అన్యాయంగా భర్తలను కేసుల్లో ఇరికించే వారికి ఇదో గుణపాఠం

జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి ఈ చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది.

Update: 2026-07-14 16:38 GMT

వరకట్న వేధింపుల కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన, సంచలన తీర్పును వెలువరించింది. కేవలం కుటుంబ సభ్యులనే కారణంతో ఒకే ఇంట్లోని అందరినీ విచక్షణారహితంగా కేసుల్లోకి లాగడం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాదాపు 26 ఏళ్లుగా సాగుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన 'మీర్జాపూర్ వరకట్న వేధింపులు, మహిళ అనుమానాస్పద మృతి' కేసులో భర్తను పూర్తిగా నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా దిగువ కోర్టులు, దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి ఈ చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది.

అసలేం జరిగింది? కేసు నేపథ్యం ఇదే..

ఈ వివాదం 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ప్రారంభమైంది. ఒక వివాహిత తన అత్తవారింట్లో వంట చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడింది. సుమారు 40 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. అయితే ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదనపు కట్నం కింద రూ.50 వేలు తేవాలని తన కుమార్తెను వేధించి, చివరకు హత్య చేశారంటూ ఆరోపించారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భర్తతో పాటు అత్తమామలు, ఆడపడుచులు, బావమరుదులు సహా ఏకంగా 17 మంది కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం అత్తమామలపై చార్జ్‌షీట్ దాఖలు కాగా మిగిలిన వారిపై విచారణ కొనసాగింది.

దిగువ కోర్టుల తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

తర్వాత జరిగిన రెండు వేర్వేరు న్యాయ విచారణల్లో అత్తమామలతో పాటు మరో 14 మంది బంధువులు నిర్దోషులుగా తేలి కేసు నుండి విముక్తి పొందారు. కానీ దిగువ కోర్టు మాత్రం భర్తను దోషిగా నిర్ధారించింది. దీనిపై భర్త హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు కేసులోని అసలు నిజాలను పరిశీలించకుండా సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదనే ఒక చిన్న సాంకేతిక కారణాన్ని చూపుతూ కేసును మళ్లీ దిగువ కోర్టుకే రిఫర్ చేసింది. హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

సుప్రీంకోర్టు పరిశీలనలో తేలిన నిజాలు

సుప్రీంకోర్టు ఈ కేసులోని రికార్డులను, ముఖ్యంగా మృతురాలి మరణ వాంగ్మూలం , పోస్ట్‌మార్టం నివేదికలను స్వయంగా నిశితంగా పరిశీలించింది. ఈ విచారణలో కోర్టు కీలక అంశాలను ప్రస్తావించింది. వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడం వల్లే సదరు మహిళకు గాయాలయ్యాయని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కట్నం కోసం వేధించారనడానికి లేదా ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ ఎలాంటి విశ్వసనీయమైన ఆధారాలను కోర్టు ముందు ఉంచలేకపోయింది. కేవలం అనుమానాలు, నిరూపించలేని ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించి శిక్షించడం చట్టబద్ధం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. భర్తపై ఉన్న శిక్షను రద్దు చేస్తూ తక్షణమే అతడిని విడుదల చేయాలని ఆదేశించింది.

దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక

ఈ తీర్పు సందర్భంగా వరకట్న వేధింపుల చట్టాల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. "కేవలం వివాహ బంధంతో ముడిపడి ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో, నిందితుడి కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ కేసుల్లోకి లాగడం న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయడమే అవుతుంది. ప్రతి నిందితుడిపై వ్యక్తిగతంగా బలమైన, స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే కేసులు నమోదు చేయాలి. లేకపోతే ఎలాంటి తప్పు చేయని నిర్దోషులు దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకోవాల్సి వస్తుంది " అని కోర్టు హెచ్చరించింది.

26 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత బాధితుడికి న్యాయం దక్కినప్పటికీ ఒక యువకుడి జీవితంలోని పాతికేళ్లకు పైగా సమయం కోర్టుల చుట్టూనే గడిచిపోయింది. భవిష్యత్తులో వరకట్న వేధింపుల కేసుల దర్యాప్తులో విచారణల్లో ఈ తీర్పు ఒక అత్యంత కీలకమైన మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాక్ష్యాలు లేకుండా కేవలం ఆరోపణలతో కేసులను బనాయించకూడదని ఈ తీర్పు మరోసారి రుజువు చేసింది.

Tags:    

Similar News