జనసేన శ్రీధర్ వ్యవహారం సాగదీత.. వైసీపీకి ఆయుధం... !
అరవ శ్రీధర్ తనకు ఐదుసార్లు అబార్షన్ చేయించారని.. ఆయన తనను మోసం చేశారని బాదిత మహిళ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ కేసును ఆమె హైకోర్టు వరకు తీసుకువెళ్లారు.;
జనసేన పార్టీ నాయకుడు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణల వ్యవహారం సాగదీత ధోరణిలో సాగుతోంది. ఈ కేసు వ్యవహారాన్ని తేల్చేస్తామని జనసేన ప్రకటిస్తున్నా.. అసలు ఎక్కడా అడుగులు ముందుకు పడడం లేదు. అరవ శ్రీధర్ తనకు ఐదుసార్లు అబార్షన్ చేయించారని.. ఆయన తనను మోసం చేశారని బాదిత మహిళ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ కేసును ఆమె హైకోర్టు వరకు తీసుకువెళ్లారు.
మరోవైపు జనసేన నాయకులు ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట శ్రీధర్‌ను విచారణ కమిటీ ముందుకు పిలిచారు. అయితే.. ఆయన తనను హానీ ట్రాప్(వలపు వల) చేశారని.. ఇది పూర్తిగా రాజకీయ ప్రత్యర్థుల కుట్రేనని చెప్పుకొచ్చారు. మరి వాస్తవానికి ఇది నిజమైతే.. ఆయన ఎందుకు సెల్ఫీ వీడియోలు చేశారన్నది తేలాల్సి ఉంది. మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
ఈ పరిణామాల క్రమంలో అరవ శ్రీధర్ వ్యవహారం ఎప్పటికి తేలుతుంది? అనేది చూడాలి. కానీ, దీనిని వైసీపీ తనకు ఆయుధంగా మార్చుకునేందుకు రెడీ అవుతోంది. జనసేన నాయకులు గతంలో ఏం మాట్లా డారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారన్న కోణంలో ప్రజల మద్యకు వెళ్లాలని వైసీపీ నాయకులకు జగన్ ముఖత సూచనలు చేశారు. త్వరలోనే దీనిపై పెద్ద ఎత్తున క్యాంపెయిన్‌లు కూడా చేయనున్నారు. గతంలో వైసీపీ హయాంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని.. జనసేన నాయకులు విరుచుకుపడ్డారు.
ఇప్పుడు గత విషయాలను తవ్వి.. జనసేనను ఇరుకున పెట్టాలన్నది వైసీపీ వ్యూహం. అయితే.. ఈ సమయంలో వైసీపీ హయాంలో జరిగిన వాటిని జనసేన కూడా బయటకు తీసే అవకాశం ఉంది. ఇదొక రాజకీయ ఎత్తుగడగా ఇరు పార్టీల మధ్య దుమారం రేపనుంది. మొత్తంగా చూస్తే.. అరవ శ్రీధర్ వ్యవహారాన్ని ఎంత వరకు సాగదీస్తే.. అంత వరకు ఇది రాజకీయ వ్యవహారంగా మంటలు రేపుతూనే ఉంటుందని అంటున్నారు పరివీలకులు.