కొత్త సీఎం కోసం పాత సీఎం.. దక్షిణాది రాజకీయాల్లో ప్రత్యేకం!

కానీ, కేరళలో 'కమ్యూనిస్టు వర్సెస్ కాంగ్రెస్' పోరు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, వ్యవస్థల పట్ల గౌరవం తగ్గదని తాజా ఘటన నిరూపించిందని వ్యాఖ్యానిస్తున్నారు.

Update: 2026-05-18 08:18 GMT

రాజకీయ వైరుధ్యాలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ.. ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలకు కేరళ రాజకీయాల్లో ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో తాజాగా వెల్లడైంది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా వీడీ సతీషన్ ప్రమాణస్వీకారానికి మాజీ సీఎం విజయన్ హాజరుకావడం రాజకీయ వర్గాలను ఆకర్షించింది. పదేళ్లపాటు ఉప్పు-నిప్పులా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికపై కనిపించి అందరికీ కనువిందు చేశారని అభినందనలు అందుకుంటున్నారు. పదేళ్ల అప్రతిహత పాలనకు బ్రేక్ వేసిన ప్రత్యర్థి ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా హాజరై, సతీషన్‌ను అభినందించడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.

పదేళ్ల సుదీర్ఘ ఎల్డీఎఫ్ పాలనకు చరమగీతం పాడుతూ, యూడీఎఫ్ కూటమిని భారీ మెజార్టీతో విజయతీరాలకు చేర్చిన కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీషన్ కేరళ 13వ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేతలు ఎంతోమంది హాజరైనప్పటికీ కమ్యూనిస్టు సీనియర్ నేత, తాజా మాజీ ముఖ్యమంత్రి విజయన్ హాజరుకావడమే అందరి దృష్టిని ఆకర్షించిందని అంటున్నారు. సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగినప్పుడు ఇలాంటి సంప్రదాయం పెద్దగా కనిపించదని అంటున్నారు. పాత, కొత్త ముఖ్యమంత్రుల మధ్య తీవ్రమైన వ్యక్తిగత, రాజకీయ శత్రుత్వం ఉండటంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అధికార మార్పిడి సమయంలో పాత ముఖ్యమంత్రులు ముఖం చాటేస్తుంటారని గతంలో జరిగిన సంఘటనలను నెటిజన్లు ఉదహరిస్తున్నారు.

కానీ, కేరళలో 'కమ్యూనిస్టు వర్సెస్ కాంగ్రెస్' పోరు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, వ్యవస్థల పట్ల గౌరవం తగ్గదని తాజా ఘటన నిరూపించిందని వ్యాఖ్యానిస్తున్నారు. మలయాళ మీడియా విశ్లేషణల ప్రకారం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ వేడుకకు రావడం కేవలం ఒక మర్యాదపూర్వక సందర్శన మాత్రమే కాదని, కేరళ శాసనసభలో బలమైన ప్రతిపక్ష నేతగా నూతన ప్రభుత్వానికి పంపిన ఒక స్పష్టమైన సంకేతంగా వ్యాఖ్యానిస్తున్నారు. జాతీయ మీడియా కూడా ఈ ఘట్టాన్ని కేరళ రాజకీయ పరిణతికి నిదర్శనంగా అభివర్ణించింది. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా 'ఇండియా' కూటమిలో కాంగ్రెస్, సీపీఎం భాగస్వాములుగా ఉన్నప్పటికీ, కేరళ రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి ఉప్పు-నిప్పులా తలపడుతుండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాయి.

కాగా, తాజా ఘటనతో రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం కలిసి పనిచేస్తామనే సందేశాన్ని ఇద్దరు నేతలు చాటిచెప్పారని అంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి జాతీయ నాయకులు ఉన్న వేదికపైకి పినరయి విజయన్ రావడం, వారిని పలకరించడం జాతీయ రాజకీయాల్లోనూ ఒక సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబించిందని చెబుతున్నారు. కాగా, గత ఐదేళ్లు పినరయి విజయన్ ప్రభుత్వ హయాంలో వీడీ సతీషన్ ప్రతిపక్ష నేత పనిచేశారు. ఆ సమయంలో అత్యంత దూకుడుగా వ్యవహరించారని అంటున్నారు. అసెంబ్లీ లోపలా, వెలుపలా విజయన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ, అవినీతి ఆరోపణలపై రాజీలేని పోరాటం చేశారు. ఆ దూకుడే నేడు సతీషన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టిందని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News