రాజకీయాల్లో ఇమడలేని ముద్రగడ !
ఇక ఆ సమయంలో ఆయన రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. ఆ తరువాత సీనియర్ నేతలు కేఈ క్రిష్ణమూర్తి వంటి వారితో కలిసి తెలుగు నాడు పార్టీని స్థాపించారు.
ముద్రగడ పద్మనాభం అన్న పేరు తలచుకుంటే వెంటనే ట్యాగ్ లైన్ గా కాపు ఉద్యమ నాయకుడు అని గుర్తుకు వస్తుంది. ముద్రగడ అంటేనే రాజీ లేని నాయకుడు అని కూడా చెప్పుకోవాలి. ఆయన పట్టుదల సైతం అందరికీ గుర్తుకు వస్తుంది. ముద్రగడ రాజకీయాలలో ఉన్నా కూడా ఎక్కువగా ఆయనను ఉద్యమ నాయకుడిగానే చెప్పుకోవాలి. ముద్రగడ కుటుంబం రాజకీయ నేపధ్యం ఉన్న ఫ్యామిలీ. ఆయన తండ్రి ముద్రగడ వీర రాఘవరావు ప్రత్తిపాడు శాసనసభ్యుడిగా 1962, 1967 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసి వరసగా రెండు సార్లు విజయం సాధించారు. ముద్రగడ సైతం తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చారు. కరెక్ట్ గా పాతికేళ్ళ వయసులోనే 1978లో ఆయన తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ప్రత్తిపాడు నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అది కూడా జనతా పార్టీ నుంచి.
ఎన్టీఆర్ పిలుపుతో :
ముద్రగడ పద్మనాభం టీడీపీ అధినేత ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరారు. ముద్రగడ నీతి నిజాయతీ నచ్చి ఎన్టీఆర్ ఆయనకు తన మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖను అప్పగించారు. అందులో కొంత కాలం కొనసాగిన ముద్రగడ ఆ తరువాత ఏకంగా మంత్రి పదవికే రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఇక ఆ సమయంలో ఆయన రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. ఆ తరువాత సీనియర్ నేతలు కేఈ క్రిష్ణమూర్తి వంటి వారితో కలిసి తెలుగు నాడు పార్టీని స్థాపించారు.
రాజీవ్ గాంధీ ఇంటికి :
ఇదిలా ఉంటే ఆనాడు కేంద్రంలో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్న ముద్రగడ ఇంటికి రావడం ఒక విశేషంగా చెప్పుకున్నారు. ఆ విధంగా రాజీవ్ గాంధీకి ముద్రగడ ఆతీధ్యం ఇచ్చారు. 1989లో ముద్రగడ కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. మరోసారి మంత్రిగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విభేదించి తొలిసారి 1993లో కాపులకు బీసీల రిజర్వేషన్ కావాలని ముద్రగడ ఆందోళన నిర్వహించారు. నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం నుంచి జీవో 30 ని కూడా ఈ రిజర్వేషన్ల కోసం విడుదల చేయించి విజయం సాధించారు.
బీజేపీ టీడీపీలో :
ఇక ముద్రగడ తరువాత కాలంలో బీజేపీలో చేరారు, అక్కడ నుంచి టీడీపీలో చేరి 1999లో కాకినాడ ఎంపీగా పనిచేశారు. 2009 నాటికి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. 2009 ఎన్నికల్లో ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత దాదాపు పదేళ్ళకు పైగా మళ్ళీ కాపు ఉద్యమంలో నిమగ్నం అయిన ముద్రగడ 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు తరువాత కాపులకు రిజర్వేషన్లు కోరుతూ 2016లో భారీ ఉద్యమాన్ని నిర్వహించారు. అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు, తుని దగ్గర ఏకంగా రైలు దహనం కావడంతో జాతీయ స్థాయిలోనూ ప్రకంపనలు రేపింది. ఇక ముద్రగడపైన రైల్వే శాఖ కేసులు కూడా పెట్టింది.
కాపు ఉద్యమానికి స్వస్తి అంటూ :
ఇక 2019లో ఏపీలో మారిన రాజకీయ నేపథ్యంలో వైసీపీ గెలిచింది. ఇదే సమయంలో ముద్రగడ తాను కాపు ఉద్యమానికి స్వస్తి పలుకుతున్నట్లుగా సంచలన ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ మేరకు ఉద్యమానికి స్వస్తి పలుకుతూ ముద్రగడ పద్మనాభం 2020 జూలై 13న కాపు సామాజిక వర్గానికి ఒక బహిరంగ లేఖ రాశారు. కాపులకు బీసీ హోదా సాధించేందుకు తాను చేపట్టిన కార్యాచరణపై తోటి కాపులే సోషల్ మీడియా టీవీ ఛానళ్లలో విమర్శలు గుప్పించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసింది, దాంతో తాను ఈ ఉద్యమం నుండి తప్పుకోవాల్సి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.
అనూహ్యంగా వైసీపీలోకి :
ఇక ముద్రగడ అనూహ్యంగా వైసీపీలో చేరడమూ రాజకీయ విశేషమే. ఆయన 2024 మార్చిలో వైసీపీలో చేరారు. 2024 ఎన్నికలకు ముందు పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు చివర రెడ్డిని కలుపుకుంటానని ఆయన సవాలు విసిరారు. పవన్ కళ్యాణ్ ఆ స్థానంలో విజయం సాధించడంతో పద్మనాభం 2024 జూన్ 20న తన పేరును పద్మనాభరెడ్డి గా మార్చుకున్నారు. ఇలా ముద్రగడ రాజకీయ జీవితంలో ఎన్నో పార్టీలు ఎన్నో మలుపులు ఉన్నాయి. అయితే ఇంతటి సుదీర్ఘమైన ఆయన రాజకీయ జీవితంలో ఆయన ఎక్కడా రాజీ పడలేదు, తన వ్యక్తిత్వానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఏకంగా పార్టీని విడిచిపెట్టి బయటకు వచ్చేసేవారు. ఉన్న పార్టీ మీదనే తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం చేయడం ముద్రగడ ప్రత్యేకత. ఇక ముద్రగడ మరణంతో కాకినాడ జిల్లాలోని ఆయన స్వగ్రామమైన కిర్లంపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు నివాళి అర్పించేందుకు కాపు నాయకులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు అంతా కిర్లంపూడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.