కుమారుల చేతిలో తండ్రి హతం.. వివాహేతర సంబంధమే కారణం..

కుటుంబ గౌరవం మరియు నైతికత పేరుతో సొంత తండ్రి ప్రాణాలనే తీయడం అనేది అత్యంత విషాదకరమైన, దిగ్భ్రాంతికలిగించే విషయం.;

Update: 2026-04-05 09:30 GMT

కుటుంబ గౌరవం మరియు నైతికత పేరుతో సొంత తండ్రి ప్రాణాలనే తీయడం అనేది అత్యంత విషాదకరమైన, దిగ్భ్రాంతికలిగించే విషయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం, రేపాక గ్రామంలో జరిగిన ఈ ఘటన, క్షణికావేశం ఒక కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తుందో నిరూపిస్తోంది. తండ్రి ప్రవర్తనపై అసంతృప్తి ఉన్నప్పటికీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హత్యకు పాల్పడడం వల్ల ఇప్పుడు ఆ కుమారులు తమ జీవితాలను అంధకారంలోకి నెట్టుకున్నారు. ఈ దారుణ ఘటన, దాని వెనుక ఉన్న సామాజిక కోణాలపై విశ్లేషిస్తే..

హైదరాబాద్ నుండి రేపాకకు..

ఈ వివాదం కుటుంబ సభ్యుల మధ్య ఉన్న దూరం, మనస్పర్థల వల్ల మొదలైంది. మృతుడు చేరాలు రేపాక గ్రామంలో ఒంటరిగా నివసిస్తుండగా, అతని భార్య హైదరాబాద్‌లో కుమారుల వద్ద ఉంటోంది. తండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే విషయం కుమారులకు తెలిసింది. ఇది వారిలో ఆగ్రహాన్ని కలిగించింది. గ్రామానికి వచ్చిన కుమారులు, తన తండ్రి ఆ మహిళతో కలిసి ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా దాడి చేశారు.

కుమారులు చేసిన దాడిలో చేరాలుతో పాటు ఆ మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. తీవ్ర గాయాలైన వారిని వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చేరాలు మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రేగొండ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులైన కుమారుల కోసం గాలింపు చేపట్టారు.

ఇలాంటి ఘటనలు సమాజంలో పెరుగుతున్న అసహనాన్ని సూచిస్తున్నాయి. తండ్రి ప్రవర్తన తప్పు అనిపించినప్పుడు పెద్దల ద్వారా లేదా చట్టపరంగా పరిష్కరించుకోవాలే తప్ప, ప్రాణాలు తీయడం వల్ల పరిష్కారం కాదు.. అది పరిష్కారం కకపోగా.. అతి పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఈ హత్య వల్ల తండ్రి ప్రాణాలు కోల్పోగా, కుమారులు జైలుకు వెళ్లారు. మళ్లీ తల్లి ఒంటరిగా మిగిలిపోయింది. ఇలాంటి ఘాతుకాల వల్ల ఆ కుటుంబంలోని మహిళలు (తల్లి, కోడళ్లు) పిల్లలు అనాథలుగా మారిపోతారు. గ్రామీణ ప్రాంతాల్లో 'పరువు' కోసం చేసే ఇలాంటి దాడులు మనుషుల మధ్య సంబంధాలను రక్తసిక్తం చేస్తున్నాయి.

మారుతున్న సామాజిక విలువలు

తండ్రి ప్రవర్తన సమాజంలో తమకు తలవంపులు తెస్తుందనే ఆవేదనతో కుమారులు ఈ దారుణానికి ఒడిగట్టారా లేక తల్లికి అన్యాయం జరుగుతుందని ఒడిగట్టారా? అయితే, ఒక తప్పును సరిదిద్దడానికి మరో పెద్ద తప్పు (హత్య) చేయడం వల్ల సమస్య పరిష్కారం కాలేదు సరికదా.. రెట్టింపు పెరిగింది. దీనివల్ల ఆ కుటుంబంలోని వారు వివక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరువు కోసం ప్రాణాలు తీయడం మనుషుల్లో పెరుగుతున్న అసహనానికి నిదర్శనం.

నిందితుల పరిస్థితి!

ప్రస్తుతం రేగొండ పోలీసులు హత్య కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులైన కుమారులు తండ్రిని చంపినట్లు రుజువైతే, వారికి జీవిత ఖైదు లేదంటే కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవైపు తండ్రి మరణం, మరోవైపు కుమారులు జైలు పాలవ్వడం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికగా పూర్తిగా కుప్పకూలుతుంది. ఆవేశం వచ్చినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల కలిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో నిరూపితమైంది.

వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మాట వాస్తవమే.., కానీ దానికి హత్యే పరిష్కారం కాదు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. కన్న తండ్రిని చంపిన కుమారులు ఇప్పుడు చట్టం ఎదుట నేరస్తులుగా నిలబడాల్సి ఉంటుంది. సమాజంలో వారి గౌరవం కూడా దెబ్బతింటుంది. తండ్రి తప్పుడు చేశాడా? లేదా? అన్న విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ వీరు ఒకరిని చంపి జైలుకు వెళ్లొచ్చారన్న విషయం మాత్రం అందరికీ తెలుస్తుంది. సమాజంలో నైతిక విలువలతో పాటు, సహనం, చట్టం పట్ల గౌరవం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News