‘గ్లోబల్ ఏటీఎం’ కు ఆర్థిక కష్టాలా.. 'న్యూ ఫ్యూచర్' చెప్పకనే చెబుతోంది!
అవును... సౌదీ అరేబియా భవిష్యత్ నగరమైన 'నియోమ్' అధికారికంగా గణనీయంగా తగ్గించబడే ప్రక్రియలో ఉందనే విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.;
ఒకప్పుడు అత్యంత ధనికరాజ్యంగా ఉంటూ గ్లోబల్ ఏటీఎంగా పిలవబడిన సౌదీ అరేబియాకు ఆర్థిక కష్టాలు వచ్చాయా..? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు! క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విజన్ 2030 కింద చేపట్టిన ఎన్ఈఓఎం (నియోమ్ - కొత్త భవిష్యత్తు) ప్రాజెక్టుకు నిధులు తగ్గించడంతో పాటు పలు పొదుపు చర్యలు చేపట్టడంతో ఈ ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆ ప్రాజెక్టు పనులు నెమ్మదించాయని.. కొన్ని నిర్మాణాలు నిలిచిపోయాయని అంటున్నారు.
అవును... సౌదీ అరేబియా భవిష్యత్ నగరమైన 'నియోమ్' అధికారికంగా గణనీయంగా తగ్గించబడే ప్రక్రియలో ఉందనే విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 2017లో తొలిసారిగా ప్రకటించిన ఈ మెగా ప్రాజెక్ట్.. స్థిరమైన జీవనాన్ని సృష్టించడానికి డిజైన్, సాంకేతికత కలిసే భవిష్యత్ యుగానికి నాంది పలుకుతుందని ప్రచారం చేయబడింది. దీని నిర్మాణం 2030 నాటికి పూర్తవుతుందని అంచనా వేయబడగా.. బడ్జెట్ దాదాపు 2 ట్రిలియన్ డాలర్లు అనడంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఈ ప్రాజెక్ట్ ఎడారి నుండి సముద్రం వరకు 170 కిలోమీటర్లు విస్తరించి ఉండగా.. గాలిలోకి 500 మీటర్ల ఎత్తులో ఉన్న సమాంతర అద్దాల ఆకాశహర్మ్యాలలో తొమ్మిది మిలియన్ల మంది ప్రజలు నివసించేలా ఏర్పాటు చేయబడింది. ఇదే క్రమంలో... నగరం లోపల వాహనాలు, రోడ్లు అవసరం లేకుండా నివాసితులు నివసించడానికి, పని చేయడానికి, విశ్రాంతి సమయాన్ని ఆస్వాదించడానికి అవసరమైన ప్రతిదీ ఉంటుందని దాని ప్రణాళికదారులు చెప్పారు. ఇక్కడ సున్నా ఉద్గారాల వాతావరణం ఉంటుందని వెల్లడించారు. అంటే.. పూర్తి కాలుష్య రహితం అన్నమాట!
ఈ స్థాయి ప్రాజెక్టు విషయంలో చాలా మంది ఆశ్చర్యపోయినప్పటికీ... సౌదీ అరేబియాకు ఉన్న ఆర్థిక స్థిరత్వం దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తొలుత అనిపించిందని అంటున్నారు. కట్ చేస్తే.. తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయంలో దార్శనికతను సవరించుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందుకు ప్రధాన కారణం... క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడమే అని చెబుతున్నారు. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కు సుమారు $60–70 మధ్య ఉండగా.. సౌదీ బడ్జెట్ స్థిరంగా ఉండాలంటే $90కు పైగా ధర అవసరమని అంటున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్ట్ అనుకున్నది అనుకున్నట్లు అనుకున్న సమయానికి పూర్తవ్వడం కష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లకు తాజాగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) అధ్యక్షుడు షేక్ జోవాన్ బిన్ మాటలు బలం చేకూరుస్తున్నాయి. వాస్తవానికి 2029 ఆసియా శీతాకాల క్రీడలను తొలుత వాయువ్య సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రంలో మెగా ప్రాజెక్ట్ అయిన నియోమ్ లో నిర్వహించాలని తలపెట్టారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ క్రీడలను కజికిస్థాన్ లో నిర్వహించనున్నట్లు బిన్ వెల్లడించారు.
అయితే సౌదీ ఆర్థిక పరిస్థితి ఎఫెక్ట్ కేవలం నియోమ్ మెగా ప్రాజెక్టుకే పరిమితం కాలేదు. తాజా పరిస్థితుల నేపథ్యలో సౌదీ పాలకుల ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... విదేశాంగ విధానంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయని.. యుద్ధాలపై ఖర్చు తగ్గించి, పాత శత్రువులతో సంబంధాలు మెరుగుపరచుకునే ప్రయత్నం జరుగుతోందని.. మతపరమైన ప్రచారాలకు ఇచ్చే నిధులు కూడా నియంత్రణలోకి తీసుకొచ్చారని చెబుతున్నారు. ఒక్క దెబ్బ ఇన్ని మార్పులకు కారణమైందన్నమాట!
R