హైదరాబాద్‌లో 'అద్దె బాయ్‌ఫ్రెండ్' కాన్సెప్ట్ అతి వేగంగా!

మరోవైపు ఇటువంటి కాన్సెప్ట్‌లను నమ్మి సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తే సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది.

Update: 2026-07-14 16:45 GMT

జపాన్, చైనా వంటి విదేశాల్లో బాగా పాపులర్ అయిన 'రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్' కాన్సెప్ట్ ఇప్పుడు భారతదేశంలోని మెట్రో నగరాల్లోనూ అక్కడక్కడా వినిపిస్తోంది. షాపింగ్, సినిమాలు, కెఫేలు లేదా ఈవెంట్లకు తోడుగా రావడానికి, కేవలం ఒక మంచి స్నేహితుడిగా సమయం గడపడానికి గంటల ప్రాతిపదికన అబ్బాయిలను అద్దెకు తీసుకునే వినూత్న ఆలోచన ఇది. ఇటీవల హైదరాబాద్‌కు కొత్తగా వచ్చిన ఒక విద్యార్థి, తన చదువు ఖర్చుల కోసం.. నగరాన్ని అన్వేషించడం కోసం ఈ బిజినెస్ ఐడియాను స్థానిక సోషల్ మీడియా ఫోరమ్‌లలో షేర్ చేయ‌డంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే భాగ్యనగరంలో ఇలాంటి ట్రెండ్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది ఆలోచించాల్సిన విషయమే.

హైదరాబాద్ సంస్కృతి.. ఇక్కడి మార్కెట్ ట్రెండ్స్ పరిశీలిస్తే ఈ 'రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్' ఆలోచన ఇక్కడ వర్కవుట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు, నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. విదేశాలతో పోలిస్తే మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్‌ లాంటి నగరాల్లో అమ్మాయిలకు తోడుగా రావడానికి లేదా స్నేహం చేయడానికి అబ్బాయిల కొరత ఏమాత్రం లేదు. సాధారణ డేటింగ్ యాప్స్ ద్వారానే సులభంగా స్నేహితులను వెతుక్కునే వీలున్నప్పుడు.. కేవలం తోడు కోసం డబ్బులు చెల్లించి అపరిచిత వ్యక్తులను అద్దెకు తెచ్చుకోవడానికి ఇక్కడి మహిళలు ఆసక్తి చూపరనేది బహిరంగ వాస్తవం.

భారతీయ సమాజంలో భద్రత - సామాజిక నిందలు అనేవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఎంత కచ్చితమైన నిబంధనలు, హద్దులు పెట్టుకున్నప్పటికీ... ఒక తెలియని వ్యక్తిని డబ్బులిచ్చి బాయ్‌ఫ్రెండ్‌గా పబ్లిక్ ప్రదేశాలకు తీసుకువెళ్లడానికి సగటు హేతుబద్ధమైన అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. దీనివల్ల వారి ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే భయం ఉంటుంది. అలాగే ``సమాజం ఏమనుకుంటుంది?`` అనే సాంప్రదాయ ఆలోచనల వల్ల కూడా ఇటువంటి వింత కాన్సెప్ట్‌లకు మన నగరాల్లో డిమాండ్ ఏర్పడటం దాదాపు అసాధ్యం.

మరోవైపు ఇటువంటి కాన్సెప్ట్‌లను నమ్మి సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తే సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్‌లో 'ఫ్రెండ్‌షిప్ క్లబ్స్' లేదా డేటింగ్ సర్వీసెస్' పేరిట అనేక నకిలీ ఏజెన్సీలు చలామణిలో ఉన్నాయి. క్లైంట్లను సెట్ చేస్తామంటూ ముందే "రిజిస్ట్రేషన్ ఫీజు'' వసూలు చేసి యువకులను ముంచేసే ముఠాలు హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయి. కాబట్టి పాకెట్ మనీ సంపాదించాలనే ఆరాటంలో ఇలాంటి నకిలీ ఆఫర్ల వైపు వెళ్లడం వల్ల ఆర్థికంగా, మానసికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందుకే హైదరాబాద్ లాంటి నగరాల్లో చదువుకుంటూ పార్ట్-టైమ్ సంపాదన లేదా కొత్త పరిచయాలు పెంచుకోవాలనుకునే యువకులు ఇలాంటి విభిన్న ఆలోచనల జోలికి వెళ్లకుండా... ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే ప్రముఖ కెఫేలలో పార్ట్-టైమ్ బారిస్టాగా, వీకెండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ గ్రూప్స్‌లో లేదా క్యాంపస్ అంబాసిడర్ రోల్స్‌లో చేరి సులభంగా డబ్బు సంపాదించవచ్చు. అలాగే కొత్త స్నేహితుల కోసం... నగరాన్ని చుట్టేయడం కోసం హైదరాబాద్‌లో ఉండే ట్రెకింగ్ క్లబ్స్, బుక్ రీడింగ్ క్లబ్స్ లేదా ఫుడ్ వాక్ గ్రూప్స్‌లో చేరడం అత్యంత సురక్షితమైన, ఆరోగ్యకరమైన మార్గం.

Tags:    

Similar News