కూటమి ఎమ్మెల్యేలకు హ్యాపీ.. !
ఈ ఎం.ఎస్.ఎం.ఈ పార్కులపై పూర్తి నియంత్రణ కలెక్టర్‌కు ఉంటున్నా.. నియోజకవర్గాల వారీగా.. ఎవరికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలన్న కీలక అంశాన్ని ఎమ్మెల్యేలకు అప్పగించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇది ఒకరకంగా శుభవార్తేనని చెప్పాలి. ప్రతి నియోజకవర్గంలో ఎం.ఎస్.ఎం.ఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని కీలక నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేశారు కూడా!. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ఎం.ఎస్.ఎం.ఈలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపోస్తోంది. తద్వారా నియోజకవర్గాల్లో బలమైన అభివృద్ధికి బాటలు వేసినట్టు అవుతుందని అంచనా వేస్తున్నారు.
ముందుగా.. కూటమిపార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న 164 నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ నియోజకవర్గాల్లో వందల ఎకరాల్లో ఎం.ఎస్.ఎం.ఈ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. అయితే.. దీనివల్ల ఎమ్మెల్యేలకు ఒరిగేదేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ.. ఉపాధి, ఉద్యోగ కల్పన వంటివి ప్రధాన సమస్యగా ఉన్నాయి. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఎం.ఎస్.ఎం.ఈల ద్వారా ఈ సమస్య కొలిక్కి వస్తుంది.
ఎవరికి అధారిటీ..
ఈ ఎం.ఎస్.ఎం.ఈ పార్కులపై పూర్తి నియంత్రణ కలెక్టర్‌కు ఉంటున్నా.. నియోజకవర్గాల వారీగా.. ఎవరికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలన్న కీలక అంశాన్ని ఎమ్మెల్యేలకు అప్పగించారు. అంటే.. వారు ఎంపిక చేసిన యువతకు ప్రాధాన్యం దక్కుతుంది. తద్వారా నియోజకవర్గంలో ఉపాధి, ఉద్యోగావ కాశాలను మరింత విస్తృతంగా పెంచేందుకు అవకాశం ఉంటుంది. ఇది అనూహ్యంగా ఎమ్మెల్యేలకు యువతకు మధ్య కనెక్టివిటీని పెంచుతుందని అంచనా వేస్తున్నారు.
వేల కోట్లు..
ఈ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం స్తలాలు చూపిస్తుంది. కానీ, పెట్టుబడులు పెట్టేవారు.. పారిశ్రామిక వేత్తలను కూడా ఎమ్మెల్యేలు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా కూడా పరిశ్రమలు స్థాపించేందుకు ఈ విధానంలో అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే.. ఎవరికి వారు ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. యువతను ఎంగేజ్ చేసుకుని వారిని ఎంపిక చేసి ఉద్యోగాలు కల్పిస్తే.. అనూహ్యంగా యువత వీరివైపే ఉంటుందని అంచనా వేస్తున్నారు.