కొడుకు క్యాబినెట్ మినిస్టర్.. అమ్మ వంటమనిషి, నాన్న గుడిలో పూజారి!

తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ తీసుకువచ్చిన మార్పు విస్తృత చర్చకు దారితీస్తోంది.

Update: 2026-05-26 07:29 GMT

తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ తీసుకువచ్చిన మార్పు విస్తృత చర్చకు దారితీస్తోంది. తన కేబినెట్ లో సామాన్యులకు స్థానం కల్పించిన దళపతి విజయ్ సరికొత్త చరిత్రకు బీజం వేశారని ప్రశంసలు అందుకుంటున్నారు. తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన విజయ్, కేవలం తాను గెలవడమే కాకుండా, తనతో పాటు ఎంతోమంది సామాన్య, యువ నాయకులను అసెంబ్లీకి తీసుకెళ్లారు. అలా విజయ్ నమ్మిన బంటుగా, ఒకప్పుడు ఆయన వీరాభిమానిగా ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ఒక యువకుడి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయనే తమిళనాడు మానవ వనరుల శాఖ మంత్రి ఎస్.రమేష్.

సామాన్య నేపథ్యం

మే 4న ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్, మే 21న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొడుకు రాష్ట్రానికి మంత్రి అయితే ఏ తల్లిదండ్రులైనా ఎలా ఉంటారు? ఎంతో విలాసవంతమైన జీవితాన్ని ఊహించుకుంటారు. కానీ, రమేష్ తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ తమ పాత జీవితాన్నే కొనసాగిస్తున్నారు. కొడుకు పెద్ద పదవిలో ఉన్నా తాము నమ్ముకున్న కష్టాన్ని వారు వదిలిపెట్టలేదు. మంత్రి రమేష్ తండ్రి కె.శ్రీనివాసన్ మరైమలై నగర్‌లోని ప్రముఖ శివ విష్ణు ఆలయంలో అర్చకుడిగా యథావిధిగా పనిచేసుకుంటుండటం విశేషంగా చెబుతున్నారు. ఇక మంత్రి రమేష్ తల్లి సుమతి వంట పని చేస్తున్నారు. ఆమె ప్రతిరోజూ మరైమలై నగర్ నుంచి మైలాపూర్‌కు లోకల్ ట్రైన్లు, బస్సుల్లో ప్రయాణిస్తూ ఇళ్లల్లో వంట మనిషిగా పని చేస్తున్నారు.

సొంత ఇల్లు కూడా లేదు!

మంత్రి రమేష్ కుటుంబానికి ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. ఒక ప్రైవేట్ ఆలయానికి సంబంధించిన స్థలంలో నిర్మించిన చిన్న ఇంట్లో మంత్రి కుటుంబం నివసిస్తోంది. అయితే ఇళ్లు గుడి స్థలంలో ఉండటం వల్ల వారు ఎలాంటి అద్దె చెల్లించడం లేదని చెబుతున్నారు. కొడుకు ఎమ్మెల్యే అయి, ఆపై క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా వీరు అదే ఇంట్లో ఉంటూ రోజువారీ పనులకు వెళ్లడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.

మా పని మాత్రమే తెలుసు

ఈ విషయమై మంత్రి రమేష్ తండ్రి శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ‘దశాబ్దాలుగా మా కుటుంబం చాలా పేదరికంలో, పరిమిత వసతుల మధ్య బతికింది. మాలో ఒకరు ఒకరోజు రాష్ట్రానికి మంత్రి అవుతారని మేం కలలో కూడా ఊహించలేదు. ఈ ఇంట్లోకి మారిన తర్వాత మాకు అద్దె కష్టాలు తప్పాయి. మా కొడుకు మంత్రి అయినా.. మా పని మేం చేసుకోవడమే మాకు తెలుసు’ అని ఎంతో వినమ్రంగా చెప్పారు.

రాజకీయాల్లోకి రాగానే కోట్లు సంపాదించడం, కుటుంబ సభ్యులంతా విలాసాల్లో మునిగిపోవడం చూసే ఈ రోజుల్లో ఒక సామాన్యుడు మంత్రి అయినా, ఆయన తల్లిదండ్రులు నిరాడంబరంగా జీవించడం నిజంగా గర్వించదగ్గ విషయమని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఒక సాధారణ అభిమానిని గుర్తించి, అతనికి టికెట్ ఇచ్చి మంత్రిని చేసిన ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయాన్ని, కొడుకు పెద్ద పదవిలో ఉన్నా శ్రమను నమ్ముకున్న ఆ తల్లిదండ్రుల ఆదర్శాన్ని నెటిజన్లు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.

Tags:    

Similar News