తూర్పులో పులిని పట్టుకోవడానికి ఇదే సూపర్ ఛాన్స్... వీడియో వైరల్!
ఇందులో భాగంగా... రాజమండ్రి, రాజానగరం పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ, వివిధ ప్రాంతాల్లో పశువులను చంపేస్తుంది. దీంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.;
ఆరు రోజులుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రాజమండ్రి, రాజానగరం పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ, వివిధ ప్రాంతాల్లో పశువులను చంపేస్తుంది. దీంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఈ సమయంలో తాజాగా కూర్మాపురంలోని పాడుబడిన ఇంట్లో నుంచి పంట పొలాల్లోంచి పరుగులు పెడుతూ కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
అవును... రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రాజానగరం మండలం భూపాలపట్నం పరిధిలోనూ, జి.యర్రంపాలెం పరిధిలోనూ సంచరించిన పెద్దపులి... గురువారం రాత్రికి జి.యర్రంపాలెం, కేశవరం మధ్యలో సంచరించింది. ఈ క్రమంలో... శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రాయవరం మండలం కూర్మాపురంలో కనిపించింది. అనంతరం పంటపొలాల్లోకి పరుగులు తీసింది.
వాస్తవానికి శుక్రవారం ఉదయం కూర్మాపురంలో పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపిస్తున్నట్లు స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించడంతో.. అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో.. పులిని బంధించేందుకు పూణే నుంచి వచ్చిన నిపుణులు, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా.. దానికి గన్ ద్వారా మత్తు ఇంజక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే.. ఆ సమయంలో పులి అక్కడ నుంచి సమీపంలోని పొలాల్లోకి వెళ్లిపోయింది.
ఈ సమయంలో... కూర్మాపురంలోని పశువుల పాకలో దూడను చంపిన పులి, అక్కడే నక్కినట్లు చెబుతున్నారు. దీంతో... పోలీసులు, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి, ఆ పశువుల పాక చుట్టూ వలలు వేసి అప్రమత్తంగా ఉన్నారు. సాయంత్రం అవుతున్న నేపథ్యంలో.. ఏ సమయంలో అయినా పులి బయటకు వచ్చే అవకాశం ఉన్నందున.. మత్తు మందు ఇచ్చి పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ సమయంలో పులి మిస్ అయితే.. అది కోనసీమ వైపు పూర్తిగా వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాగా... గత నెలలో ఏలూరులోని బుట్టాయగూడెం మండలంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఈ పులి తెలంగాణ రాష్ట్రంలోని కావడిగుండ్ల, జీలుగు మిల్లి ప్రాంతం నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లాల్సింది పోయి, దారి తప్పి రాజమండ్రి, రాజనగరం ప్రాంతాల్లో సంచరిస్తూ.. సుమారు ఆరు రోజులుగా అక్కడే ఊరూరా తిరుగుతూ, రాత్రి సమయాల్లో పశువులను చంపి తింటున్న సంగతి తెలిసిందే.