అరెస్టులు.. జైళ్లు.. రాజకీయ కౌగిలిలో ఉన్నతాధికారులు..!
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు.. జైళ్ల వ్యవహారం.. దేశంలో ఎక్కడా లేదని జాతీయ మీడియా చెబుతోంది.;
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు.. జైళ్ల వ్యవహారం.. దేశంలో ఎక్కడా లేదని జాతీయ మీడియా చెబుతోంది. ఒక ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా బాధ్యతలు నిర్వర్తించిన వారిని తర్వాత వచ్చే ప్రభుత్వాలు ప్రాసిక్యూషన్ చేయడం అనే సంస్కృతి గతంలో ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. ఇతర రాష్ట్రా ల్లోనూ అనేక అవినీతి.. అక్రమాలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ.. ఎప్పుడూ.. వరుస పెట్టి ఉన్నతాధికారులను అరెస్టు చేసిన పరిస్థితి లేదు.
కానీ, తొలిసారి.. ఏపీలో వైసీపీ హయాంలో ఉన్నతాధికారులపై రాజకీయ మరకలు అంటించి.. వారిని రాజకీయంగా వేదింపులకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ జాబితాలోనే మాజీ ఐపీఎస్ ఏబీవీ, మాజీ ఐఏఎస్ బాలసుబ్రమణ్యం.. వంటి వారు ఉన్నారు. వీరిని ఎంతగా వేదించారన్న విషయం అందరికీ తెలిసిందే. దీనివల్ల వైసీపీ ప్రభుత్వానికి మరకలు.. అప్పటి సీఎం జగన్‌పై మచ్చలు పడ్డాయి. ఇవి ఇప్పట్లో తొలిగిపోయేలా కనిపించడం లేదు.
ఇది రాజకీయంగా వైసీపీని బద్నాం చేయడంతో పాటు.. ఉన్నతాధికారులు ఏకం అయ్యేందుకు మార్గాన్ని సుగమం చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ.. ఉన్నతాధికారులను టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ హయాంలో తప్పులు చేశారంటూ.. ప్రస్తుతం ఐపీఎస్ అధికారులను అరెస్టు చేయడంతో పాటు.. జైళ్లకు కూడా పంపించారు. ఇంకా పంపాల్సిన వారు చాలా మందే ఉన్నట్టు చెబుతున్నారు. అయితే.. ఇది కూడా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందే కావొచ్చని అంటున్నారు పరిశీలకులు.
నేరుగా కూటమిని ప్రశ్నించలేకపోవచ్చు.. కానీ.. పనితీరు విషయంలో అధికారులు నిక్కచ్చిగా ఉండే అవకాశం ఉంది. ఇది మంచిదే అయినా.. కొన్ని కొన్ని సందర్భాల్లో పట్టువిడుపులు చాలా అవసరం. అలా ఉంటేనే ప్రభుత్వం పని చేయగలుగుతుంది. ఈ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. ఇబ్బందులు రావడం సహజం. గతంలో చంద్రబాబు పాలనను గమనిస్తే.. ఉన్నతాధికారులు సహకరించని విషయం తెలిసిందే. జన్మభూమి కార్యక్రమం అనుకున్న రేంజ్‌లో అబివృద్ధి కాకపోవడానికి రీజన్ ఇదేనని చెబుతారు. కాబట్టి.. ప్రభుత్వం ఏదైనా.. ఉన్నతాధికారుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తేనే మంచిదని సూచిస్తున్నారు.