ముహూర్తాలు చూసి పార్టీ పెడుతారా కవితక్కా?

తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోందా? అంటే 'అవును' అనే సమాధానమే వినిపిస్తోంది.;

Update: 2026-02-06 12:30 GMT

తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోందా? అంటే 'అవును' అనే సమాధానమే వినిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన కవిత.. తన తదుపరి అడుగుపై క్లారిటీ ఇచ్చారు. "మంచి ముహూర్తం చూసి మూడు నెలల్లో కొత్త పార్టీని ప్రకటిస్తాను" అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇది కేవలం సెంటిమెంటేనా? లేక తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె వేసిన పక్కా వ్యూహమా?

సెంటిమెంట్ కాదు.. సమయం కోసం వ్యూహం!

కవిత మూడు నెలల సమయం కోరడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ముసలం పుట్టిందనేది బహిరంగ రహస్యం. ఈ మూడు నెలల కాలాన్ని ఆమె తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే ప్రక్రియను పూర్తి చేయడానికి... బీఆర్ఎస్‌లో వివక్షకు గురవుతున్న నేతలను తన గొడుగు కిందికి తెచ్చుకోవడానికి ఉపయోగించనున్నారని తెలుస్తోంది. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తా చాటడానికి అవసరమైన గ్రౌండ్ వర్క్ కోసం వాడుకుంటున్నారు.

సిరిసిల్ల కేంద్రంగా బీఆర్ఎస్‌లో చీలిక?

సిరిసిల్ల నుంచి 16 మంది బీఆర్ఎస్ నేతలు తనను కలవడం వెనుక పెద్ద రాజకీయ మర్మమే ఉంది. సిరిసిల్ల కేటీఆర్ ఇలాకా. అక్కడ నుంచే నేతలు కవిత వైపు చూస్తున్నారంటే గులాబీ బాస్ కోటలో బీటలు వారుతున్నాయనే సంకేతాలు అందుతున్నాయి. "బీఆర్ఎస్‌లో అసలైన ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది.. నన్ను కూడా అవమానించి గెంటేశారు" అని కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలోని ఒక వర్గాన్ని తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి.

కేటీఆర్, హరీశ్‌రావులపై బాణాలు

ఒకప్పుడు 'కృష్ణార్జునులు' అని పిలవబడే కేటీఆర్, హరీశ్‌రావులను కవిత నేరుగా టార్గెట్ చేయడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. జాగృతి పోటీ చేసే చోటే వారు ప్రచారం చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. మిగిలిన జిల్లాల్లో పార్టీ బాధ్యత ఎవరు తీసుకుంటారు? కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి పార్టీని కొందరు నాశనం చేస్తున్నారని ఆమె చేసిన ఆరోపణలు నేరుగా హరీశ్‌రావు, కేటీఆర్ వైపు మళ్లినట్లు కనిపిస్తున్నాయి.

'జాగృతి' పార్టీగా మారితే.. సమీకరణాలు ఎలా ఉంటాయి?

మహిళలు, యువత, సెక్యులర్ ఓటు బ్యాంకు లక్ష్యంగా కవిత తన కొత్త పార్టీని నడిపించే అవకాశం ఉంది. "రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తి అవసరం" అని ఆమె చెబుతుండడం ద్వారా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు.

మొత్తానికి కవిత ముహూర్తాలు చూసి పెట్టినా.. చూడకున్నా పెట్టినా.. కవిత ఆలోచన ఏదైనా సరే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల అంత పెద్ద పార్టీగా అవతరించడం కష్టం.. ఏవో కొన్ని జిల్లాల వరకూ ప్రభావం ఉండొచ్చు. ముహూర్తాల మీద కాలం గడిపేకంటే పార్టీ బలోపేతం కోసమే కవిత ఈ టైం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి నేతలను లాగడానికే ప్రయత్నాలు చేస్తోంది. కవిత మూహూర్తం చూడడం వెనుక కారణం అదే.. ముహూర్తానికి 'మూడు నెలల' గడువు అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక "ట్రైలర్" మాత్రమే. ఆమె ప్రకటించబోయే కొత్త పార్టీ పేరు, గుర్తు కంటే.. ఆమెతో పాటు బీఆర్ఎస్ నుంచి ఎంతమంది నేతలు బయటకు వస్తారనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

Tags:    

Similar News