ఇంటర్నెట్ వాడకంలో ఏపీ వెనుకబడిందా.. తెరపైకి షాకింగ్ లెక్కలు!
ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో దేశ రాజధాని ఢిల్లీ ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ సౌకర్యం లేని గృహాల వాటా కేవలం 2.6% మాత్రమే.;
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), 5జీ నెట్ వర్క్ తో పాటు ఎటు చూసినా డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు సాగుతున్న పరిస్థితి. అయినప్పటికీ దేశంలోని జనాభా మధ్య డిజిటల్ అంతరం కొనసాగుతోందని.. దేశంలోని ఏడు ఇళ్లల్లో ఒకటి ఆఫ్ లైన్ లో ఉందని.. ఈ క్రమంలో 13.7% గృహాలు ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయాన్ని కలిగి లేవని రాజ్యసభలో వచ్చిన సమాధానం చెబుతోంది. ఈ జాబితాలో ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక టాప్ లో ఉండగా.. ఏపీ, తమిళనాడు, త్రిపుర వెనుకబడి ఉంటటం గమనార్హం!
అవును... దేశంలోని డిజిటల్ ప్రోత్సాహం ఆన్ లైన్ సర్వీసులు, డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ గవర్నెన్స్, ఏఐ, 5జీ లతో ముందుకు సాగుతున్నప్పటికీ.. ఇంటర్నెట్ యాక్సెస్ మాత్రం అసమానంగానే ఉంది. తాజాగా రాజ్యసభలో పంచుకోబడిన డేటా ప్రకారం... దేశంలోని 13.7 శాతం కుటుంబాలకు ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఈ క్రమంలో.. గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నెట్ కవరేజ్ మెరుగుపడినప్పటికీ.. డిజిటల్ చేరిక పూర్తిస్థాయిలో లేదు. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య అంతరం స్పష్టంగా ఉంది!
ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో దేశ రాజధాని ఢిల్లీ ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ సౌకర్యం లేని గృహాల వాటా కేవలం 2.6% మాత్రమే. అధిక పట్టణీకరణతోపాటు బలమైన మౌలిక సదుపాయాలు, విస్తృత మొబైల్ బ్రాడ్ బ్యాండ్ కవరేజ్ ఈ సార్వత్రిక కనెక్టివిటీకి కారణంగా చెబుతున్నారు. ఆ తర్వాత కేరళలో 8.3% గృహాలకు మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం లేకపోగా.. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర 10.4%, కర్ణాటక 10.9%, బీహార్ 11.7%, రాజస్థాన్ 13.2% ఆఫ్ లైన్ గృహాలతో ఉన్నాయి.
అయితే దీనికి పూర్తి విరుద్ధంగా అత్యధిక ఆఫ్ లైన్ గృహాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 22.3 శాతంతో టాప్ ప్లేస్ లో ఉండటం గమనార్హం. చంద్రబాబు సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది! ఈ క్రమంలో ఏపీ తర్వాత ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ 22.2%, ఒడిశా 22%, తమిళనాడు 21.1%, త్రిపుర 18.8% ఆఫ్ లైన్ గృహాల జాబితాలో ఉన్నాయి. ఇదే క్రమంలో... పుదుచ్చేరి 18.1%, వెస్ట్ బెంగాల్ 16%, మధ్యప్రదేశ్ 15.4%, ఛత్తీస్ గర్ 15.4%, యూపీ 13.9% రాష్ట్రాలు జాతీయ సగటు 13.7% కంటే ఎక్కువ నివాసాల్లో ఇంటర్ నెట్ సదుపాయం లేని రాష్ట్రాలుగా నిలిచాయి!
కాగా.. కేంద్ర ప్రభుత్వం ప్రకారం... ఇంట్లో ఎవరైనా సభ్యుడు మొబైల్ నెట్ వర్క్ ఇంటర్నెట్ డేటాను ఉపయోగిస్తున్నా.. ఆ కుటుంబానికి ఇంటి ఆవరణలో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు పరిగణించబడుతుంది!