భయపెడుతోన్న రైళ్లో కొత్త దొంగతనాలు... ఎలా చేస్తున్నారంటే..?

రైళ్లో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీల పక్కన కూర్చున్న వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తుంటారు.;

Update: 2025-06-29 07:18 GMT

రైళ్లో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీల పక్కన కూర్చున్న వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తుంటారు. ట్రైన్ కదలడం మొదలవ్వగానే.. మెడలోని చైన్స్ కిటికీలోంచి లాక్కుని, చేతిలోని సెల్ ఫోన్స్ తీసుకుని పారిపోతుంటారు. ఇలా రకరకాల టెన్షన్స్ రైళ్లో ప్రయాణించే సమయంలో ఉంటాయని చెబుతారు! ఈ సమయంలో తాజాగా కొత్తరకం దొంగతనం అధికారులను టెన్షన్ పెడుతోంది.

అవును... కిటికీ దగ్గర కూర్చుని అప్రమత్తంగా లేనివారి మెడలోని గొలుసులు లాక్కుని పోవడం, సెల్ ఫోన్లు ఎత్తుకుపోవడం వంటి దొంగతనాలతో పాటు తాజాగా రైలు ప్రయాణికులను దోచుకోవడానికి కొందరు దొంగలు ఏకంగా రైల్వే సిగ్నళ్లను ట్యాంపరింగ్‌ చేస్తున్నారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో.. రైల్వే ఉన్నతాధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు!

ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటి వరకు ఒంగోలు, రేణిగుంట సమీపంలోని ముంగిలిపట్టు.. తెలంగాణలోని అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల రైల్వేస్టేషన్ల పరిధిలో ఇలా... రైళ్లను సిగ్నళ్లు ఉన్నచోట ఆపేలా చేసి మరీ దొంగతనం చేసిన ఘటనలు జరిగినట్లు రైల్వే పోలీసుల రికార్డుల్లో నమోదైందని తెలుస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.

ఇందులో భాగంగా.. తాడిపత్రి మండలంలోని కోమలి అనే ప్రాంతంలో సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసిన దుండగులు.. చెంగల్పట్టు ఎక్స్‌ ప్రెస్‌ రైలు ఆగేలా చేశారు. ఈ సమయంలో.. ఓ మహిళ మెడలోని 2.7 తులాల బంగారు ఆభరణాలను అపహరించి పారిపోయారు. దీంతో... ఈ తరహా కొత్త రకం దొంగతనాలు ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు.

ఈ సందర్భంగా... మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారు ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది. పార్థీ గ్యాంగ్, శోలాపుర్‌ గ్యాంగ్, మీర్జాపూర్‌ గ్యాంగ్‌ లతోపాటు జామ్‌ కేడ్, బీడ్‌ తదితర ప్రాంతాలకు చెందిన నేరస్థులు సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసి దొంగతనాలు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారని అంటున్నారు.

ఇదే సమయంలో... శనివారం తెల్లవారుజామున న్యూ పిడుగురాళ్ల రైల్వేస్టేషన్‌ సమీపంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. ఆ ప్రాంతంలో సిగ్నల్‌ వ్యవస్థను దుండగులు ట్యాంపరింగ్‌ చేయడంతో సిగ్నల్‌ నిలిచిపోయింది. దీంతో ఆ సమయంలో విశాఖనుంచి చర్లపల్లి వెళుతున్న స్పెషల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు లోకోపైలట్‌ రైలును ఆపేశారు.

వెంటనే దుండగులు రెండు బోగీల్లోకి వెళ్లి ఇద్దరు మహిళల మెడల్లోని బంగారం గొలుసులు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనతో తెల్లవారుజామున 4:12 నుంచి 5:30 గంటల వరకు రైలు నిలిచిపోయిన పరిస్థితి. ఈ ఘటనలో ఒక మహిళ మెడలో 20 గ్రాముల గొలుసు, మరో మహిళకు చెందిన 30 గ్రాముల గొలుసు చోరీ అయినట్లు చెబుతున్నారు.

ఈ సమయంలో... రైల్వే సిగ్నళ్లను ట్యాంపరింగ్‌ చేయడానికి దొంగలు రకరకాల పద్దతులను ఉపయోగిస్తున్నారని అంటున్నారు. ఇందులో ప్రధానంగా.. స్టేషన్లకు సమీపంలోని సిగ్నళ్లను ట్యాంపర్‌ చేయడానికి వీలుగా జంక్షన్‌ బాక్స్‌ లో షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యేలా చేస్తున్నారు. మరికొంతమంది... రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థ సర్క్యూట్‌ బోర్డును పగలగొట్టి సిగ్నళ్లు పడకుండా చేస్తున్నారు.

మరికొంతమంది సిగ్నల్‌ వ్యవస్థ వైర్లను కత్తిరించి సిగ్నల్‌ పడకుండా చేసి రైలును ఆపే పరిస్థితులు సృష్టిస్తుండగా... సిగ్నల్స్‌ కనపడకుండా ఉండేలా లైటు ఉండే భాగానికి ఒక వస్త్రాన్ని చుట్టేస్తున్నవారు మరికొంతమంది అని చెబుతున్నారు. ఇందులో ఏది చేసినా.. ట్రైన్ ఆపడమే వారికి ముఖ్యం!!

Tags:    

Similar News