సోషల్ మీడియాలోనే హడావుడి.. క్షేత్రస్థాయిలో కనిపించని 'కాక్రోచ్' అభిమానం.. సోనమ్ వాంగ్ చుక్ పోరాటం వృథాయేనా?

సోనమ్ వాంగ్ చుక్ 17 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారని, ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన పోస్టు ఆలోచనలకు గురిచేస్తోందని చెబుతున్నారు.

Update: 2026-07-14 18:30 GMT

సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్లతో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలను అలవోకగా దాటేసిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ప్రభావం అప్పుడే మసకబారిందా? అన్న చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఒక సెటైరికల్ పేజీగా మొదలై ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా ఆన్ లైన్ వేదికగా హడావుడి చేసిన కాక్రోచ్ పార్టీ క్షేత్రస్థాయి రాజకీయాలకు దిగడాన్ని ఫాలోవర్లు కూడా స్వాగతించడం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం గత 20 రోజులుగా ఢిల్లీ వేదికగా కాక్రోచ్ పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా, ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేకపోవడమే అంటున్నారు. అదే సమయంలో కాక్రోచ్ పార్టీ డిమాండ్లకు మద్దతుగా గత 17 రోజులుగా ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నా ప్రభుత్వంలో కానీ, కాక్రోచ్ పార్టీ ఫాలోవర్లలో కానీ ఎటువంటి కదలిక కనిపించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సోనమ్ వాంగ్ చుక్ 17 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారని, ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన పోస్టు ఆలోచనలకు గురిచేస్తోందని చెబుతున్నారు. సహజంగా కాక్రోచ్ పార్టీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగుతో ఇప్పటికే ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సివుంటుంది. యువత ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ వారి డిమాండ్ల సాధనకు ఓ వ్యక్తి తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంటే ఎవరూ పట్టించుకోని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. నిజానికి కాక్రోచ్ పార్టీ క్షేత్రస్థాయి పోరాటాలకు యువతలో మద్దతు ఎక్కువగా ఉంటే సోనమ్ వాంగ్ చుక్ నిరాహారదీక్షకు దిగిన ఒకటి రెండు రోజులకే ఢిల్లీ వీధులు దద్దరిల్లేలా పోరాటం ఉధృతమయ్యేది అని అంటున్నారు.

కానీ, యువతలో కాక్రోచ్ పార్టీ క్షేత్రస్థాయి పోరాటంపై ఆసక్తి లేకపోవడం కారణంగా సోనమ్ వాంగ్ చుక్ 17 రోజుల పోరాటం అనంతరం నిరసన దీక్షను విరమించాల్సిందిగా కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కోరడం చర్చనీయాంశంగా మారింది. యువత నుంచి అనుకున్నంత స్థాయిలో స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కూడా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహారదీక్షను తేలిగ్గా తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. 17 రోజులుగా సోనమ్ వాంగ్ చుక్ ఆహారం లేకుండా గడుపుతుంటే ఢిల్లీ మాజీ సీఎం అతిషితోపాటు సీపీఎం ఎంపీ అమ్రా రామ్ వంటి కొద్ది మంది మినహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో కాక్రోచ్ పార్టీ చేపట్టిన క్షేత్రస్థాయి పోరాటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ నెల 20న పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా నిరసన ప్రదర్శనకు కాక్రోచ్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రస్తుతం సోనమ్ వాంగ్ చుక్ నిరాహారదీక్షకే పెద్దగా స్పందన కనిపించని పరిస్థితుల్లో 20న జరగబోయే కార్యక్రమం విజయవంతమయ్యేనా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీక్ష కారణంగా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఆయన ఇప్పటికే సుమారు 8 కిలోలకు పైగా బరువు తగ్గారని, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఆందోళనకరంగా పడిపోయాయని చెబుతున్నారు.

Tags:    

Similar News