భారత్ లో టెస్లా బుడి బుడి అడుగులు... టాటా మోటార్స్ పరుగులు!

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్ లోకి.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ప్రవేశించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-12-02 17:30 GMT

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్ లోకి.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే భారత మార్కెట్ లో ఈ కార్ల అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి. ఇందులో భాగంగా... గవర్నమెంట్ వెహికల్ పోర్టల్ ప్రకారం... నవంబర్ లో టెస్లా కేవలం 48 కార్లను మాత్రమే అమ్మినట్లు తెలుస్తోంది.

అవును... భారత్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లోకి టెస్లా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రవేశం కాస్తా నెమ్మదిగా ప్రారంభమైంది. ఈ క్రమంలో సెప్టెంబర్ లో డెలివరీలు ప్రారంభించినప్పటి నుంచీ కంపెనీ 157 కార్లను మాత్రమే విక్రయించింది. ఈ క్రమంలో బీఎండబ్ల్యూ, మెర్సిడేస్ - బెంజ్ వంటి ఇప్పటికే స్థిరపడిన వాటికంటే వెనుకబడి ఉంది.

బీఎండబ్ల్యూ ఇండియా నవంబర్ లోనే 267ఈవీ లను విక్రయించగా.. మెర్సిడేజ్ బెంజ్ నవంబర్ లో 69 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఇందులో టెస్కా ఈవైకి ప్రధాన ప్రత్యర్థి అయిన బీఎండబ్ల్యూ - ఐఎక్స్ఐ ఎస్.యూ.వీ.. ప్రతినెలా సగటున 150 కార్లకుపైగా విక్రయించగా.. మరో ప్రధాన పోటీ దారైన మెర్సిడేజ్ బెంజ్ - ఈక్యూఎస్ మోడల్ ప్రతి నెలా సగటున 70 యూనిట్లను విక్రయించింది.

ఇక ప్రభుత్వ వాహన డేటా ప్రకారం... భారతదేశ విస్తృత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ 57% వృద్ధి చెంది 2025 మొదటి 11 నెలల్లో 1,50,000 వాహనాలకు చేరుకుంది. ఈ పరిణామంలో ఎక్కువ భాగం టాటా మోటార్స్ వాహనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా స్పందించిన బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్... ఈవీలు ఇప్పుడు కంపెనీ మొత్తం అమ్మకాలలో దాదాపు ఐదు వంతు వాటా కలిగి ఉన్నాయని అన్నారు.

దూసుకుపోతున్న టాటా మోటార్స్!:

మరోవైపు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీ.ఎం.పీ.వీ) లిమిటెడ్.. నవంబర్ 2025లో బలమైన పనితీరును నమోదు చేసింది. ఇందులో భాగంగా... మొత్తం దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలు 25.6% పెరిగి 59,199 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 47,117గా ఉంది. ఈ క్రమంలో.. ఎలక్ట్రిక్ వాహనాలు సహా దేశీయ ప్రయాణికుల వాహనాల అమ్మకాలు గా ఏడాదితో పోలిస్తే 22 శాతం పెరిగి 57,436 యూనిట్లకు చేరుకున్నాయి.

ఇక ఎగుమతుల విషయానికొస్తే... వీటి సంఖ్య గత ఏడాదిలో 54 యూనిట్లుగా ఉండగా.. నవంబర్ 2025లో ఏకంగా 3,164.8 శాతం పెరిగి 1,763కు చేరుకున్నాయి. ఇక... దేశీయ అంతర్జాతీయ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 2024 నవంబర్ లో 5,202 గా ఉండగా.. ఈ నవంబర్ 2025లో 52.2 శాతం బలమైన పెరుగుదల నమోదు చేసి 7,911కు చేరుకున్నాయి.

Tags:    

Similar News