బండి భగీరథ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. అదే జరిగితే 10 ఏళ్ల జైలు!
బండి భగీరథ్.. ఈ పేరు కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలు.. సోషల్ మీడియా వర్గాల్లో సంచలనం రేపుతోంది. దీనిచుట్టూనే రాజకీయం నడుస్తోంది.
బండి భగీరథ్.. ఈ పేరు కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలు.. సోషల్ మీడియా వర్గాల్లో సంచలనం రేపుతోంది. దీనిచుట్టూనే రాజకీయం నడుస్తోంది. అధికార, ప్రతిపక్షాలు ఈ కేసును ఆసరాగా చేసుకొని విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. అందరినీ డిఫెన్స్ లో పడేసిన ఈ కేసులో బండి భగీరథ్ లొంగిపోవడంతో ఊహించని మలుపు తిరిగింది. అయితే భగీరథ్ కేసులో రోజుకో కొత్త మలుపు బయటపడుతోంది. ఇప్పటికే పలు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్ పై పోలీసులు తాజాగా మరొక కీలక సెక్షన్ ను జోడించడంతో ఈ కేసు మరింత జఠిలమైంది.
బాధితురాలి వాంగ్మూలం.. సేకరించిన ఆధారాల ఆధారంగా పోలీసులు భగీరథ్ పై బీఎన్ 64(2)(m) సెక్షన్ ను జత చేశారు. ఈ సెక్షన్ ప్రకారం ఒక మహిళపై పదే పదే లైంగిక దాడి లేదా అత్యాచారం చేసినట్లు నిరూపితమైతే అది అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ నేరం కోర్టులో రుజువైతే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష తప్పదని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో శిక్ష జీవిత ఖైదు వరకూ కూడా వెళ్లే అవకాశం ఉంటుందని న్యాయ వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పటికే భగీరథ్ పై పోలీసులు పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటిలో బీఎన్ఎస్ 74, బీఎన్ఎస్ 75, పోక్సో చట్టం వంటి తీవ్రమైన నేరాలు ఉన్నాయి. ముఖ్యంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం ఈ వ్యవహారానికి మరింత సున్నితత్వాన్ని తీసుకొచ్చింది. బాధితురాలు మైనర్ అయి ఉండే అవకాశాల కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సమాచారం.
పోలీసులు ఇప్పటికే బాధితురాలి స్టేట్ మెంట్ నమోదు చేశారు. ఫోన్ డేటా, చాట్ రికార్డులు, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే ఇంకొందరిని విచారించే అవకాశమూ ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ కేసు రాజకీయ రంగు దాల్చడంతో రాష్ట్రవ్యాప్తంగా కేసులో ఏం జరుగుతుందన్న ఆసక్తి పెరిగింది. సోషల్ మీడియాలో భగీరథ్ కు మద్దతుగా.. వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి.
పోలీసుల దర్యాప్తులో మరిన్ని ఆధారాలు బయటకు వస్తే కేసు బలపడే అవకాశం ఉంది. తాజాగా జోడించిన సెక్షన్ కనుక నిరూపితమైతే భగీరథ్ కు భారీ ఇబ్బందులు తప్పవని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కోర్టు ఈ విషయంలో ఎలాంటి తీర్పునిస్తుందనేది వేచిచూడాలి.