మాజీ మంత్రి అప్పలరాజుకు షాక్ మీద షాక్.. కొడుకు వ్యవహారంలో సీదిరిపై కేసు

నిజానికి రోడ్డు ప్రమాదంపై రాజీ చేసుకోడానికి మాజీ మంత్రి అప్పలరాజు ప్రయత్నించారని చెబుతున్నారు.

Update: 2026-07-14 14:02 GMT

మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు పోలీసులు వరుస షాక్ లు ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో పోలీసులను తప్పుదారి పట్టించారనే ఆరోపణలతో అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మతోపాటు సీదిరి అనుచరుడు సిద్ధార్థ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా, తాజాగా మాజీ మంత్రిపైనా కేసు నమోదు చేశారని చెబుతున్నారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. అప్పలరాజు కుమారుడు అరెస్టుపై మాజీ సీఎం జగన్మోహనరెడ్డి సైతం స్పందించారు. రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కుమారుడిని అరెస్టుచేయడాన్ని జగన్ రెడ్డి తప్పుబట్టారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, అయితే హత్య కేసు కింద అరెస్టుచేస్తారా? అంటూ జగన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక జగన్ రెడ్డి ఈ విషయమై జోక్యం చేసుకోవడానికి కొద్దిసేపటి ముందే మాజీ మంత్రి అప్పలరాజుపైనా కేసు నమోదు చేశారన్న విషయం వెలుగుచూసింది.

నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరి మరణానికి కారణమైన వ్యవహారంలో పోలీసులను తప్పుదారి పట్టించడం, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై మాజీ మంత్రి అప్పలరాజుపై కేసులు నమోదు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అన్న చర్చ జరుగుతోంది. ఇదే కేసులో అప్పలరాజు కుమారుడు అరెస్టు అయ్యారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రిపై పోలీసుల చర్యలు ఎలా ఉండనున్నాయనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.

పలాస నియోజకవర్గానికి చెందిన సీదిరి అప్పలరాజుకు అక్కడి టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషకు మధ్య రాజకీయ వైరం వ్యక్తిగత శత్రుత్వం స్థాయిలో కొనసాగుతోందని చెబుతున్నారు. అప్పలరాజు మంత్రిగా ఉన్న సమయంలో శిరీషపై సోషల్ మీడియాలో అనుచితంగా దాడి చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత ఎన్నికల్లో ఎమ్మెల్యే శిరీష గెలిచిన నుంచి అప్పలరాజును అరెస్టు చేయించాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయని అంటున్నారు. ఆయనపై కేసులు నమోదైనా ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. అయితే ఇప్పుడు తమ చేతులకు మట్టి అంటకుండా అరెస్టు చేసే అవకాశం రావడంతో ఎమ్మెల్యే శిరీష ఎలా పావులు కదుపుతారనేది చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.

నిజానికి రోడ్డు ప్రమాదంపై రాజీ చేసుకోడానికి మాజీ మంత్రి అప్పలరాజు ప్రయత్నించారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తన కుమారుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతడిపై కేసు లేకుండా తన అనుచరుడి పేరుతో కేసు నమోదు అయ్యేలా పోలీసులకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. అయితే ఈ విషయమై అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగడంతో మొత్తం కేసు వ్యవహారం మలుపు తిరిగిందని చెబుతున్నారు. గత శుక్రవారం రాత్రి ప్రమాదం జరగగా, ఆదివారం ఓ పత్రికలో వార్త వచ్చినంత వరకు పలాస వెలుపల ఎవరికి ఈ ఘటనపై సమాచారం లేదని అంటున్నారు. కానీ ఆదివారం రోడ్డు ప్రమాదంపై ఓ పత్రికలో కథనం ప్రచురితం కావడంతో అధికార పార్టీ నేతలు రంగ ప్రవేశం చేసి మాజీ మంత్రి అప్పలరాజు పోలీసులను తప్పుదారి పట్టించారనే విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారని అంటున్నారు.

ప్రమాదం జరిగిన రోజున గాయపడిన కుమారుడిని మాజీ మంత్రి అప్పలరాజు స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లిన సీసీ టీవీ పుటేజి బయటకు రావడం, బాధిత కుటుంబంతో చర్చలు జరిపి రాజీ చేసుకోడానికి ప్రయత్నించడం, రోడ్డు ప్రమాదానికి కారణమైన వారి స్థానంలో వేరొకరిని అరెస్టు అయ్యేలా చేయడం చేశారని అప్పలరాజుకు వ్యతిరేకంగా పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారని అంటున్నారు. ఇక ఈ విషయంలో పోలీసుల తదుపరి యాక్షన్ ఎలా ఉండనుందనేదే ప్రస్తుతానికి సస్పెన్ష్ గా మారిందని అంటున్నారు.

Tags:    

Similar News