గడ్కరీ శుభవార్త చెప్పినా EV కారు కొనాలంటే ప్రజలు ఎందుకు భయపడుతున్నారు?
ప్రస్తుత కాలంలో వాహనదారుల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారిన ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) వర్సెస్ పెట్రోల్ కార్ల అంశంపై ప్రజల్లో విపరీతమైన చర్చ సాగుతోంది.
ప్రస్తుత కాలంలో వాహనదారుల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారిన ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) వర్సెస్ పెట్రోల్ కార్ల అంశంపై ప్రజల్లో విపరీతమైన చర్చ సాగుతోంది. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని స్పష్టంగా అర్థమవుతున్నా.. వినియోగదారులు కొత్త ఈవీ (EV) కారు కొనడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారో విశ్లేషించాల్సి ఉంటుంది. భవిష్యత్తు సాంకేతికత వైపు అడుగులు వేయాలనుకునే ప్రతీ సగటు వాహనదారుడి మనసులో మెదిలే సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈవీ కంపెనీలపై ఉంది.
వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయకపోవడానికి ప్రధానంగా మూడు కీలక కారణాలు బలంగా పని చేస్తున్నాయి. మొదటిది పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈవీల ప్రారంభ కొనుగోలు ధర చాలా ఎక్కువగా ఉండటం. రెండవది- మన దేశంలో ఈ సాంకేతికత ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నందున.. భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని సరిదిద్దే వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదనే ఆందోళన. మూడవది - పెట్రోల్ బంకుల మాదిరిగా విస్తృతంగా ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్ లేకపోవడం. ఈ మూడు ప్రతిబంధకాలు కొనుగోలుదారులను కొంతకాలం వేచి చూసేలా చేస్తున్నాయి.
అయితే రన్నింగ్ - మెయింటెనెన్స్ ఖర్చుల పరంగా చూస్తే ఈవీలే ఎంతో పొదుపైనవి. పెట్రోల్ కార్ల ప్రారంభ ధర తక్కువగా ఉన్నా.. రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరల వల్ల వాటి రన్నింగ్ కాస్ట్ భారం అవుతుంది. మరోవైపు విద్యుత్ ఛార్జింగ్ ఖర్చు చాలా తక్కువగా ఉండటంతో ఈవీలు దీర్ఘకాలంలో ఎకనామికల్‌గా మారుతాయి. అంతేకాకుండా.. పెట్రోల్ ఇంజిన్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల్లో మూవింగ్ పార్ట్స్ (కదిలే భాగాలు) తక్కువగా ఉండటం వల్ల వాటి నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.
ఈవీ కార్ కొనేవారికి మంత్రి వర్యుల శుభవార్త:
ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే వారికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల బిగ్ అప్‌డేట్‌ను ఇచ్చారు. 32వ కన్వర్జెన్స్ ఎక్స్‌పోలో మంత్రి మాట్లాడుతూ.. మరో ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ వాహనాల ధరలతో సమానంగా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ప్రారంభ ధర తగ్గుముఖం పడితే ఛాయిస్ ఎంతో సులువవుతుందని.. తద్వారా ఈవీ రంగంలో విప్లవాత్మక మార్పు రాబోతోందని అమాత్యుల వ్యాఖ్యలు స్పష్ఠం చేసాయి. అయితే ఈవీల విషయంలో ఫెయిల్యూర్ గురించి, బ్యాటరీ బ్లాస్ట్ ల గురించి కూడా కొనుగోలు దారుల్లో చర్చ సాగుతోంది. అయితే బ్యాటరీల నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలతో కొన్నిటిని అధిగమించవచ్చు.