హైదరాబాద్ టు ముంబై జస్ట్ 3 గంటలే.. బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై బిగ్ అప్‌డేట్!

అంతేకాకుండా ఈ హైస్పీడ్ రైలు మార్గం ఇంజనీరింగ్ అద్భుతంగా ఉండనుందని అంటున్నారు.

Update: 2026-05-18 08:09 GMT

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. ‘ముంబై - హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్" (ఎంహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు డీపీఆర్ రెడీ చేసింది. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించే ఈ హైస్పీడ్ కారిడార్ కోసం చాలాకాలంగా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కేవలం 3 గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకునేలా రూపొందించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)లో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయని అంటున్నారు.

671 కిలోమీటర్ల పొడవైన కారిడార్

ముంబై - హైదరాబాద్ మధ్య ప్రయాణానికి ప్రస్తుతం దాదాపు 14 నుంచి 15 గంటల సమయం పడుతోంది. అయితే, ప్రతిపాదిత 671 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైలు కారిడార్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గరిష్టంగా మూడు గంటలకు తగ్గిపోతుందని అంటున్నారు. గంటకు 320 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లు దూసుకుపోనున్నాయి. దీనివల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 3 గంటలకు తగ్గిపోనుందని చెబుతున్నారు. ఈ కారిడార్‌కు సంబంధించిన డిజైన్లు, సాంకేతిక అధ్యయనాలను పూర్తి చేసి డీపీఆర్ సిద్ధం చేసినట్లు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది.

తెలంగాణలో మూడు స్టేషన్లు

ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ ప్రధానంగా మూడు రాష్ట్రాల మీదుగా సాగుతుంది. తెలంగాణలో మూడు హాల్టులు ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా సాగే ఈ హైస్పీడ్ కారిడార్ లో మొత్తం 12 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు కల్పించనున్నట్లు ప్రకటించారు. ఇక తెలంగాణలో తొలుత అనుకున్న స్టేషన్ల కంటే అదనంగా శంషాబాద్ లో కూడా స్టేషన్‌ను నిర్మించనున్నట్లు డీపీఆర్ లో తెలిపారు. ఇది తెలంగాణకు ముఖ్యంగా యావత్ తెలుగు ప్రజలకు ఊరటనిచ్చే అంశంగా పేర్కొంటున్నారు. ప్రతిపాదిత హైస్పీడ్ రైల్ స్టేషన్లలో ప్రధానమైనది కోకాపేటలో ఉంటుంది. అదేవిధంగా వికారాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద మరో రెండు స్టేషన్లు నిర్మించనున్నారు.

35 కిలోమీటర్ల భూగర్భ రైలు మార్గం

అంతేకాకుండా ఈ హైస్పీడ్ రైలు మార్గం ఇంజనీరింగ్ అద్భుతంగా ఉండనుందని అంటున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతాలు, పర్వత శ్రేణులు, పట్టణ జనాభా రద్దీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 35 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ మార్గాన్ని నిర్మించనున్నారు. ఇది ప్రాజెక్టులోనే అత్యంత సంక్లిష్టమైన అత్యాధునిక సాంకేతికతతో కూడిన నిర్మాణంగా నిలవనుందని చెబుతున్నారు. ఇక జపాన్ ఎయిర్‌లైన్స్ తరహా "షింకాన్సెన్" బుల్లెట్ రైలు సాంకేతికత ఆధారంగా ఈ రైళ్లను నడపనున్నారు. ఒకేసారి 1,215 మంది ప్రయాణించేలా 16 అత్యాధునిక బోగీలతో రైలు పరుగులు తీస్తుందని చెబుతున్నారు. రైలు లోపల బిజినెస్ క్లాస్, స్టాండర్డ్ క్లాస్ తో పాటు ఆటోమేటిక్ డోర్స్, వ్యాక్యూమ్ టాయిలెట్స్, రొటేటబుల్ సీట్లు వంటి విమాన శ్రేణి వసతులు ఉండనున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News