంటివి ఇరు రాజకీయ పక్షాలకు ఎలా ఉన్నా.. ప్రజలకు మాత్రం మేలు అంతో ఇంతో జరుగుతోందన్నది వాస్తవం. అందుకే.. ఇరు పక్షాలు కూడా.. ప్రజలకు చేరువ అవుతున్నాయి.