జయలలిత ఇంట్లోకి విజయ్ మకాం ?

నిజానికి దళపతి విజయ్ కి తమిళనాడులో నివాసాలు ఉన్నాయి. ఆయన కోలీవుడ్ టాప్ స్టార్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు.

Update: 2026-07-14 22:30 GMT

తమిళనాడు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ప్రమాణం చేసి పదిహేనేళ్ళకు పైగా ఏలిన మహిళా నేత, తిరుగులేని నాయకురాలు అయిన జయలలిత నివాసం అంటే రాజసం కలిగినది అని అంతా చెప్పుకుంటారు. జయలలిత పోయేస్ గార్డెన్ అంటే అధికార వైభోగం అని ఆ రోజులలో చెప్పుకునే వారు. దానికి ఉన్న రాచకళ గురించి ఎంతగానో వర్ణించేవారు. పోయెస్ గార్డెన్ చెన్నైలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా కూడా ఉంది. జయలలిత శక్తివంతమైన నాయకురాలిగా అక్కడ నుంచే తమిళనాడుని ఏలారు. ఆమె కనుసైగతో జాతీయ రాజకీయాలను సైతం శాసించారు. జయలలిత తమిళ రాజకీయాల్లో ఒక శకం. ఆమె ఒక చరిత్ర. ఆమె ఉన్న ప్రాంతం ఆమె నివసించిన భవనం అన్నీ కూడా ఎంతో గొప్పగా ఈ రోజుకీ చెబుతూ ఉంటారు. అలాంటి జయలలిత నివాసంలో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మకాం మారుస్తున్నారు అని వస్తున్న ప్రచారం అయితే ఎంతగానో ఆసక్తిని పెంచుతోంది.

ట్రాఫిక్ సమస్యలతోనేనట :

నిజానికి దళపతి విజయ్ కి తమిళనాడులో నివాసాలు ఉన్నాయి. ఆయన కోలీవుడ్ టాప్ స్టార్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు ఈస్ట్ కోస్ట్ రోడ్డులో బ్రహ్మాండమైన నివాసం ఉంది. తన నీలాంకరి నివాసం నుంచి రాజాజీ రోడ్డులోని సెక్రటేరియట్‌కు విజయ్ ప్రతీ రోజూ కారులో వచ్చి వెళ్తున్నారు. అంతే కాదు ఆయన సచివాలయానికి ప్రతీ రోజూ ఠంచనుగా వస్తున్నారు. ఒక ఉద్యోగి ఎలా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు వరకూ సచివాలయంలోనే ఉంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా విజయ ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ఇంటికి సచివాలయానికి ఏకంగా 18 కిలోమీటర్లకు పైగా దూరం ఉంది. దాంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ప్రతీ రోజూ ఇది సగటు ప్రజలకు కూడా ఇబ్బందిగా మారుతోంది. సీఎం వచ్చీ పోయే సమయంలో ఈ ప్రాంతమంతా ట్రాఫిక్ ఆంక్షలు అధికంగా ఉంటున్నాయి. ఉదయం పది గంటలు సాయంత్రం ఆరు గంటలు అంటే కీలక సమయంలో పాఠశాలలు ఆఫీసులకు వెళ్ళేవారితో రద్దీగా ఉంటుంది. ట్రాఫిక్ ఆంక్షల వల్ల ప్రజలు ఇబ్బందులను గమనించిన విజయ్ సచివాలయానికి దగ్గరలో తన నివాసం ఉండాలని కోరుకుంటున్నారు అని అంటున్నారు.

విజయ్ కి ఎందుకు మక్కువ :

ఈ నేపథ్యంలో విజయ్ సచివాలయానికి సమీపంలో ఉన్న మాజీ సీఎం దివంగత నేత అయిన జయలలిత వేద నిలయం మీద ఫోకస్ పెట్టారని ప్రచారం సాగుతోంది. పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం ప్రస్తుతం జయలలిత మేనకోడలు దీప ఆధీనంలో ఉంది. ఈ వేద నిలయాన్ని ముఖ్యమంత్రి విజయ్ కొనుగోలు చేయలని అనుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది. అయితే దీని ధర కూడా చాలా షాకింగ్ గా ఉంది. 350 కోట్ల దాకా ఉందని చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తం వెచ్చింది విజయ్ ఈ నివాసాన్ని కొంటారని కూడా అంటున్నారు. ఇదే కనుక జరిగితే సచివాలయానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే విజయ్ నివాసం ఉన్నట్లు అవుతుంది అని అంటున్నారు.

ప్రముఖులు అంతా అక్కడే :

ఇదిలా ఉంటే పోయెస్ గార్డెన్ అంటే చెన్నైలో చాలా ఫ్యామస్ గా చెబుతారు. ప్రముఖులు అంతా అక్కడే ఉంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అక్కడే నివాసం ఉంటుంది. అంతే కాదు అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తౌ కూడా పోయెస్ గార్డెన్ లోనే ఉంటున్నారు. దాంతో సీఎం గా బాధ్యతలు చేపట్టిన విజయ్ కూడా అక్కడికి వస్తే ఆ సందడే వేరు అని అంటున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వస్తే పూర్వం జయలలిత హయాంలో వచ్చిన రాజకీయ కళ మళ్ళీ పదేళ్ళ తరువాత వస్తుందని అంటున్నారు. జయలలిత నాలుగవ సారి సీఎం గా ఉంటూ 2016 డిసెంబర్ లో మరణించిన సంగతి తెలిసిందే.

రజనీకి పొరుగునే విజయ్ :

ఇక విజయ్ కనుక పోయేస్ గార్డెన్ కి మకాం మారిస్తే రజనీకాంత్ కి పొరుగింటి వారు అవుతారు అని అంటున్నారు. రజనీ నివాసం పక్కనే వేద నిలయం ఉంటుంది. గతంలో జయలలిత తన అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నపుడు అక్కడికి వచ్చే వారితో ఫుల్ టైట్ గా సెక్యూరిటీ ఉండేది. ఒకానొక సమయంలో రజనీ కారుని కూడా తన నివాసానికి పోనీయకుండా జయలలిత సెక్యూరిటీ అడ్డుకున్నారు, అది పెద్ద దుమారం అయిది. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇపుడు ముఖ్యమంత్రి విజయ్ అదే వేద నిలయం భవనాన్ని కొనుగోలు చేసి ముఖ్యమంత్రిగా తన విధులను నిర్వహిస్తే మళ్ళీ అదే సెక్యూరిటీ అదే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇదిలా ఉంటే పోయెస్ గార్డెన్ కి విజయ్ మకాం మార్చడం అన్నది ఎక్కడా అధికారిక సమాచారంగా అయితే లేదు. ఇదంత ప్రచారంగానే సాగుతోంది. పలు రకాలుగా దీని మీద గాసిప్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది నిజం అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News