మత్స్యకారుల కన్నీళ్లతో రాజకీయాలా? జగన్ తీరుపై పల్లా తీవ్ర ఆగ్రహం
మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖలో బోటు ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్‌పై విమర్శలు గుప్పించిన పల్లా, అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులను గాలికొదిలేశారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్‌కు మత్స్యకారులను పరామర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ఇది సానుభూతి రాజకీయాలు కాదని, కపట రాజకీయాల పరాకాష్ట అంటూ దుయ్యబట్టారు.
వైసీపీ పాలనలో ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఏమాత్రం అండగా నిలవని జగన్, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే శవ రాజకీయాలకు తెరలేపారని పల్లా విమర్శించారు. వైసీపీ పాలనలో మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించి, పరిహారం కూడా ఇవ్వని జగన్, ఇప్పుడు హఠాత్తుగా కోటి రూపాయల ప్రకటన చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని పల్లా ఆరోపించారు.
ఇటీవల జరిగిన బోటు ప్రమాదంపై కూటమి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించిందని పల్లా వివరించారు. ప్రమాదం జరిగిన 72 గంటల్లోపే ఆరు బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారాన్ని విడుదల చేశామని తెలిపారు. సమాచారం అందిన వెంటనే కోస్ట్‌గార్డ్, నేవీ, పోర్టు అధికారులతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను చేపట్టామని, అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం గంగవరం పోర్టుకు సమీపంలో ఉన్నప్పటికీ, స్థానిక వైసీపీ నాయకులు సమాచారాన్ని గోప్యంగా ఉంచి రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల నిర్లక్ష్యాన్ని పల్లా ఎండగట్టారు. గతంలో బడ్జెట్ లేదనే సాకుతో ఎక్స్‌గ్రేషియా బకాయిలను పెండింగ్‌లో పెట్టారని, జీవో 217 ద్వారా మత్స్యకారుల ఉపాధిని దళారులకు కట్టబెట్టారని విమర్శించారు. జోన్–నాన్‌జోన్ పేరుతో విద్యుత్ సబ్సిడీని కట్ చేయడం, పెదజాలారిపేటలో మత్స్యకారుల భూములపై కన్నేయడం వంటి చర్యలు జగన్ ప్రభుత్వానికి మత్స్యకారుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నాయని ఆరోపించారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం మత్స్యకారుల పట్ల నిబద్ధతను చేతల్లో చూపిస్తోందని పల్లా స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన 63 ఎక్స్‌గ్రేషియా క్లెయిమ్‌లను పరిష్కరించి రూ. 3.15 కోట్లు విడుదల చేయడమే కాకుండా, రూ. 9.90 కోట్ల డీజిల్ సబ్సిడీ బకాయిలను చెల్లించామని తెలిపారు. రెండేళ్లలోనే రూ. 505 కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని నేరుగా మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో జమ చేశామని, 2026-27 బడ్జెట్‌లో డీజిల్ సబ్సిడీ కోసం రూ. 50 కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు.