ఈఎంఐల 'బంధనం' వద్దు... ఇన్వెస్ట్‌మెంట్ 'స్వేచ్ఛే' ముద్దు.. మారిన కుర్రాళ్ల ట్రెండ్
25 నుంచి 34 ఏళ్ల వయసున్న యువతలో ఏకంగా 53 శాతం మంది సొంత ఇల్లు కొనే కన్నా... హాయిగా అద్దె ఇంట్లో ఉండటమే 'సుఖం' అని తేల్చేశారు.
ఒకప్పుడు మన పెద్దోళ్ల లైఫ్ గోల్స్ చాలా సింపుల్‌గా ఉండేవి. ఉద్యోగం రావడం ఆలస్యం... "నాయనా! తలదాచుకోవడానికి ఒక సొంత గూడుండాలి" అంటూ పెళ్లి కంటే ముందే హోమ్ లోన్ అప్లికేషన్ చేతిలో పెట్టేవారు. కానీ ఇప్పటి తరం మిలీనియల్స్, జెన్-జీ ఆలోచనలు రూట్ మార్చాయి. "30 ఏళ్ల పాటు బ్యాంకుకు బానిసగా బతికే బదులు... హాయిగా అద్దె ఇంట్లో ఉంటూ ఆ డబ్బును మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ బాసూ!" అంటున్నారు మన నయా జనరేషన్ కుర్రాళ్లు.
తాజాగా 'నో బ్రోకర్' చేసిన సర్వే చూస్తే తాతలు, తండ్రుల గుండెలు గుభేల్మనడం ఖాయం. 25 నుంచి 34 ఏళ్ల వయసున్న యువతలో ఏకంగా 53 శాతం మంది సొంత ఇల్లు కొనే కన్నా... హాయిగా అద్దె ఇంట్లో ఉండటమే 'సుఖం' అని తేల్చేశారు.
ఆ ముప్పై ఏళ్ల 'చిరునవ్వుల శిక్ష' మాకొద్దు బాబోయ్!
మెట్రో నగరాల్లో ఒక డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనాలంటే రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? ఆకాశాన్ని తాకుతున్న ధరలు చూస్తే గుండె ఆగినంత పని అవుతుంది. దానికి తోడు బ్యాంకోడు ఇచ్చే 20 లేదా 30 ఏళ్ల హోమ్ లోన్ ఈఎంఐల భారం. పెళ్లైనా పెటాకులైనా 30 ఏళ్లు కలిసి ఉంటామో లేదో కానీ... ఈ హోమ్ లోన్ ఈఎంఐ మాత్రం ముసలితనం వచ్చేవరకూ మనల్ని వదలదు. రేపు పొద్దున బాస్ నచ్చక ఉద్యోగం మానేయాలన్నా విదేశాలకి చెక్కేయాలన్నా లేదా ఏదైనా క్రేజీ స్టార్టప్ పెట్టాలన్నా... వెనుక ఈఎంఐ భూతం భయపెడుతూ ఉంటుంది. అందుకే "నో లోన్స్... ఓన్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్" అని కాలర్ ఎగరేస్తున్నారు కుర్రాళ్లు.
మ్యూచువల్ ఫండ్స్ ముద్దు... ఇటుకల గోడలు వద్దు
"నెలకు రూ. 50,000 ఈఎంఐ కట్టి సిమెంట్ గోడల మధ్య నలిగిపోయే కంటే... నెలకు రూ. 15,000 అద్దె కట్టి, మిగిలిన రూ. 35,000 సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలు, ఇండెక్స్ ఫండ్స్‌లో వేస్తే లైఫ్ జాలీగా ఉంటుంది" అనేది నేటి యువత లాజిక్.
కుర్రాళ్ల కొత్త ఫార్ములా
ముందు సంపదను సృష్టించుకోవాలి... ఆ తర్వాతే సొంత ఇల్లు అనే లగ్జరీ గురించి ఆలోచించాలి.. రియల్ ఎస్టేట్ లాగా అమ్ముదామంటే అమ్ముడుపోని ఆస్తుల కంటే... అవసరమైనప్పుడు క్షణాల్లో క్యాష్ చేసుకోగలిగే లిక్విడ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కే యువత జై కొడుతోంది. పైగా ఉద్యోగం మారినప్పుడల్లా లగేజీ సర్దుకుని నచ్చిన ఏరియాకి షిఫ్ట్ అయిపోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజులు, బ్రోకరేజ్ గొడవలు అసలే ఉండవు.
ఇల్లు కొనరా? అంటే...
దీనర్థం యువత అసలు ఇల్లే కొనకూడదని ఫిక్స్ అయ్యారని కాదు. కాకపోతే జీవితంలో సెటిల్ అయి, చేతిలో తగినంత సొమ్ము డౌన్ పేమెంట్ ఉండి, జీతంపై ఎలాంటి ఒత్తిడి పడదు అనుకున్నప్పుడే సొంత ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారు.
ఏది ఏమైనా... "అద్దె ఇల్లు పరాయి ఇల్లు" అనే పాత సామెతను తుడిచేసి "అద్దె ఇల్లే మనల్ని కాపాడే కల్పవృక్షం... మిగిలిన పైసలే మనకు శ్రీరామరక్ష" అంటూ సరికొత్త ఆర్థిక విప్లవానికి కుర్రాళ్లు తెరతీశారు.