'మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక‌..': జ‌గ‌న్ అవే కామెంట్స్‌

"మ‌రో రెండున్న‌రేళ్ల‌లోనే మ‌న ప్ర‌భుత్వం వ‌స్తుంది. క‌ళ్లుమూసుకుంటే రెండున్న‌రేళ్లు గిర్రున తిరిగిపోతాయి" అని వ్యాఖ్యానించారు.

Update: 2026-07-14 16:35 GMT

విశాఖప‌ట్నం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మ‌రోసారి పాత కామెంట్ల‌నే వ‌ల్లె వేశారు. "మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. "అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి. "మ‌రో రెండున్న‌రేళ్ల‌లోనే మ‌న ప్ర‌భుత్వం వ‌స్తుంది. క‌ళ్లుమూసుకుంటే రెండున్న‌రేళ్లు గిర్రున తిరిగిపోతాయి" అని వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల విశాఖకు చెందిన కొంద‌రు మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్లి గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. వీరిలో ఒక్క‌రు మాత్ర‌మే వెనుదిరిగి రాగా, ఏడుగురి ఆచూకీ క‌నిపించ‌కుండా పోయింది.

వీరిని ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ మంగ‌ళ‌వారం విశాఖ‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా బాధిత కుటుంబాల ఇంటికి వెళ్లిన ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. బాధిత కుటుంబాల‌కు కోటి రూపాయ‌ల చొప్పున ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. కేవ‌లం ప‌ది ల‌క్ష‌ల రూపాయిలు ఇచ్చి చేతులు దులుపుకొన్నార‌ని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌త్స్య‌కారుల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకున్నామ‌ని చెప్పారు.

పాకిస్థాన్‌లో చిక్కుకుపోయిన మ‌త్స్య‌కారుల‌ను కూడా వెన‌క్కి తీసుకువ‌చ్చామ‌ని గ‌తాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించింద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. ఈ నెల 4నే ప్ర‌మాదం జ‌రిగింద‌ని.. ఈ విష‌యం తెలిసిన త‌ర్వాత కూడా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. తాము అధికారంలోకి రాగానే.. బాధిత కుటుంబాల‌కు కోటి రూపాయ‌ల చొప్పున ప‌రిహారం అందించి ఆదుకుంటామ‌ని వ్యాఖ్యానించారు.

త‌మ హ‌యాంలో మ‌త్స్య‌కారుల‌ను ఆదుకునేందుకు భ‌రోసా ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చామ‌ని జ‌గ‌న్ చెప్పారు. ఇప్పుడు ఆ ప‌థ‌కాన్ని కూడా నీరు గార్చార‌ని అన్నారు. 2018లో తాను చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీల మేర‌కు.. అన్నీ నెర‌వేర్చామ‌ని చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వానికి మాన‌వ‌త్వం లేద‌న్నారు. ఉండి ఉంటే.. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే బాధితుల‌కు అండ‌గా ఉండేందుకు.. విశాఖ‌కు చెందిన మంత్రుల ను పంపించి ఉండేద‌ని అన్నారు. అంతా అయిపోయిన త‌ర్వాత తూతూ మంత్రంగా సాయం చేసి చేతులు దులుపుకొన్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

Tags:    

Similar News