ట్రంప్ 'కరెన్సీ' రాజకీయం: అమెరికా నోట్లపై సంతకం.. నాణెంపై బొమ్మ.. రేగుతున్న వివాదం
అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న శుభతరుణంలో అక్కడి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని సంచలన నిర్ణయాలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న శుభతరుణంలో అక్కడి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని సంచలన నిర్ణయాలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సాధారణంగా ఏ దేశంలోనైనా కరెన్సీ నోట్లు, నాణేలపై దేశ ప్రతిష్ఠను చాటే చిహ్నాలు, చారిత్రక పురుషుల చిత్రాలు ఉంటాయి. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పేరును, సంతకాన్ని, చివరికి తన ముఖచిత్రాన్ని కూడా దేశ కరెన్సీపై ముద్రించేందుకు సిద్ధమవ్వడం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా పెద్ద దుమారమే రేపుతోంది. ఇది ట్రంప్ ఆత్మస్తుతికి, వ్యక్తిగత ప్రచార పతాకస్థాయికి నిదర్శనమంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
తొలిసారిగా కరెన్సీపై దేశ అధ్యక్షుడి సంతకం
అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ప్రకటించిన వివరాల ప్రకారం.. తొలిదశలో భాగంగా ట్రంప్ సంతకంతో కూడిన కొత్త 100 డాలర్ల నోట్ల ముద్రణ ఇప్పటికే ప్రారంభమైంది. అమెరికా చరిత్రలోనే అధికారంలో ఉన్న ఒక అధ్యక్షుడి సంతకం కరెన్సీ నోటుపై కనిపించబోతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సాధారణంగా ట్రెజరీ కార్యదర్శుల సంతకాలు మాత్రమే కరెన్సీపై ఉంటాయి, కానీ ట్రంప్ తన మార్క్ కోసం ఈ కొత్త సంప్రదాయానికి తెరలేపారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రంప్ సంతకంతో ఉన్న 100 డాలర్ల నోట్ నమూనా విపరీతంగా వైరల్‌గా మారింది. దీనిని ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో చర్చ మరింత ముదిరింది. కొందరు దీనిని అమెరికా చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా అభివర్ణిస్తుండగా మరికొందరు మాత్రం ప్రభుత్వ వ్యవస్థలను వ్యక్తిగత ప్రచార వేదికలుగా మార్చే ప్రయత్నమని విమర్శిస్తున్నారు. ట్రంప్ సంతకం శైలిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. "సంతకం ఎంత గజిబిజిగా ఉందో.. ఆయన పాలన కూడా అంతే గజిబిజిగా ఉంది" అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
$1 నాణెంపై ట్రంప్ ముఖచిత్రం.. చట్టపరమైన చిక్కులు
నోటుపై సంతకంతో ఆగకుండా ఏకంగా 1 డాలర్ నాణెం పై ట్రంప్ ముఖచిత్రాన్ని ముద్రించాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇక్కడే ట్రంప్ ప్రభుత్వానికి ఒక పెద్ద చట్టపరమైన అడ్డంకి ఎదురైంది. ప్రస్తుత అమెరికా చట్టాల ప్రకారం.. జీవించి ఉన్న ఏ వ్యక్తి చిత్రాన్ని కూడా అధికారిక చలామణిలో ఉండే కరెన్సీ లేదా నాణేలపై ముద్రించడం నిషిద్ధం. అందువల్ల ట్రంప్ బొమ్మతో కూడిన కాయిన్ విడుదల కావాలంటే అమెరికన్ కాంగ్రెస్ ప్రత్యేకంగా చట్టాన్ని సవరించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. న్యాయ నిపుణులు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో ఈ అంశంపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.
చారిత్రక నిర్ణయమా? వ్యక్తి ఆరాధనా?
ఇప్పటికే విదేశాంగ విధానాలు, సుంకాల పెంపు, అంతర్జాతీయ యుద్ధాలపై తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో కరెన్సీపై తన ముద్ర వేయాలనే ప్రయత్నం మంటలకు మరింత నెయ్యి పోసినట్లయింది.
అధికార పక్షం వాదన.. అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని దేశ చరిత్రలో నిలిచిపోయేలా తీసుకున్న చారిత్రక నిర్ణయమిది అని ట్రంప్ మద్దతుదారులు సమర్థిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేయడమేనని, ట్రంప్ తన వ్యక్తిగత అహంకారాన్ని, "వ్యక్తి ఆరాధన" సంస్కృతిని దేశంపై రుద్దుతున్నారని డెమొక్రాట్లు ధ్వజమెత్తుతున్నారు.
మొత్తానికి అమెరికా కరెన్సీ హిస్టరీలో ట్రంప్ తెస్తున్న ఈ మార్పులు కేవలం ఆ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. చట్టపరమైన అడ్డంకులను దాటుకుని ట్రంప్ నాణెం మార్కెట్లోకి వస్తుందో లేదో చూడాలి.