కూటమి కీలక భేటీ...మరో హిట్ కోసం !
ఇక ఏపీలో ప్రస్తుతం సర్ ప్రక్రియ సాగుతోంది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి అవుతుంది.
ఏపీలో టీడీపీ కూటమి కీలక సమావేశం ఈ జూలై 15వ తేదీ బుధవారం జరగబోతోంది. ఈ భేటీ చాలా కాలం తరువాత జరగడంతో ఆసక్తి పెరుగుతోంది. ఏపీలో మూడు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమిలో ఉన్నాయి. ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు 2024లో ఎంతో ఐక్యతను ప్రదర్శించాయి. ఒక్క ఓటు కూడా పొల్లుపోకుండా కూటమికి దక్కేలా చూశాయి. అందుకే అద్భుతమైన విజయం కూటమి పార్టీలకు దక్కింది. అయితే ఇపుడు మరో ఎన్నికకు రంగం సిద్ధం అవుతోంది. అదే స్థానిక సంస్థలకు ఎన్నికలు.
ఫోకస్ దాని మీదనే :
ఈ నేపధ్యంలోనే కూటమి పార్టీలు సమావేశం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని రిపీట్ చేయాలన్న పట్టుదలతోనే ఈ భేటీ జరుగుతోంది. ప్రధాని అజెండా కూడా లోకల్ బాడీస్ కి ఎన్నికలు అని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని కూటమి పట్టుదలగా ఉంది. అందువల్ల గ్రౌండ్ లెవెల్ లో మరింతగా కో ఆర్డినేషన్ కావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళకు పై దాటింది. దాంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోంది కాబట్టి ప్రజల మద్దతు పూర్తిగా తమకే ఉంది అని గట్టిగా చాటి చెప్పాలన్నది కూటమి పెద్దల ఆలోచనగా ఉంది. అది జరగాలంటే మూడు పార్టీలు సమిష్టిగా మరింత చురుకుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. స్థానిక సంస్థల విషయం చర్చించడంతో పాటు మూడు పార్టీల మధ్య సఖ్యతను ఇంకా పెంచుకోవాల్సిన అనివార్యత గురించి కూడా ఈ భేటీలో చర్చిస్తారు అని అంటున్నారు.
పవన్ కి బదులుగా
ఇక ఈ కూటమి సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు. బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరవుతున్నారు. జనసేన నుంచి అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోతున్నారు. ఆయన భుజం నొప్పి కారణంగా ముంబై ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. దాంతో జనసేన నుంచి సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఈ సమావేశానికి హాజరవుతారు అని అంటున్నారు. ఈ మూడు పార్టీలు కూడా తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చిస్తారు అని అంటున్నారు.
అక్టోబర్ లో జరిగే చాన్స్ :
ఇక ఏపీలో ప్రస్తుతం సర్ ప్రక్రియ సాగుతోంది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి అవుతుంది. దాంతో ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే లోకల్ బాడీస్ కి ఎన్నికలు పెట్టాలని సూత్రప్రాయంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో సమయం చూస్తే గట్టిగా రెండు నెలలు మించి లేకపోవడంతో ఇప్పటి నుంచే గ్రౌండ్ లో ప్రిపరేషన్ అవసరం అని కూటమి పెద్దలు భావిస్తున్నారు. అంతే కాదు ఎక్కడ ఎవరు బలంగా ఉన్నారు, ఏఏ చోట్ల ఎవరు పోటీ చేయాలి, సీట్ల సర్దుబాటు వంటివి కూడా ఈ సందర్భంగా ప్రాధమికంగా చర్చిస్తారు అని అంటున్నారు. మూడు పార్టీలకు చెందిన ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులతో పాటు పార్టీ క్యాడర్ అంతా ఒక్క త్రాటి మీద ఉండాల్సిన అవసరాన్ని కూడా ఈ సమావాశంలో చర్చిస్తారు అని అంటున్నారు. 2024 ఎన్నికల ఫలితాలు నూరు శాతం పునారావృత్తం అయ్యేలా మూడు పార్టీల అధినాయకత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయిస్తారు అని అంటున్నారు.