విన్నపాలు వినవలె: కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ
కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి వరుసగా భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులను ఆయన కలుసుకున్నారు.
కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి వరుసగా భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులను ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ విమానాశ్రయం, ఆర్ ఆర్ ఆర్ రహదారి పనులకు సంబంధించిన కీలక అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఇరువురు కేంద్ర మంత్రులు తనను ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆర్ ఆర్ ఆర్ నార్త్ పనులను కేంద్ర కేబినెట్ ఆమోదం పెండింగులో ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి గడ్కరీని విన్నవించామని.. త్వరలోనే కేబినెట్‌లో పెట్టి ఆమోదం పొందేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇక, దక్షిణ ప్రాంతానికి సంబంధించిన పనులకు కేబినెట్ ఆమోదం తెలిపినా.. ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదని దీంతో పనులు ముందుకు సాగడం లేదని సీఎం రేవంత్ వివరించారు. దీనికి కూడా సానుకూలంగా ఆయనే స్పందించినట్టు సీఎం తెలిపారు.
ఇక, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు సంబంధించిన వివిధ అంశాలపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.ఈ సందర్భంగా ఇరువురు ఆప్యాయంగా పలకరించుకున్నారు. విమానాశ్రయాలకు సంబంధించిన భూసేకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని రామ్మోహన్‌నాయుడు ప్రశంసించారు. 2028 నాటికి వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి కోరినట్టు ఆయన చెప్పారు.
దానికి అనుగుణంగానే ప్రణాళికలు రెడీ చేస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. అలాగే.. తెలంగాణలో రాకపోకలు పెరుగుతున్నాయని.. పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మరిన్ని ఎయిర్ పోర్టులు రావాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్ విమా నాశ్రయాన్ని కూడా ప్రధాన అంశంగా పరిగణిస్తామన్నారు. అయితే.. ఇక్కడ భూసేకరణ సమస్యగా మారిం దన్నారు. దీనిని పరిష్కరించి ముందుకు సాగుతామని వెల్లడించారు.